Liver Problems Symptoms : కాలేయం మన శరీరంలో ఒక ముఖ్యమైన భాగం. ఇది ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతుంది. రక్తాన్ని శుభ్రపరచడమే కాకుండా, ఆహారాన్ని జీర్ణం చేయడానికి, ప్రమాదకరమైన విషపూరిత పదార్థాలను తొలగించడానికి, పోషకాలను శరీరానికి అందించడానికి సహాయపడుతుంది. కానీ కాలేయం బలహీనపడినప్పుడు.. అది సరిగ్గా పనిచేయనప్పుడు లేదా ఏదైనా వ్యాధి సోకినప్పుడు.. దాని ప్రభావం మన శరీరంలో కనిపిస్తుందట. ముఖ్యంగా ముఖం మీద కొన్ని లక్షణాలు కనిపిస్తాయట. ఇంతకీ ఆ లక్షణాలు ఏంటి? వైద్యులను ఎప్పుడు సంప్రదించాలో ఇప్పుడు తెలుసుకుందాం. 

Continues below advertisement


ముఖం పసుపు రంగులోకి మారితే..


ముఖ చర్మం లేదా కళ్లలోని తెల్లని భాగం కొద్దిగా లేదా నెమ్మదిగా ముదురు పసుపు రంగులోకి మారడం గమనిస్తే అస్సలు విస్మరించకూడదు. ఇది సాధారణ మార్పు కాదు కానీ.. కామెర్లు (జాండీస్) లక్షణం కావచ్చు. కాలేయం శరీరంలోని బిలిరుబిన్ అనే పసుపు రంగు పదార్ధాన్ని తొలగించలేనప్పుడు ఇలా జరుగుతుంది. దీని కారణంగా.. రక్తంలో పేరుకుపోయి.. ముఖం, కళ్లు, చర్మం పసుపు రంగులోకి మారడం జరుగుతుంది. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం.


కళ్లకింద వాపు, బ్లాక్ సర్కిల్స్


కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడటం లేదా కొద్దిగా వాపు సహజంగానే చాలామందికి ఉంటుంది. నిద్ర లేకపోవడం వల్ల ఇలా జరుగుతుంది. అయితే కొన్నిసార్లు ఈ లక్షణాలు శరీరంలో దాగి ఉన్న తీవ్రమైన సమస్యను, ముఖ్యంగా కాలేయ లోపాన్ని సూచిస్తాయట. కాలేయం శరీరంలోని విషపూరిత పదార్థాలను పూర్తిగా తొలగించలేనప్పుడు.. అలసట, నల్లటి వలయాలు, వాపు రూపంలో దాని ప్రభావం ముఖంపై కనిపిస్తుంది. ఈ లక్షణాలు ఎక్కువ కాలం కొనసాగితే.. వెంటనే వైద్య పరీక్ష చేయించుకోవడం అవసరం.


మొటిమలు, బొబ్బలు


ముఖంపై అకస్మాత్తుగా మొటిమలు లేదా బొబ్బలు ఎక్కువగా వస్తే.. ఎన్ని మందులు వాడినా, ఇంటి నివారణలు చేసినా తగ్గకపోతే అది కేవలం చర్మ సమస్య మాత్రమే కాదని గుర్తించాలి. కాలేయంలో పేరుకుపోతున్న విషపూరిత పదార్థాల లక్షణం కావచ్చు. కాలేయం సరిగ్గా డీటాక్స్ చేయలేనప్పుడు.. దాని ప్రభావం చర్మంపై ఇలా కనిపిస్తుంది.


దురద లేదా మంట


ముఖ చర్మంపై ఎటువంటి అలెర్జీ లేదా సమస్య లేకుండా పదేపదే దురద లేదా మంట అనిపిస్తుందా?  అయితే ఇది కూడా కాలేయ పనితీరు లోపమే కావొచ్చు. కాలేయం పిత్తాన్ని సరిగ్గా నియంత్రించలేనప్పుడు.. అది చర్మం కింద పేరుకుపోయి మంట, దురదకు కారణమవుతుంది. కాబట్టి దీనిని నిర్లక్ష్యం చేయవద్దు.


నోటి దుర్వాసన 


చాలామందికి నోటి నుంచి నిరంతరం దుర్వాసన వస్తుంటుంది. లేదంటే నోరు చేదు రుచితో ఇబ్బంది పడతారు. ఇది నోటి శుభ్రత వల్ల మాత్రమే కాదు.. కాలేయ లోపం వల్ల కూడా ఇలా రావచ్చు. కాలేయం సరిగ్గా పనిచేయనప్పుడు.. జీర్ణక్రియ దెబ్బతింటుంది. ఇది నోటి రుచి, వాసనపై ప్రభావం చూపుతుంది.


పెదవులు, కళ్లు పొడిబారడం


పెదవులు పదేపదే పొడిబారడం లేదా పగుళ్లు ఏర్పడటం, కళ్లు మూలల్లో కూడా పగుళ్లు కనిపిస్తే.. ఇది వాతావరణం లేదా చర్మ సమస్య వల్ల మాత్రమే కాదని గుర్తించాలి. కాలేయంలో విటమిన్లను ప్రాసెస్ చేసే సామర్థ్యంలో లోపం ఫలితం కూడా కావచ్చు. కాబట్టి సకాలంలో పరీక్ష చేయించుకుంటే మంచిది.


ముఖంపై వాపు


ముఖంపై ముఖ్యంగా కళ్లు, బుగ్గల దగ్గర పదేపదే వాపు వస్తుంటే.. ఇది కాలేయంలో వాపు (హెపటైటిస్) లేదా ఏదైనా తీవ్రమైన లోపం లక్షణం కావచ్చు. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.


జిడ్డు చర్మం


ముఖ చర్మం ఎల్లప్పుడూ జిడ్డుగా అనిపించడమనేది చాలా కామన్ విషయం. అయితే ఎంత కడిగినా నూనెగా అనిపిస్తే.. అది కాలేయ లోపమని గుర్తించాలి. కాలేయం శరీరంలోని కొవ్వును సరిగ్గా జీవక్రియ చేయలేనప్పుడు.. దాని ప్రభావం చర్మంపై కనిపిస్తుంది.


ఈ లక్షణాలు అన్నీ కాలేయ లోపాన్ని సూచిస్తాయి. కాబట్టి ఏ లక్షణం కనిపించినా.. దానిని అస్సలు విస్మరించవద్దని చెప్తున్నారు నిపుణులు. సాధారణంగా కాలేయ సమస్యలు త్వరగా బయటపడవు. కానీ ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే చికిత్స తీసుకోవడం వల్ల డ్యామేజ్ తగ్గుతుందని గుర్తించాలి. 





గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.