పారుతున్న నది లేదా వాగు లోంచి నీరు తీసి నేరుగా తాగే పరిస్థితులు లేవు. కానీ ఈ చిన్న మాత్ర ఆ నీటిలో వేస్తే కలుషిత నీరు మంచినీరుగా మారిపోతుంది. ఆ ట్యాబ్లెట్ ‘హైడ్రోజెల్ మాత్ర’. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య మంచినీరు. ఎంతో మంది కలుషిత నీటిని తాగి రోగాల బారిన పడుతున్నారు. స్వచ్ఛమైన మంచినీరు అందుతున్నది చాలా కొద్దిమందికే. అందుకే ఆస్టిన్ లోని టెక్సాస్ యూనివర్సిటీ నిపుణులు కలుషిత నీటిని, మంచి నీటిగా మార్చే సులభమైన పద్ధతుల కోసం ఎన్నో ఏళ్లుగా పరిశోధనలు చేస్తున్నారు. ప్రస్తుతం అందరం నీటిలోని బ్యాక్టిరియాను చంపేందుకు వాడుతున్న పద్ధతి నీరుగా ఎక్కువ ఉష్ణోగ్రతల వద్ద మరగబెట్టి, చల్లార్చి తాగడం. అన్ని చోట్ల నిప్పు అందుబాటులో ఉండకపోవచ్చు. ముఖ్యంగా ప్రయాణాలలో ఈ పద్ధతి కష్టమే.
కొత్త అధ్యయనంలో పరిశోధకులు సులువుగా అమలు చేసే, శక్తి, ఇంధనం అవసరం లేని ఒక పద్ధతిని అభివృద్ధి చేశారు. వీరు తయారుచేసి హైడ్రోజెల్ మాత్రను నీటి కంటైనర్ లో వేసి ఓ గంట పాటు వదిలేస్తే చాలు 99.99 శాతం బ్యాక్టిరియాను ఒక గంటలోపు చంపుతుంది. తరువాత ఆ మాత్రను తీసిపడేసి, నీటిని వడకట్టుకుని నేరుగా తాగేయచ్చు. నది నీటిపై ఆధారపడి బతుకున్న గ్రామస్థులు ఎంతో మంది ఉన్నారు. వారందరి కోసమే ఈ మాత్రను తయారుచేశారు. పట్టణాల్లో చాలా చోట్ల స్వచ్ఛమైన నీరు దొరుకుతున్నప్పటికీ పలెటూళ్లలో నది నుంచి లేదా నీటి ఊట నుంచి నీరు తెచ్చుకుంటున్న వాళ్లే అధికం. నీటిలో హైడ్రోజెల్ మాత్రను వేయగానే అది హైడ్రోజన్ పెరాక్సైడ్ ను ఉత్పత్తి చేస్తుంది. అది బ్యాక్టిరియా జీవక్రియలకు అంతరాయం కలిగించి, ఉత్తేజిత కార్బన్ కణాలతో నిర్వీర్యం చేస్తుంది. ఈ ప్రక్రియలో ఎలాంటి హానికరమైన అవశేషాలు ఉత్పత్తి కాలేదని చెప్పింది పరిశోధకుల బృందం.
హైడ్రెజెల్ మాత్రలను ఉత్పత్తి చేయడం కూడా చాలా సులువు. అంతేకాదు చవకగానే అందించవచ్చు. కాబట్టి వీటిని ప్రపంచవ్యాప్తంగా మంచినీటి శుధ్ది కోసం ప్రజలు ఉపయోగించేలా చేయవచ్చని అభిప్రాయపడుతున్నారు ఈ అధ్యయనంలో కీలకపాత్ర పోషించిన గుయిహువా. అదనంగా అనేక రకాల బ్యాక్టిరియా, వైరస్ లను చంపేవిధంగా హైడ్రోజెల్స్ ను రూపొందిండం తమ తదుపరి కర్తవ్యమని చెబుతున్నారు. పరిశోధకులు.
Also read: శునకాలు మరణాన్ని ముందే పసిగడతాయా? వాటి అరుపులతో ఆ విషయాన్ని మనకు తెలియజేస్తాయా?
Also read: ఈ అలవాట్లు మానుకోండి... లేకుంటే కిడ్నీలకు ప్రమాదం తప్పదు