'యజ్ఞం', 'పిల్లా నువ్వు లేని జీవితం' వంటి సినిమాలు తెరకెక్కించి టాలీవుడ్ లో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఏఎస్ రవికుమార్ చౌదరి ఇటీవల హీరో గోపీచంద్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన 'అసలు వాడు ఒక హీరోనేనా? అంటూ గోపీచంద్ పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. విలన్ ను హీరోగా మార్చాను అంటూ చెప్పారు. గోపీచంద్ విలన్ గా చేస్తున్న సమయంలో అతనితో 'యజ్ఞం' సినిమా తీశారు రవికుమార్ చౌదరి. అప్పట్లో ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. అలాగే అప్పటివరకు విలన్ ఇమేజ్ ఉన్న గోపీచంద్ కి ఈ సినిమా హీరోగా మంచి గుర్తింపు తెచ్చింది.


అయితే ఇటీవల ఇంటర్వ్యూలో రవికుమార్ చౌదరి మాట్లాడుతూ.." నేను హిట్స్ ఇచ్చిన హీరోలే ఇప్పుడు నన్ను పట్టించుకోవడం లేదు. మేము సినిమాలు చేసే సమయంలో చెట్ల కింద కూర్చుని భోజనం చేసేవాళ్లం. ఇప్పుడు వాళ్ళని కలవాలంటే ఐదారుగురిని దాటుకుని వెళ్ళాలి. నా పుట్టినరోజుకి వచ్చావు. నేను తుమ్మినా, దగ్గినా వచ్చావ్. మరి ఇప్పుడు అంత బలుపు దేనికి. రవికుమార్ మిమ్మల్ని కలవడానికి వచ్చారు? అంటే కాసేపు వెయిట్ చేయమను అని అంటావా? అంత బలిసిందా నీకు. అది చాలా తప్పు. విలన్ గా ఉన్న నిన్ను నేను హీరోగా చేశాను. మేకప్ వేసుకున్నాక మేకలాంటి చేష్టలు చేస్తారు. ఇండస్ట్రీలో అలా చేసే వాళ్ళు చాలా మంది హీరోలు ఉన్నారు" అంటూ పరోక్షంగా గోపీచంద్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో రవికుమార్ చౌదరి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఆయన కామెంట్స్ పై గోపీచంద్ ఫ్యాన్స్ సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఇక ఇప్పుడు మరో ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన తనుకు గోపీచంద్ కి మధ్య ఎలాంటి గొడవలు లేవని, తానే అనవసరంగా నోరు జారానని క్లారిటీ ఇచ్చారు. ఇక తాజాగా మరో మీడియా ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన రవికుమార్ చౌదరి ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.." నాకు గోపీచంద్ కు మధ్య ఎటువంటి పొరపచ్చాలు లేవు. అతను నాకు బిడ్డ లాంటి వాడు, ఒక తమ్ముడి లాంటివాడు. కానీ మొన్న ఓ టీవీ ఛానల్ లో ఆవేదనతో అలా మాట్లాడాను. నేను చేసిన కామెంట్స్ కి గోపీచంద్ ఫాన్స్ హర్ట్ అయ్యారు. నాకు ఫోన్స్ కూడా వచ్చాయి. వాళ్లందరికీ చెప్పేదేంటంటే, ఇప్పటికీ నాకు గోపీచంద్ ఒకటి కాదు పది సినిమాలైనా చేస్తాడు. కానీ కొన్ని విషయాల్లో నేను ఘాటుగా స్పందించానేమో అని నాకు అనిపించింది. దానికి నేను రిగ్రేడ్ ఫీల్ అవుతున్నాను. గోపి ఇప్పటికీ నా బిడ్డే. గోపి ఫ్యాన్స్ అంటే మా అందరికీ అన్నదమ్ముల లాంటివారే" అని అన్నారు.


గోపీచంద్ పై ఎందుకు అలా రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది? అని యాంకర్ అడిగినప్పుడు.." ఎదుటి వారు అడిగే ప్రశ్నలపై అది ఆధారపడి ఉంటుంది. మీరు ఒకటి అడిగినప్పుడు నేను ఆ తడబాటులో వేరేది చెప్పు ఉండడం గానీ అలాంటి మిస్టేక్ లో అలా మాట్లాడాల్సి వచ్చింది తప్ప మరేమీ లేదు. అయినా గోపీచంద్ తో పాటు ఆయన ఫ్యాన్స్ కూడా నన్ను అర్థం చేసుకోగలరు. ఇప్పటికీ మా మధ్య మంచి రిలేషన్ ఉంది. ఇప్పుడు గోపికి నేను ఫోన్ చేసినా మేమిద్దరం అన్నదమ్ములాగే మాట్లాడుకుంటాం. కానీ నేనే కొంచెం ఎమోషనల్ అయి తప్పు చేశానేమో అని నాకే అనిపించింది. దానికి నేను ఇప్పటికీ రిగ్రేడ్ ఫీలవుతున్నాను" అంటూ చెప్పుకొచ్చారు. దీంతో తాజా ఇంటర్వ్యూలో రవికుమార్ చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.


Also Read : 'గదర్ 2'ను ఆస్కార్స్ కు పంపిస్తారా? - సంచలన విషయాన్ని బయటపెట్టిన దర్శకుడు




Join Us on Telegram: https://t.me/abpdesamofficial