చియా విత్తనాలు చూసేందుకు కొద్దిగా సబ్జా గింజలు మాదిరిగానే ఉంటాయి. ఎన్నో పోషకాలతో లోడ్ చేసిన ఈ గింజలు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. బరువు తగ్గించడం నుంచి రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించే వరకు ఈ గింజలు సహాయపడతాయి. ఇందులో ఫైబర్, ఒమేగా 3 ఆమ్లాలు, ప్రోటీన్స్ పుష్కలంగా ఉన్నాయి. కాల్షియం, ఫాస్పరస్, జింక్, అసంతృప్త కొవ్వులు దీనిలో ఉన్నాయి. ఈ నివేదిక ప్రకారం చియా విత్తనాలు శరీరంలో తయారు చేయలేని తొమ్మిది ముఖ్యమైన అమైనో ఆమ్లాలను కలిగి ఉంటుంది. రెండు స్పూన్ల చియా గింజల్లో( సుమారు 28 గ్రాములు) 140 కేలరీలు, 4 గ్రాముల ప్రోటీన్, 11 గ్రాముల ఫైబర్, 7 గ్రాముల అసంతృప్త కొవ్వు, కాల్షియం 18%,  జింక్, ట్రేస్ మినరల్స్ ఉన్నాయని నివేదిక చెబుతోంది. రాగి, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మెండుగా ఉన్నాయి.


చియా గింజల వల్ల ప్రయోజనాలు


చాలామంది ఆరోగ్య నిపుణులు బరువు తగ్గడానికి చియా గింజలు తీసుకోమని సిఫార్సు చేస్తారు. అందుకు కారణం అందులో బరువు తగ్గేందుకు దోహదపడే ఫైబర్ ఉండటమే. 100 గ్రాముల చియా విత్తనాల్లో 34 గ్రాముల ఫైబర్ లభిస్తుంది. ఇందులో పీచు పదార్థం ఉండటం వల్ల ఎక్కువ సేపు పొట్ట నిండుగా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. ఆకలిని తగ్గి, అతిగా తినడాన్ని నియంత్రిస్తుంది.


చియా విత్తనాల్లో 60% నూనె ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ నుంచి వస్తుంది. ఒమేగా 3 కొవ్వు ఆమ్లం కొలెస్ట్రాల్, గుండె లయని నియంత్రిస్తుంది. రక్తపోటును తగ్గించి రక్తం గడ్డకట్టడాన్ని నిరోధిస్తుంది. అంతేకాదు ఈ విత్తనాలు తినడం వల్ల రక్తంలో చక్కెర, కొలెస్ట్రాల్ స్థాయిలని తగ్గిస్తుంది. ఇందులో ఉండే ఫైబర్ భోజనం చేసిన తర్వాత రక్తంలో చక్కెర స్థాయి పెరుగుదలని నియంత్రిస్తుంది. ఫైబర్స్ మెటబాలిక్ సిండ్రోమ్, టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి.


ఇలాంటప్పుడు వీటిని తీసుకోకూడదు


ఇప్పటికే మధుమేహం, అధిక కొలెస్ట్రాల్ వంటి సమస్యలకు మందులు వాడుతున్నప్పుడు చియా విత్తనాలు తీసుకోకుండా ఉండటమే మంచిది. ఎందుకంటే రెండింటి ప్రభావం మీ శరీరం మీద పడి సాధారణ స్థాయిలు కంటే తక్కువ నమోదయ్యే అవకాశం ఉంది.


ఎముకలకి బలం


చియా విత్తనాలలో ఉండే మెగ్నీషియం, ఫాస్పరస్ ఎముకలు బలంగా ధృడంగా ఉండేలా చెయ్యడంలో దోహదపడతాయి. కండరాలకు అవసరమైన కాల్షియం అందిస్తుంది. పలు నివేదికలతో పోల్చుకుంటే చియా విత్తనాలు పాలల్లో లభించే కాల్షియం కంటే అధిక కాల్షియాన్ని అందిస్తుంది. వీటిని నానబెట్టి తీసుకోవచ్చు. సబ్జా గింజలు మాదిరిగానే ఇవి కూడా చలువ చేస్తాయి. స్మూతీలు, షేక్స్ లో వీటిని వినియోగించవచ్చు.


చర్మ సంరక్షణకి


చియా గింజల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ తో పోరాడి చర్మాన్ని సంరక్షించేందుకు ఉపయోగపడతాయి. సూర్యరశ్మి నుంచి స్కిన్ ని రక్షిస్తుంది. మొటిమల సమస్యని దూరం చేస్తుంది. అంతేకాదు చర్మం త్వరగా ముడతలు పడకుండా మెరిసే కాంతిని మీకు అందిస్తుంది.  


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.


Also read: ఎండలో ఫోన్ చూస్తున్నారా? ఇక భవిష్యత్తులో ఏమీ చూడలేరు, ఎందుకంటే..


Also read: ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన ప్రదేశం ఇదే, అక్కడికి వెళితే చావు తప్పదు