India Census 2027 | న్యూఢిల్లీ: భారత చరిత్రలో మైలురాయిగా నిలిచే 16వ జనగణన (స్వతంత్ర భారతంలో 8వది) ప్రక్రియకు సర్వం సిద్ధమైంది. జనగణన ప్రక్రియ 2 దశల్లో జరుగుతుందని రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా మృత్యుంజయ్ కుమార్ నారాయణ్ తెలిపారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. తొలి దశ అయిన గృహగణన (Houselisting) ఏప్రిల్ 1వ తేదీన ప్రారంభం కానుంది. ఈసారి జనగణన పూర్తిగా డిజిటల్ రూపంలో జరగనుండటం విశేషం. పౌరులు అందించే వ్యక్తిగత డేటా అత్యంత గోప్యంగా ఉంటుందని, దీనిని ఆర్టీఐ పరిధిలోకి రానీయకుండా, న్యాయస్థానాల్లో సాక్ష్యంగా వాడకుండా చట్టపరమైన రక్షణ కల్పించారు.

Continues below advertisement

33 ప్రశ్నలతో గృహగణన.. ఏపీ, తెలంగాణ షెడ్యూల్ ఇదే!

తొలిదశలో భాగంగా ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబరు 30 వరకు గృహగణన కార్యక్రమం జరుగుతుంది. ఇందులో మొత్తం 33 ప్రశ్నల ద్వారా ప్రజల నివాస స్థితిగతులు, అందుబాటులో ఉన్న సౌకర్యాలు, వారి చరాస్తుల వివరాలను సేకరిస్తారు. ఆంధ్రప్రదేశ్‌లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ ద్వారా ఏపీలో ఏప్రిల్ 16 నుంచి 30వ తేదీ వరకు వివనాలు మనమే సొంతంగా నమోదు చేసుకోవాలి.  మే 1 నుంచి 30 వరకు నెన్సన్ ఎన్యూమరేటర్ ద్వారా ప్రక్రియ జరుగుతుంది. తెలంగాణలో ఏప్రిల్ 26 నుంచి మే 10వ తేదీ వరకు ప్రజలే సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేయవచ్చు. ఆపై  మే 11 నుంచి జూన్ 9 వరకు అధికారులు ప్రక్రియ చేపడతారు. ఎన్యూమరేటర్లు ఇంటికి వచ్చి వివరాలు సేకరించడమే కాకుండా, ప్రజలు స్వయంగా తమ వివరాలను నమోదు చేసుకునేలా ప్రత్యేక పోర్టల్‌ను కూడా అందుబాటులోకి తెచ్చారు.

సెల్ఫ్ ఎన్యూమరేషన్.. మీ వివరాలు మీరే నమోదు చేసుకోవచ్చు

పౌరులు తమ వివరాలను https://se.census.gov.in వెబ్‌సైట్‌లో లేదా మొబైల్ యాప్‌లో స్వయంగా నమోదు చేసుకోవచ్చు. ఇంటి యజమాని పేరు, మొబైల్ నంబర్ ద్వారా ఓటీపీ పొంది లాగిన్ అవ్వాలి. వివరాలన్నీ నమోదు చేసిన తర్వాత 'H' అక్షరంతో ప్రారంభమయ్యే 11 అంకెల ఐడీ జనరేట్ అవుతుంది. ఎన్యూమరేటర్లు ఇంటికి వచ్చినప్పుడు ఈ ఐడీని వారికి చూపిస్తే సరిపోతుంది. ఒకవేళ ఏవైనా మార్పులు ఉంటే ఆ సమయంలోనే సరిచేసుకోవచ్చు. అయితే, ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ సౌకర్యం ఎన్‌ఆర్‌ఐ (NRI)లకు వర్తించదు.

Continues below advertisement

కీలక నిర్ణయాలు, మినహాయింపులు

తొలిదశలో కులగణన ఉండదని, కేవలం రెండో దశలో మాత్రమే కులం, మతం వివరాలు సేకరిస్తారని స్పష్టం చేశారు. అలాగే, నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ (NPR) అప్‌డేషన్‌ను ప్రస్తుతానికి చేపట్టడం లేదు. జనగణన వివరాల ఆధారంగా ప్రభుత్వ పథకాల్లో ఎటువంటి కోతలు ఉండవని అధికారులు హామీ ఇచ్చారు. సామాజిక మార్పులకు అనుగుణంగా, స్థిరమైన బంధంలో ఉన్న సహజీవన జంటలను కూడా వివాహిత జంటగా పరిగణించి వివరాలు నమోదు చేయనున్నారు. ఇంటర్నెట్, వాహనాలు, గృహోపకరణాల వాడకం వంటి అంశాలను కూడా ఈ ప్రశ్నావళిలో చేర్చారు.

సహజీవన జంటలకు కుటుంబ గుర్తింపు..  జనగణన ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వం చారిత్రాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. మారుతున్న సామాజిక పరిస్థితులకు అనుగుణంగా, చాలా కాలం నుండి సహజీవనం (Live in Relationship) చేస్తున్న జంటలను ఇకపై ఒకే యూనిట్‌గా గుర్తించి, వారికి 'కుటుంబ హోదా' కల్పించాలని నిర్ణయించింది. స్థిరమైన బంధంలో ఉంటూ కలిసి జీవిస్తున్న వారిని ఒకే ఫ్యామిలీగా పరిగణించి జనగణన రికార్డుల్లో నమోదు చేయనున్నారు. ఆధునిక సంబంధాలకు అధికారిక గుర్తింపునిచ్చే దిశగా కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.

2011 తర్వాత సుదీర్ఘ విరామం అనంతరం జరుగుతున్న ఈ ప్రక్రియలో డేటా సేకరణ కోసం అత్యాధునిక మొబైల్ యాప్‌లను వినియోగిస్తున్నారు. 2021లో జరగాల్సిన జనగణన కరోనా కారణంగా నిర్వహించలేదు. పౌరులు తమ వివరాలను స్వయంగా నమోదు చేసుకునే (Self-enumeration) సౌకర్యాన్ని కూడా ఈసారి అందుబాటులోకి తెచ్చినట్లు అధికారులు తెలిపారు.