మనం ఇప్పటి వరకు ‘బర్డ్ ఫ్లూ’ గురించే విన్నాం. తాజాగా ‘కౌ ఫ్లూ’ అనే వైరస్ కూడా పుట్టుకొచ్చింది. ఆవుల నుంచి లేదా ఆవు పాల నుంచి ఈ వైరస్ సంక్రమిస్తుంది. ‘‘మేం తాగేది గేదె పాలు.. మేం సేఫ్’’ అనుకోవద్దు. అది పేరుకే కౌఫ్లూ, అది అన్నిరకాల జీవరాశులకూ సంక్రమించగలదు. అయితే, ఈ వైరస్ వ్యాప్తికి మొదటి మూలం.. ‘బర్డ్ ఫ్లూ’ అంటే నమ్ముతారా? తప్పకుండా నమ్మాల్సిందే. ఎందుకంటే.. ఇప్పటికే అమెరికాలో ఈ ఫ్లూ మొదలైంది. ఈ నేపథ్యంలో ఆవులపై జరిపిన పలు పరిశోధనల్లో.. కొన్ని షాకింగ్ విషయాలు తెలిశాయి. అవేంటో చూడండి.
ఎలా ప్రారంభమైంది?
టెక్సాస్‌లోని వ్యవసాయ క్షేత్రంలో కొన్ని ఆవులు వైరస్ బారిన పడ్డాయి. అవి తీవ్ర అనారోగ్యానికి గురయ్యాయి. వైద్య పరీక్షల్లో వాటికి బర్డ్ ఫ్లూ సోకినట్లు తేలింది. బర్డ్ ఫ్లూ కలిగిన కొన్ని అటవీ పక్షుల ద్వారా ఆవులకు వైరస్ సోకి ఉంటుందని బావిస్తున్నారు. అయితే, ఆ ఆవులను ముట్టుకున్న రైతులు కూడా అనారోగ్యానికి గురయ్యారు. అయితే, వారిలో ప్రమాదకరమైన లక్షణాలేవీ కనిపించలేదు. అయితే, ఆవు నుంచి మనుషులకు సంక్రమించే ఈ వైరస్.. శ్వాసకోస కణాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు అమెరికాలోని విస్కాన్సిన్-మాడిసన్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు తెలుసుకున్నారు.
పక్షుల్లో కనిపించే H5N1 వైరస్‌కు కౌ ఫ్లూకు చాలా తేడా ఉన్నట్లు తెలుసుకున్నారు. అలాగే, ఈ వైరస్‌కు గురైన ఆవు పాలను తాగేవారికి కూడా ఫ్లూ సోకే అవకాశాలు ఉన్నట్లు తాజా అధ్యయనంలో తేలింది. దీన్ని ధృవీకరించడానికి ముందు.. పరిశోధకులు న్యూ మెక్సికోలో వైరస్ సోకిన ఆవు పాలను ఎలుకలకు తాగించారు. దీంతో అవి కూడా అనారోగ్యానికి గురయ్యాయి. అలాగే గాలి ద్వారా కూడా వైరస్‌ను వ్యాప్తి చేసే ప్రయత్నం చేశారు. కానీ, అది స్వల్ప ప్రభావమే చూపింది. ఆ ఎలుకల రోగనిరోధక శక్తి వెంటనే ఆ వైరస్‌కు వ్యతిరేకంగా పనిచేయడం వల్ల అవి పెద్దగా అనారోగ్యానికి గురికాలేదు.
ప్రస్తుతానికి సేఫే.. కానీ, భవిష్యత్తులో ప్రమాదమే
ప్రస్తుతం H5N1 ఇన్ఫ్లుఎంజా వైరస్ నియంత్రణలోనే ఉంది. ఆవుల నుంచి మనుషులకు గాలి ద్వారా వ్యాపించడం లేదు. కానీ, భవిష్యత్తులో ఈ వైరస్ మరింత బలోపేతమై.. సమస్యగా మారవచ్చని యూనివర్శిటీ ఆఫ్ గ్లాస్గో సెంటర్ ఫర్ వైరస్ రీసెర్చ్‌కు చెందిన నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కౌ ఫ్లూ ఐసోలేట్‌ను బర్డ్‌ప్లూతో పోల్చినప్పుడు.. మానవుల్లో శ్వాసకోస ఇన్‌ఫెక్షన్ల ద్వారా వ్యాపించే గుణాలను పొందినట్లు గుర్తించామని పేర్కొన్నారు. ప్రస్తుతానికైతే ఈ ఫ్లూకు గురైన నలుగురి వ్యక్తుల్లో ఏదీ అంత ప్రభావంతంగా కనిపించలేదని స్పష్టం చేశారు. అయితే ఈ కొత్త H5N1 ఇన్ఫ్లుఎంజా వైరస్‌ను భవిష్యత్తులో నియంత్రించడం కష్టం కావచ్చని అంటున్నారు. ఈ వైరస్ గాలి ద్వారా వ్యాపించే శక్తిని పొందినట్లయితే కోవిడ్-19 తరహాలోనే ప్రమాదకరంగా మారవచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Also Read: కాఫీ తాగడానికి బెస్ట్ టైమ్స్ ఇవే - మీరూ తప్పకుండా ట్రై చెయ్యండి, మంచి ఫలితాలుంటాయి