ఒకప్పుడు పచ్చబొట్టును వేయించుకునేవారు. ఇప్పుడు అదే ‘టాటూ’ పేరుతో ఆధునిక ప్రపంచంలో అడుగు పెట్టింది. టాటూ అంటే యువత క్రేజీగా ఫీల్ అవుతారు. అనేక షేడ్స్‌లో, రంగుల్లో ఇప్పుడు టాటూలు వేయడం ఫ్యాషన్‌గా మారింది. టాటూ వేయించుకోవడం, బాడీ పియర్సింగ్, కాస్మెటిక్ ట్రీట్మెంట్ లాంటివి సహజత్వానికి విరుద్ధంగా సాగేవి. కాబట్టి అవి ప్రమాదాలతో ముడిపడి ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు. కాస్మెటిక్ సర్జరీల వల్ల కలిగే నష్టాల మాదిరిగానే టాటూ వేయించుకోవడం వల్ల ఒక్కోసారి ప్రమాదకర పరిస్థితులు రావచ్చు. ఎక్కడపడితే అక్కడ శరీరంపై వేయించుకోకూడదు. సున్నితమైన ప్రదేశాల్లో టాటూ వేయించుకోవడం వల్ల చర్మ సమస్యలు రావచ్చు.


పెదవులకు పక్కన, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో టాటు వేయించుకోకూడదు. అలాగే అరచేతుల్లోనూ, పాదాల అడుగు భాగాల్లోనూ, నాలుక పైన, మెడ వంటి ప్రాంతాల్లో టాటూలకు  దూరంగా ఉండాలి. ఇవన్నీ కూడా ప్రమాదంతో కూడుకున్నవి. వేయించుకున్నాక ఆ ప్రాంతం ఎరుపుగా మారి, రెండు రోజుల పాటు నొప్పి పెడుతుంది. తర్వాత సాధారణంగా ఉంటుంది. అలా కాకుండా కింద చెప్పిన లక్షణాలు, సంకేతాలు ఏమైనా కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. 


టాటూస్ వేయించుకున్న ప్రాంతం చాలా వేడిగా అనిపిస్తే తేలిగ్గా తీసుకోకండి. అలాగే ఆ ప్రాంతంలో చీము పట్టినా, పసుపు పొరలా మారినా, ఆ ప్రాంతం తెల్లగా మారినా కూడా చర్మ సమస్యలు మొదలైనట్టే. అలాంటప్పుడు వైద్యులు యాంటీబయోటిక్ కోర్సును ప్రారంభిస్తారు. అది ప్రాణాంతకంగా మారకుండా చూస్తారు.


టాటూకు ముందు 
టాటూ వేయించుకోవడానికి ముందురోజు కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ముందు రోజు కెఫీన్ ఉండే ఆహారాలకు దూరంగా ఉండాలి. కెఫీన్ చేరడం వల్ల రక్తం పలుచన అవుతుంది. దీని వల్ల టాటూ వేసినప్పుడు గాయమైతే రక్త స్రావం ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. అలాగే టాటూ వేయించుకోవడానికి వారం ముందు నుంచే నీళ్లు పుష్కలంగా తాగాలి. ఇలా తాగడం వల్ల టాటూ వేస్తే వచ్చే సైడ్ ఎఫెక్టులు  ఏవీ రావు.  


టాటూ వేశాక
టాటూ వేయించుకున్నాక కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే వాటి ద్వారా కొన్ని రకాల చర్మసమస్యలు వచ్చే అవకాశం ఉంది. టాటూ వేయించుకున్న వెంటనే దుమ్మూధూళి పడకుండా వదులుగా వస్త్రాన్ని కట్టుకోవాలి. ఇంటికెళ్లాక యాంటీ బ్యాక్టిరియల్ సబ్బుతో వాష్ చేసుకోవాలి. గోరువెచ్చని నీటితో కడిగితే మంచిది. రెండు వారాల పాటూ పెట్రోలియం జెల్లీ, క్రీమ్ వంటివి పూయాలి.  రెండు వారాల వరకు టాటూను గట్టిగా రుద్దడం, గోకడం చేయకూడదు.


Also read: కంది పప్పును ఇలా వండితే మీరు తిన్నా కూడా, అది వ్యర్థమే, వండాల్సిన పద్ధతి ఇది







గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.