Molestation attempt on Lady in Visakha Express | మిర్యాలగూడ: చిన్నారులు, బాలికలు, మహిళలపై లైంగిక వేధింపులు, లైంగిక దాడులు ఆగడం లేదు. అనకాపల్లిలో ఓ ప్రేమోన్మాది ఇంట్లోకి చొరబడి యువతి మెడపై కత్తితో నరికి ఆమెను హత్య చేశాడు. ఇటీవల హైదరాబాద్ లో సైట్ చూపిస్తామని కారులో తీసుకెళ్లి కూల్ డ్రింకులో మత్తు మందు కలిపి యువతిపై ఇద్దరు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఎన్ని చట్టాలు తెచ్చినా, శిక్షలు వేసినా కొందరిలో మార్పు రావడంలేదు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ప్రైవేటు స్కూల్ టీచర్‌కు అలాంటి చేదు అనుభవమే ఎదురైంది.


తాజాగా విశాఖ ఎక్స్ ప్రెస్ రైళ్లో యువతి లైంగిక వేధింపులు ఎదుర్కొంది. మద్యం మత్తులో ఉన్న ఓ యువకుడు విశాఖ ఎక్స్‌ప్రెస్‌ రైల్లో ప్రయాణికురాలిపై లైంగిక దాడికి యత్నించాడు. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలైనట్లు రైల్వే పోలీసులు తెలిపారు. రైల్వే పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. సికింద్రాబాద్‌ నుంచి ఒడిశాలోని భువనేశ్వర్‌ వెళ్లే విశాఖ ఎక్స్‌ప్రెస్‌ మంగళవారం (జులై 9న) రాత్రి 7 గంటలకు మిర్యాలగూడ రైల్వే స్టేషన్‌కు వచ్చింది. సాధారణంగా స్టేషన్‌ సమీపంలోకి రాగానే రైలు వేగం తగ్గుతుంది. మిర్యాలగూడ స్టేషన్ కు చేరుకుంటుండుగా విశాఖ ఎక్స్ ప్రెస్ రైలు వేగం తగ్గింది. ఎస్‌-2 కోచ్‌లో ఓ యువతి వాష్‌రూమ్‌ వెళ్లి తిరిగి  సీటు వద్దకు వెళ్తుండగా మద్యం మత్తులో ఉన్న యువకుడు ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆమె నడుం పట్టుకుని కిందకి లాగడంతో రైలు నుంచి కింద పిడిపోయింది. ఈ క్రమంలో నిందితుడు కూడా రైలు నుంచి కిందపడ్డాడు. నిందితుడ్ని ఒడిశాకు చెందిన బిశ్వాస్ గా గుర్తించారు. 


అనంతరం బాధితురాలు స్థానికులకు జరిగిన విషయం చెప్పింది. వారు విశాఖ ఎక్స్ ప్రెస్ రైల్లో ఆమెపై జరిగిన లైంగిక దాడి యత్నంపై రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. రైల్వే ఎస్‌ఐ పవన్‌ కుమార్‌రెడ్డి అక్కడికి చేరుకుని మహిళను చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. మద్యం మత్తులో ఉన్న నిందితుడు బిశ్వాస్‌ను మరో అంబులెన్స్‌లో ఆసుపత్రికి చేర్చారు. యువతి ఫిర్యాదు చేయడంతో రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.