వర్షాకాలంలో వ్యాధి నిరోధక శక్తి బలంగా ఉండాలి. ఎందుకంటే ఇది వ్యాధులు వ్యాపించే కాలం. అంతేకాదు బరువు తగ్గడం కూడా ఒకరకంగా సవాలుగా మారుతుంది.


వర్షాలు మొదలైన తర్వాత హైడ్రేషన్, పోషణ మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం అవసరం. వర్షాకాలంలో బరువు తగ్గడం ఒక సవాలే. వాకింగ్ కోసం, జిమ్ కోసం బయటకు వెళ్లే వీలు ఉండకపోవచ్చు. ఈ సీజన్ లో నూనెలో వేయించిన పదార్థాల మీదకు మనసు పోవడం మరో కారణం కూడా. అయితే ఇలా ఎక్కువ క్యాలరీలు కలిగిన పకోడిల కంటే బరువు తగ్గించేందుకు దోహదం చేసే వేడివేడి పానీయాలు తీసుకుంటే ఉత్సాహంగా కూడా ఉండేందుకు వీలుంటుంది. అంతేకాదు రోగనిరోధక వ్యవస్థ బలంగా తయారవుతుంది.


పసుపుపాలు (గోల్డెన్ మిల్క్)


ఈ శక్తివంతమైన పానీయంలో యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగి రోగనిరోధక వ్యవస్థను బూస్టప్ చేస్తుది. పసుపులో కర్క్యూమిన్ అనే శక్తివంతమైన సమ్మేళనం ఉంటుంది. ఇది జీవక్రియను నియంత్రించడం మాత్రమే కాదు పొట్ట చుట్టూ పేరుకున్న కొవ్వును తగ్గిస్తుంది కూడా. పాలు, పసుపు, కొద్దిగా తేనే, చిటికెడు నల్లమిరియాల పొడి కలిపి తీసుకోవాలి. ప్రతి రోజూ గోరువెచ్చగా ఈ పాలు తాగితే చాలా మంచి ఫలితాలు ఉంటాయి.


అల్లం టీ


అల్లం బరువు తగ్గడానికి దోహదం చేస్తుంది. రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. ఇది చాలా శతాబ్ధాలుగా నమ్మకమైన ఔషధంగా చెప్పుకోవచ్చు. అల్లంలోని సమ్మేళనాలు జీవక్రియల వేగం పెంచడానికి, ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి ఉపయోగపడతుంది. అల్లం టీ చెయ్యడానికి వేడినీటిలో అల్లం తురిమి వెయ్యాలి తర్వాత నిమ్మకాయ, తేనె కలిపి వేడిగా తీసుకుంటే చాలు.


గ్రీన్ టీ


ఈజీసీజి వంటి కాటెచిన్ ల వల్ల గ్రీన్ టీతో బరువు తగ్గుతారు. యాంటీఆక్సిడెంట్ల వల్ల కొవ్వు కరుగుతుంది. జీవక్రియలు ఆరోగ్యకరంగా ఉంటాయి. ఆకలి కూడా చాలా తగ్గుతుంది. రోజంతా ఒకటి రెండు కప్పుల గ్రీన్ టీ వర్షాకాలంలో గణనీయంగా బరువుతగ్గొచ్చు. గ్రీన్ టీతో నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. గ్రీన్ టీలో తులసి లేదా అశ్వగంధ వంటి మూలికలు కలిపితే మరింత ఆరోగ్యకరంగా ఉంటుంది.


దాల్చిన చెక్క టీ


దాల్చిన చెక్కతో ఒంట్లో వేడి పెరుగుతుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను కూడా అదుపులో ఉంచుతుంది. క్రేవింగ్స్ తగ్గిస్తుంది. అంతేకాదు బరువు తగ్గుందుకు దోహదం చేస్తుంది. ఇది సహజమైన యాంటీ మైక్రోబియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగినది. దీన్ని తేనెతో కలిపి తీసుకుంటే నిరోధక వ్యవస్థ పనితీరును కూడా మెరుగుపరుస్తుంది. వేడినీటిలో దాల్చిన చెక్క ముక్కలు లేదా కొద్దిగా పొడి వేసి దానిలో తేనె ఒక టీ స్పూన్ కలిపి వేడిగా తీసుకుంటే మంచిది.


అల్లం వెల్లుల్లీ లెమన్ టీ


రోగనిరోధక శక్తిని పెంపొందించేందుకు, బరువుతగ్గేందుకు ఈ ఘాటైన టీ తాగితే మంచి ఫలితం ఉంటుంది. వెల్లుల్లిలో అల్లోసిన్ అనే శక్తవంతమైన యాంటీ మైక్రోబియల్, యాంటీ వైరల్ లక్షణాలు కలిగిన సమ్మేళనం ఉంటుంది. అల్లం, నిమ్మకాయలు యాంటీ ఇన్ప్లమేటరీ లక్షణాలు కలిగి ఉంటుంది. అల్లం వెల్లుల్లిని తురిమి వేడి నీటిలో వేసి తర్వాత తేనె, నిమ్మరసం కలిపి వేడిగా తీసుకుంటే ఘాటుగా, వెచ్చగా బావుంటుంది.


Read Also: ఈ లక్షణాలకు కనిపిస్తే గుండె లయ తప్పినట్టే, నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలు పోతాయ్ జాగ్రత్త