ఊబకాయం.. ప్రస్తుతం చాలామందిలో ఇదే సమస్య. దీన్ని అధిగమించడానికి, బరువు తగ్గడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాం. కానీ ఏదీ ఫలితం ఇవ్వకపోవడంతో చాలా నిరుత్సాహపడుతుంటాం. నిజానికి వెయిట్ తగ్గడం అంత సులభం కాదు. దానికి ప్రత్యేక శ్రద్ధ అవసరం. తినే తిండిపైనా, చేసే వర్కవుట్ లపైనా కచ్చితమైన నిబద్ధత కావాలి. అయితే ప్రతిరోజూ ఉదయాన్నే కొన్ని పనులు చేయడం వల్ల కూడా సులభంగా వెయిల్ లాస్ కావొచ్చట. 


వ్యాయామం..


వెయిట్ తగ్గాలనుకునేవారు ఉదయాన్నే లేవడం చాలా మంచి విషయం. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల బరువు తగ్గే అవకాశం ఎక్కువ ఉంది. ఇలా ఉదయాన్నే వ్యాయామం చేయడం వల్ల శరీరంలో షుగర్ లెవల్స్ కంట్రోల్ లో ఉంటాయి. దీని వల్ల ఎన్నో లాభాలే కాక ఇతర రోగాలు రాకుండా రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.


బరువు చూసుకోవడం..


తరచుగా బరువు చూసుకోవడం వల్ల మనకు వ్యాయామం చేయాలని, వెయిట్ తగ్గాలనే ఉత్సాహం పెరుగుతుంది. 6 నెలలపాటు తరచుగా వెయిట్ చెక్ చేసుకున్న 47 మంది దాదాపు 6 కిలోలు బరువు తగ్గినట్లు ఓ అధ్యయనంలో తేలింది. ఇలా బరువు చెక్ చేసుకోవడంలో మన లక్ష్యంలో ఎంతమేర సాధించామో అర్థమవుతుంది.


బ్రేక్ ఫాస్ట్ లో..


శరీర ఆరోగ్యానికి ప్రొటీన్ చేసే మేలు ఎంతో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మన బ్రేక్ ఫాస్ట్ లో ప్రొటీన్ శాతం ఎక్కువ ఉంటే ఆకలి త్వరగా వేయదు. దీని వల్ల వెయిట్ పెరిగే అవకాశం కూడా తక్కువగా ఉంటుంది. ఇలా చేయడం వల్ల ఆకలి కూడా తక్కువగా వేస్తుందని ఓ అధ్యయనంలో తేలింది. ప్రొటీన్ల కోసం రోజూ బ్రేక్ ఫాస్ట్ లో గుడ్లు, పెరుగు, డ్రై ఫ్రూట్స్, పెసలు తీసుకోవచ్చు.


నీరు ఎక్కువగా తాగడం..


ఉదయాన్నే లేచాక.. ఒకటి లేదా రెండు గ్లాసుల నీళ్లు తాగడం వల్ల కూడా బరువు తగ్గొచ్చు. వాటర్ తాగడం వల్ల శరీరానికి శక్తి వస్తుంది. వాటర్ ఎక్కువ తాగడం వల్ల కేలరీలు ఎక్కువ బర్న్ అవుతాయి. 500 ml నీళ్లు తాగడం వల్ల శరీరంలో మెటాబాలిక్ రేటు 30 శాతానికి పెరుగుందని ఓ అధ్యయనంలో తేలింది. 


సరైన సమయానికి తినడం..


ఆహారం సరైన సమయానికి తినడంవల్ల ఆరోగ్యం బావుంటుంది. ఓ టైమ్ టేబుల్ ప్రకారం తినడం వల్ల వెయిట్ ను కంట్రోల్ చేయొచ్చని చాలా మంది వైద్యులు చెబుతారు. ఇంట్లో చేసిన ఆహారాన్ని ఎక్కువ తినాలి. ప్రొటీన్లు ఎక్కువగా ఉండి.. కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉన్న ఆహారం ఆరోగ్యానికి చాలా మంచిది. 


గమనిక:


పైన చెప్పిన ఏ విషయాలను, ఆహార పద్ధతులను 'ఏబీపీ దేశం' ధ్రువీకరించడం లేదు. ఇవి కేవలం సలహాలు మాత్రమే. మీరు మెడికేషన్, డైట్, చికిత్స కోసం వైద్యుడిని సంప్రదించగలరు.