Beautiful Skin with Home Waxing : శరీరం మీద ఉండే అవాంఛిత రోమాలను వదిలించుకోవడం కోసం చాలామంది వాక్సింగ్ చేయించుకుంటారు. ఇది మీ అందాన్ని కూడా రెట్టింపు చేస్తుంది. అయితే వాక్సింగ్ చేయించుకోవాలంటే పార్లర్‌కి వెళ్లాలి. పైగా దీనికి డబ్బులు గట్టిగానే ఖర్చవుతాయి. అయితే డబ్బుని, సమయాన్ని ఆదా చేస్తూ ఇంట్లోనే మీరు వాక్సింగ్ చేసుకోవచ్చు. ఇది మీకు మృదువైన చర్మాన్ని అందిస్తుంది. శరీరంపైనున్న అవాంఛిత రోమాలను తొలగించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఇది ఒకటి.
కొందరు మాత్రం రేజర్ ఉపయోగించి అవాంఛిత రోమాలు తొలగించేందుకు ప్రయత్నిస్తారు కానీ.. అది మీ స్కిన్‌ని బ్లాక్‌గా మార్చేస్తుంది. అంతేకాకుండా జుట్టును గట్టిగా మార్చి చికాకు కలిగిస్తుంది. అయితే ఇంట్లో లభ్యమయ్యే కొన్ని వస్తువులతో మీరు పార్లలాంటి వాక్సింగ్ చేసుకోవచ్చు. ఇది మీకు కోతలు, చికాకు లేకుండా రోమాలు తొలగించడంలో సహాయం చేస్తుంది. అయితే ఇంట్లోనే వాక్స్ ఎలా తయారు చేయాలో, దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
పంచదార - 1 కప్పు
నిమ్మరసం - 1 టేబుల్ స్పూన్
నీళ్లు - 2 టేబుల్ స్పూన్లు
ఉప్పు - 1 స్పూన్
సాస్పాన్ -1
గరిటె - 1 చెక్కతో తయారు చేసినది
పింగాణి గిన్నె -1
ఐస్ క్యూబ్స్ - అవసరాన్ని బట్టి
తయారీ విధానం
పెద్ద గిన్నెలో ఐస్ క్యూబ్స్ వేసి దానిలో సిరామిక్ గిన్నెను ఉంచండి. ఇది వాక్స్ కోసం తయారు చేసుకునే మైనాన్ని చల్లార్చడంలో సహాయం చేస్తుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి దానిమీద సాస్ పాన్ ఉంచండి. దానిలో చక్కెర, నీరు, ఉప్పు, నిమ్మరసం వేసి బాగా కలపండి. పాకంగా మారడం ప్రారంభమైన తర్వాత.. మంటను తగ్గించి.. చెక్క గరిటెతో దానిని బాగా తిప్పండి. ఈ మిశ్రమం గోధుమరంగులోకి మారినప్పుడు స్టవ్ ఆపేయండి. ఈ మిశ్రమాన్ని వెంటనే పింగాణీ గిన్నెలోకి జాగ్రత్తగా బదిలీ చేయండి.
మిశ్రమాన్ని మళ్లీ కలపడం స్టార్ట్ చేయండి. ఇది కాస్త చల్లబడి చిక్కగా వాక్స్ చేసుకునేందుకు వీలుగా మారుతుంది. ఇది భరించగలిగేంత వేడికి వచ్చే వరకు దానితో జాగ్రత్తగా ఉండండి. లేదంటే కాలిపోతుంది. మీకు అనువైనంత వేడిలోకి వస్తే మీరు దానిని వాక్స్ చేసుకోవడం కోసం ఉపయోగించుకోవచ్చు.
ఈ మిశ్రమంతో వాక్సింగ్ ఎలా చేయాలంటే..
ఈ వాక్స్ మిశ్రమాన్ని ఉపయోగించే ముందు మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే చర్మంపై దద్దుర్లు, గాయాలు అయ్యే ప్రమాదముంది. మీ చర్మంపై ర్యాష్ ఉన్నప్పుడు, వడదెబ్బకు గురైనప్పుడు మీరు వాక్సింగ్ చేసుకోకపోవడమే మంచిది. అంతేకాకుండా బికినీ ప్రాంతంలో కూడా వాక్స్ చేయకండి. అక్కడ చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. వాక్సింగ్‌కు ముందు రెటినోయిడ్ క్రీమ్‌లు ఉపయోగించకపోవడమే మంచిది.
వాక్సింగ్ చేయడం కాస్త బాధతో కూడిన విషయమే. ముఖ్యంగా సున్నితమైన స్కిన్ ఉన్నవారికి ఇది చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇంటి దగ్గర వాక్సింగ్ చేసుకునేప్పుడు కోల్డ్ ప్యాక్స్ ఉపయోగిస్తే నొప్పి, అసౌకర్యం తగ్గుతాయి. వాక్సింగ్ చేసే ముందు మీ చేతులు, కాళ్లు బాగా కడగండి. అది ఆరిన తర్వతా దీనిని అప్లై చేయవచ్చు. అయితే ముందుగా మీరు దీనిని వినియోగించకుండా ప్యాచ్ టెస్ట్ చేయండి. మీకు సౌకర్యంగానే ఉంటే.. అప్పుడు చేతులు, కాళ్లపై వాక్సింగ్ చేసుకోవచ్చు. దీనిని చర్మం అప్లై చేసి.. దానిపై వాక్సింగ్ రేపర్ ఉంచండి. జుట్టు పెరిగే దిశకు వ్యతిరేకంగా దానిని లాగితే రోమాలు తొలగిపోతాయి. వాక్సింగ్ తర్వాత మీ చర్మానికి మాయిశ్చరైజర్ అప్లై చేస్తే చాలా మంచిది. ఇది మీ చర్మాన్ని తేమగా చేస్తుంది. వాక్సింగ్ చేసిన రోజు వదులుగా ఉండే కాటన్ దుస్తులు వేసుకుంటే మంచిది. ఈ టిప్స్ పాటిస్తూ మీరు ఇంట్లోనే వాక్సింగ్ చేసుకోవచ్చు.
Also Read : క్రిస్మస్ గురించి అమ్మబాబోయ్ అనిపించే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్.. మీకు తెలుసా?