Facial Signs of Liver Damage : కాలేయం ఆరోగ్యం మన మొత్తం శరీర ఆరోగ్యానికి చాలా కీలకం. చిన్న చిన్న మార్పులు కూడా పెద్ద సమస్యలకు సంకేతాలు కావచ్చు. కాబట్టి ముఖం, చర్మం, కళ్లలో మార్పులు కనిపించినప్పుడు వాటిని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే జాగ్రత్త పడాలి. అవేదో నార్మల్‌గా వచ్చే మార్పులు అనుకుంటే మాత్రం కచ్చితంగా ఇబ్బంది పడాల్సి వస్తుందని చెప్తున్నారు నిపుణులు.
మన శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవాల్లో కాలేయం ఒకటి. లివర్ అనేది శరీరంలోని టాక్సిన్స్‌ను బయటకు పంపడం నుంచి.. జీర్ణక్రియకు సహాయం చేయడం వరకు, రక్తాన్ని శుద్ధి చేయడం వంటి కీలక పనులు చేస్తుంది. అయితే కాలేయం సరిగా పనిచేయకపోతే.. కొన్ని హెచ్చరిక సంకేతాలు ముందుగానే ముఖంపై, చర్మంపై కనిపిస్తాయి. వాటిని నిర్లక్ష్యం చేస్తే ప్రమాదమని చెప్తున్నారు నిపుణులు. ఇంతకీ ఆ ముఖ్యమైన లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
చర్మం, కళ్ల రంగులో మార్పులు
కాలేయం దెబ్బతిన్నప్పుడు రక్తంలో బిలిరుబిన్ స్థాయి పెరుగుతుంది. దీనివల్ల చర్మం, కళ్లలోని తెల్లటి భాగం పసుపు రంగులోకి మారుతుంది. దీన్ని సాధారణంగా జాండీస్ (Jaundice) అంటారు. చాలామంది దీనిని అలసటగా భావించి వదిలేస్తారు. కానీ ఇది కాలేయ సమస్యకు మొదటి హెచ్చరిక కావచ్చు. చర్మం ముదురు రంగులోకి మారడం లేదా లేతగా కనిపించడం, సులభంగా గాయాలు అవ్వడం వంటి సమస్యలు కూడా కాలేయానికి సంబంధించినవే. ఈ మార్పులు నెమ్మదిగా కనిపిస్తాయి కాబట్టి చాలామంది గమనించరట.
అరచేతుల్లో ఎరుపు
కాలేయ వ్యాధి ఉన్నవారిలో అరచేతుల్లో ఎర్రదనం కనిపిస్తుంది. ముఖ్యంగా అరచేతి మధ్య భాగంలో ఇది స్పష్టంగా కనిపిస్తుంది. ఇది రక్తప్రవాహం మార్పుల వల్ల జరుగుతుంది. దీర్ఘకాలం కొనసాగితే.. కాలేయం బలహీనమవుతోందని అర్థం.
చర్మంపై మచ్చలు
చర్మంపై చిన్న చిన్న ఎర్ర మచ్చలు, సాలీడు గూడు లాంటి ఆకారంలో కనిపిస్తాయి. వీటిని “Spider Angioma” అంటారు. ఇవి ముఖం, మెడ, ఛాతీ భాగాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. కాలేయ సమస్య పెరిగేకొద్దీ ఇవి మరింత స్పష్టంగా కనిపిస్తాయి.
ముఖం, కళ్ల కింద వాపు
కాలేయ పనితీరు తగ్గిపోతే శరీరంలో ద్రవం పేరుకుపోతుంది. దీనివల్ల ముఖం.. ముఖ్యంగా కళ్ల కింద వాపు కనిపిస్తుంది. ఇవి ఉదయం సమయంలో ఎక్కువగా కనిపించి.. కొన్నిసార్లు రోజంతా అలాగే ఉండొచ్చు.
చర్మ సమస్యలు
కాలేయం టాక్సిన్స్‌ను బయటకు పంపలేకపోతే అవి శరీరంలో పేరుకుపోతాయి. దీనివల్ల మొటిమలు, దద్దుర్లు, ఎగ్జిమా వంటి చర్మ సమస్యలు పెరుగుతాయి.
కళ్లలో పసుపు ఎక్కువగా కనిపించడం
కాలేయ సమస్యలలో కళ్లలో పసుపు రంగు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కొన్నిసార్లు చర్మంపై కనిపించకపోయినా.. కళ్లలో మాత్రం త్వరగా గుర్తించవచ్చు. ఇది చాలా ముఖ్యమైన హెచ్చరిక సంకేతం.
ఎప్పుడు జాగ్రత్త తీసుకోవాలంటే..
ముఖంలో ఈ లక్షణాలు కనిపించిన వెంటనే.. డాక్టర్‌ను సంప్రదించాలి. లివర్ ఫంక్షన్ టెస్టులు చేయించుకోవాలి. ఆలస్యం చేయకుండా చికిత్స ప్రారంభిస్తే కాలేయం డ్యామేజ్ కాకుండా ఉంటుంది. మంచి ఫుడ్, వైద్య సహాయం తీసుకుంటూ లివర్ హెల్త్ కాపాడుకోవచ్చు.
గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.
