రష్యా దాడిలో ఉక్రెయిన్ నేలకూలిపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో నెలలు నిండిన ఎంతో మంది తల్లులు బంకర్లలోని ఆసుపత్రుల్లో ప్రసవించారు. ఓ ఉక్రెయిన్ సైనికుడి భార్య కూడా ప్రసవించింది. పండంటి మగబిడ్డ పుట్టాడు. కానీ వారి కళ్లల్లో ఆనందం లేదు. ఆ బిడ్డ పుట్టే సమయానికే వారు నిరాశ్రయులయ్యారు. తండ్రి కదనరంగంలో ఉన్నాడు. ఇళ్లు నేలమట్టం అయ్యింది. బంకర్లోని ఆసుపత్రిలో తలదాచుకుంటున్నారు తల్లీబిడ్డలు. ఈ సందర్భంలో తండ్రి తన కొడుకును చూసేందుకు వచ్చాడు. తన మిలటరీ యూనిఫామ్ ను చక్కగా మడతబెట్టి మెత్తని పరుపులా చేశాడు. దానిపై కొడుకుని పడుకోబెట్టాడు. వెనుక ఉక్రెయిన్ జెండాను పెట్టి ఫోటో తీశాడు. తన కొడుకును పదే పదే చూసుకుని మళ్లీ యుద్ధానికి సిద్ధమయ్యాడు. వెళ్లే ముందు తన సోషల్ ఖాతాలో ఆ ఫోటోను పోస్టు చేశాడు.
‘గుడ్ మై లిటిల్ బాయ్...నేను బతికుంటే మనం మరోసారి కలుద్దాం’ అని క్యాప్షన్ పెట్టాడు. అది చదివిన ప్రతి ఒక్కరికి కళ్లు చెమ్మగిల్లాయి. ట్విట్టర్లో పెట్టి ఈ ఫోటో ఇప్పుడు ఫేస్ బుక్, ఇన్‌స్టా గ్రామ్, రెడిట్ వంటి సోషల్ మీడియా ఖాతాలో వైరల్ గా మారింది. ‘నేను చూసిన పోస్టులో గుండె తరుక్కుపోయే పోస్టు ఇదే’ అంటూ ఒక యూజర్ కామెంట్ చేశారు. ‘ఈ ఒక్క ఫోటో చాలు... ఉక్రెనియన్ల పరిస్థితి చెప్పడానికి’ అంటూ మరొక నెటిజన్ కామెంట్ చేశారు. ‘యుద్ధం ఆపడం ఒక్కటే మార్గం’ అంటూ ఎంతో మంది యూజర్లు కోరుకున్నారు. పుట్టిన పిల్లలను కళ్లారా చూడలేక, ఎప్పుడు ఏ బాంబు వచ్చి పడుతుందో తెలియక తల్లులు భయంతో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. ఇప్పటికే దేశం విడిచి 10 లక్షల మంది పక్కదేశాలకి వలస వెళ్లారు.
Also read: పిల్లల ఎత్తు పెరగడం ఏ వయసులో ఆగిపోతుందో తెలుసా? వారి ఎత్తు పెంచేందుకు కొన్ని చిట్కాలు ఇవిగో...
Also read: ఊబకాయం ఓ మహమ్మారి, ఏటా ఎంత మందిని చంపేస్తోందో తెలుసా?