ఆరోగ్యమే మహాభాగ్యమని ఊరికే అనలేదు పెద్దలు. ఆరోగ్యాన్ని కాపాడుకుంటేనే జీవితం ఆనందంగా ఉంటుంది. యువతలో ఒక అలవాటు ఉంది. బైక్ డ్రైవ్ చేస్తున్నా, స్నేహితులతో ఆడుతున్నా నోట్లో చూయింగ్ గమ్ నమలాల్సిందే. దీన్ని వారు స్టైలిష్‌గా భావిస్తారు. కొంతవరకు చూయింగ్ గమ్ నమలడం మంచి వ్యాయామమనే చెప్పాలి. నోటికి, ముఖానికి నమలడం అనేది మంచి ఎక్సర్‌సైజ్. అయితే అప్పుడప్పుడు ఆ చూయింగ్ గమ్ అనుకోకుండా మింగేసే వాళ్ళు ఉన్నారు. ఇలా చూయింగ్ గమ్ మింగితే ఏమవుతుందో తెలుసా?
ఎంతోమంది చూయింగ్ గమ్ మింగేసి చాలా భయపడుతూ ఉంటారు. అది పేగులకు చుట్టుకుపోయి అక్కడే ఉండిపోతుందని అంటారు. కొంతమంది అయితే ఏడేళ్ల వరకు చూయింగ్ గమ్ బయటకు రాదని పొట్టలోనే ఉంటుందని చెబుతారు. నిజానికి అవన్నీ అపోహలే. చూయింగ్ గమ్ పొరపాటున మింగేస్తే భయపడకండి. మన శరీరం జీర్ణించుకోలేదు. పేగులకు కూడా అది అంటుకోదు. మన పొట్టలో అరగని పదార్థాలు అన్నీ కూడా పేగుల ద్వారా బయటికి వెళ్లిపోతాయి. చూయింగ్ గమ్ అరిగించే శక్తి కూడా మన శరీరానికి లేదు. కాబట్టి అది పేగుల ద్వారా బయటికి వచ్చేస్తుంది. అయితే చూయింగ్ గమ్ బయటికి రావడానికి కనీసం 12 నుంచి 48 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. పొరపాటున మింగితే నీళ్లు అధికంగా తాగండి. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోండి. ఇలా చేయడం వల్ల చూయింగ్ గమ్ బయటికి వేగంగా మలవిసర్జన ద్వారా వచ్చేసే అవకాశం ఉంది.
చూయింగ్ గమ్ నమలడం వల్ల హాని లేదా? అని ఎవరైనా అడగవచ్చు. చాలా అరుదైన పరిస్థితుల్లో మాత్రమే చూయింగ్ గమ్ వల్ల ఇబ్బందులు వస్తాయి. సాధారణంగా అయితే చూయింగ్ గమ్ బయటికి వచ్చేస్తుంది. అలా రాకుండా లోపలే ఉండిపోతే పేగులకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. వాంతులు, కడుపునొప్పి, మలబద్ధకం, విరేచనాలు వంటివి అవుతాయి. ఇది తిన్నాక మీకు ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను కలిసి తగిన చికిత్స తీసుకోండి. చూయింగ్ గమ్ రెండూ మూడు ఒకేసారి నోట్లో వేసుకోవడం వంటివి చేయకండి.
చూయింగ్ గమ్ చరిత్ర ఈనాటిది కాదు. 1866లో మెక్సికో దేశపు సైనిక నియంత సాంటా అన్నా దీన్ని కనిపెట్టినట్టు చెబుతారు. అతను మెక్సికోలో అంతర్యుద్ధం జరిగినప్పుడు తెల్లటి జిగురు పదార్థాన్ని తీసుకుని అడవుల్లోకి వెళ్లిపోయారు. ఆ జిగురు పదార్థాన్ని నములుతూ ఉన్నాడు. చెట్టు బెరడు నుంచి వచ్చే జిగురు పదార్థాన్ని అక్కడి సైనికులు తింటూ ఉండేవారు. థామస్ ఆడమ్స్ అనే శాస్త్రవేత్త ఆ జిగురు ముక్కతో పంచదార బిళ్లలాంటివి తయారు చేసి అమ్మడం మొదలుపెట్టాడు.
Also read: టీ పొడి మీ ఇంట్లో ఉంటే మీరు కోటీశ్వరులే, దీని ధర ఆ రేంజ్లో ఉంటుంది మరి
Also read: కాల్చిన వెల్లుల్లిని అప్పుడప్పుడు తింటే క్యాన్సర్ బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చు
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.