ఎత్తు ఎదగడం అనేది వారసత్వంగా వచ్చే ప్రక్రియ. తల్లిదండ్రులు, తాత ముత్తాతల ఎత్తుపై పిల్లల ఎత్తు ఆధారపడి ఉంటుంది. అందుకే కొంత మంది ఆరడుగులు పెరుగుతారు, మరికొంతమంది అయిదడుగుల వద్దే ఆగిపోతారు. అయితే పిల్లలు ఎత్తు పెరిగే ప్రక్రియ ఏ వయసు వరకు కొనసాగుతుందో తెలుసా?
అబ్బాయిలైనా అమ్మాయిలైనా బాల్యంలో త్వరగా పెరుగుతారు. అందుకే ఏడాది వయసు నుంచే పదేళ్ల వరకు ఆ పెరుగుదల కంటికి తెలిసిపోతుంది. అప్పట్నించి యుక్తవయసు వరకు మాత్రం ఎత్తు పెరుగుదల నెమ్మదిగా సాగుతుంది. ఈ దశలో శారీరక, మానసకి మార్పులు అధికంగా ఉంటాయి. లావు కావడమో, లేక సన్నబడడమో కూడా జరుగుతుంది. ఆహారం, వ్యాయామం, జన్యువులు, వ్యాధులు వంటివి కూడా ఎత్తుపై ప్రభావం చూపిస్తాయి. అమ్మాయిలు అబ్బాయిల్లో కౌమార దశ రెండు నుంచి అయిదేళ్ల పాటూ కొనసాగుతుంది. ఈ సమయంలోనే అమ్మాయిల్లో రుతు చక్రం మొదలవుతుంది. అబ్బాయిల్లో గడ్డాలు, మీసాల్లాంటివి ప్రారంభమవుతాయి. 18 ఏళ్లలోపు వారెంత పొడవు పెరుగుతారో అదే ఎత్తు దాదాపు శాశ్వతం అవుతుంది. ఆ తరువాతే ఎత్తు పెరగడం కష్టమేనని చెబుతున్నాయి అధ్యయనాలు. కొంతమంది అమ్మాయిలు 14 నుంచి 15 ఏళ్ల వరకే ఎత్తు పెరిగే అవకాశం ఉందని అంటున్నారు పరిశోధకులు. వారిలో రుతుచక్రం మొదలయ్యాక పెద్దగా ఎత్తు పెరిగే అవకాశం ఉండదని అంటున్నారు. అబ్బాయిలకు 10 నుంచి 13 ఏళ్లలోపు పెరిగే ఎత్తే చాలా ముఖ్యమని, ఆ సమయంలో వారు మంచి ఎత్తుకు చేరుకోవాలని సూచిస్తున్నారు. అందుకే ఆ వయసులో మంచి ఆహారాన్ని, కొన్ని వ్యాయామాలను చేయమని చెబుతున్నారు.
1. పదేళ్ల దాటిన ఆడపిల్లలు, మగపిల్లలకు స్ట్రెచింగ్ వంటి వ్యాయామాలు చేయడం చాలా మేలు చేస్తాయి. వేలాడేలాంటి ఎక్సర్ సైజుల వల్ల కూడా ఎత్తు పెరిగే అవకాశాలు ఉన్నాయి.
2. తినే ఆహారం కూడా ఎత్తుపై ప్రభావం చూపిస్తుంది. కార్బోహైడ్రేట్లు, కొవ్వులు అధికంగా ఉండే ఆహారం ఎదిగే పిల్లలకు పెట్టడం వల్ల బరువు పెరిగి, ఎత్తు తగ్గే అవకాశం ఉంది. కాబట్టి ప్రోటీన్, విటమిన్ డి, మంచి కొవ్వులతో కూడిన ఆహారాలు తినిపించాలి. పాలు, తాజా కూరగాయలు, తృణధాన్యాలు పెట్టాలి. చక్కెర, ట్రాన్స్ ఫ్యాట్ లు ఉండే ఆహారాలను దూరం పెట్టాలి.
3. ఎత్తును పెంచుకోవడానికి యోగా ఉత్తమమైన మార్గం. వెన్నెముకను సాగదీడానికి కొన్ని యోగా భంగిమలు సహకరిస్తాయి. కోబ్రా పోజ్, మౌంటెన్ పోజ్, ట్రయాంగిల్ పోజ్, వారియర్ పోజ్ వంటివి పిల్లల చేత రోజూ వేయించాలి.
4. అన్నింటికన్నా ముఖ్యంగా కంటినిండా నిద్రపోయేలా చూడాలి. తొమ్మిది నుంచి పది గంటల పాటూ నిద్రపోయే పిల్లల్లో శరీర పనితీరు మెరుగ్గా ఉంటుంది. నిద్రలో విడుదలయ్యే HGH హార్మోను శరీరం అభివృద్ధి చెందడానికి చాలా అవసరం.
గమనిక:ఈ కథనంలో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు. ఏదైనా వ్యాయామం లేదా డైట్‌లో మార్పులు చేయాలనుకుంటే తప్పకుండా మీరు వైద్యుడు, డైటీషియన్‌ను సంప్రదించాలి.
Also read: ఊబకాయం ఓ మహమ్మారి, ఏటా ఎంత మందిని చంపేస్తోందో తెలుసా?
Also read: సగ్గుబియ్యం ఎందుకంత ఆరోగ్యమో తెలుసా? వాటి తయారీలోనే ఉంది రహస్యమంతా