పెళ్లయిన వెంటనే పిల్లలు వద్దనుకునేవారు, ఒక పాపో బాబో పుట్టాక రెండు మూడేళ్లు గ్యాప్ ఇవ్వాలనుకునే వాళ్లు గర్భనిరోధక పద్ధతులను పాటిస్తున్నారు. ఎక్కువ మంది మహిళలు పాటించే సాధనం లూప్. దీన్ని ఐయూసీడీ (ఇంట్రాయూటెరిన్ కాంట్రసెప్టివ్ డివైస) అంటారు. ఇది ఆంగ్ల అక్షరం టి ఆకారంలో ఉండే చిన్న పరికరం. అందుకే దీన్ని కాపర్ టి అని కూడా పిలుస్తారు. టి ఆకారంలో ఉన్న ప్లాస్టిక్ కు రాగి తీగ చుట్టి ఉంటుంది. దీన్ని మహిళల గర్భాశయంలో అమరుస్తారు. ఇది అండం, వీర్యం కలవకుండా చేసి గర్భం రాకుండా అడ్డుకుంటుంది. ప్రస్తుతం విజయవంతమైన గర్భనిరోధక పద్దతి ఇది. దీన్ని గర్భాశయంలో అమర్చినప్పటికీ అసౌకర్యం ఉండదు.  అయితే చాలామంది మహిళల్లో లూప్ వేయించుకోవడం పట్ల కొన్ని అపోహలు ఉన్నాయి. కొందరికి లూప్ పడదని  వాదించే వాళ్లూ ఉన్నారు. ఈ విషయంలో గైనకాలజిస్టులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం. 


అది అపోహే...
లూప్ పడదు అనే అపోహ ఎందుకు పుట్టిదంటే... కొందరిలో అది సరైన స్థానంలో ఇమడదు. దీని వల్ల వేయించుకున్న రెండు మూడు నెలల్లోనే బయటికి వచ్చేస్తుంది. దీని వల్ల ఏం సమస్యా ఉండదు. తిరిగి వైద్యులను సంప్రదిస్తే వారు తిరిగి సెట్ చేస్తారు. అలాగే కొందరిలో లూప్ వేయించుకున్నాక ఏ సమస్యా ఎదురుకాదు. కానీ కొందరిలో మాత్రం రక్తస్రావం కావడం, నెలసరి ఎక్కువ రోజులు కావడం లాంటి మార్పులు కనిపిస్తాయి. దీని వల్ల లూప్ పడలేదని అనుకుంటారు, కానీ అది అపోహే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అది లూప్ వేయించుకున్న చాలా మందిలో కనిపించే మార్పేనని,  నెల రోజుల్లో అంతా కుదురుకుంటుందని చెబుతున్నారు. లూప్ పడకపోవడం అనేది ప్రజల్లో ఉన్న అపోహ మాత్రమేనని తేల్చి చెబుతున్నారు. 


సొంతంగా ప్రయత్నించొద్దు
లూప్ ను దీర్ఘకాలం పాటూ అంటే మూడేళ్ల నుంచి అయిదేళ్ల వరకూ ఉపయోగించినా ఎలాంటి ఇబ్బంది ఉండదు. లూప్ కాలపరిమితిని బట్టి ప్రతి మూడేళ్లకు లేదా అయిదేళ్లకోసారి మార్పించుకుంటే సరిపోతుంది. లూప్ పెట్టేటప్పుడు, తీసేటప్పుడు ఎలాంటి అనస్తీషియా ఇవ్వరు. పెద్దగా నొప్పి కూడా రాదు. అలాగని సొంతంగా తీసుకునేందుకు పయత్నించొద్దు. గర్భనిరోధక మాత్రలు వాడడంతో పోలిస్తే లూప్ అన్ని విధాలుగా ఆరోగ్య దాయకమైనది. 


ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు. 


Also read: ఈ చిన్న ట్యాబ్లెట్ చెరువు నీటిని మంచినీరుగా మార్చేస్తుంది .... కొత్త పరిశోధన సక్సెస్


Also read: విటమిన్ సి తగ్గిందో... ఈ రోగాలన్నీ దాడి చేసేందుకు రెడీ


Also read: వేడి నీళ్లలో తేనె కలుపుకుని తాగితే మంచిదేగా? ఆయుర్వేదం కాదంటోంది ఎందుకు?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి