సాధారణంగా ఉదయం లేవగానే చాలా మంది వాకింగ్ కు వెళ్తారు. విశాలమైన మైదానాల్లో లేదంటే ఆహ్లాదకరమైన పార్కుల్లో నడుస్తారు. ఆరోగ్యంతో పాటు ఆహ్లాదాన్ని పొందుతుంటారు. వెళ్తూ వెళ్తూ కొందరు తమతో పాటు పెంపుడు కుక్కలను కూడా తీసుకెళ్తారు. వాటితో కలిసి అలా జాలీగా నడిచి వస్తారు. కానీ, చైనాలో ఇప్పుడు కొత్త ట్రెండ్ మొదలయ్యింది. వాకర్స్ మామూలు డాగ్స్ కు బదులుగా రోబోటిక్ డాగ్స్ ను తీసుకెళ్తున్నారు.


చైనాలో ఎప్పుడో రోబోటిక్ డాగ్స్ అందుబాటులోకి వచ్చాయి. కానీ అవి ఎక్కువగా షాపింగ్ ప్లాట్‌ ఫారమ్‌ లలోనే కనిపించేవి. ప్రస్తుతం వీటిని జనాలు బాగా కొనుగోలు చేస్తున్నారు. పెట్ డాగ్ ప్లేస్ లో వీటిని రీప్లేస్ చేస్తున్నారు. రియల్ డాగ్స్ తో పోల్చితే ఇవే చాలా సౌకర్యవంతంగా ఉన్నట్లు చైనీయులు భావిస్తున్నారు. తమ యజమానులను ఎంతో ప్రేమించే నిజమైన కుక్కలతో రోబోటిక్ డాగ్స్ ఎప్పటికీ సరితూగనప్పటికీ.. వీటితోనూ ప్రయోజనాలు లేకపోలేదు.


ఇటీవల చైనాలో వాకింగ్ కు వెళ్లే వారి చేతిలో చాలా వరకు రోబోటిక్ డాగ్స్ దర్శనం ఇస్తున్నాయి.  మున్ముందు మామూలు డాగ్స్ మాయమై.. వాటి ప్లేస్ లో రోబోటిక్ డాగ్స్ వచ్చి చేరే అవకాశం లేకపోలేదు. నిజమైన డాగ్స్ తో పోల్చితే రోబోటిక్ డాగ్స్ తో పెద్దగా సమస్యలు ఉండవనేది చైనీయుల భావన. రోబో కుక్కలకు ఎలాంటి ఆహారం ఇవ్వాల్సిన అవసరం లేదు. వాటికి స్నానం చేయించాల్సిన పని ఉండదు. మీకు అవసరం లేకపోతే వాటితో సమయం గడపవలసిన అవసరం లేదు.


నిజమైన కుక్కలకైతే సమయానికి ఫుడ్ పెట్టాలి. రోజూ స్నానం చేయించాలి. ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించాలి. సవాలక్ష సవాళ్లు ఎదుర్కొవాల్సి ఉంటుంది.  అసలు కుక్కలతో ఉండే అనుబంధం, ప్రేమ రోబోటిక్ డాగ్స్ తో ఉండకపోయినా.. ఉరుకుల పరుగుల జీవితంలో పెట్ డాగ్స్ మంచి చెడులను పట్టించుకునే స్థితిలో లేమంటున్నారు చైనీయులు. అందుకే రోబోటిక్ డాగ్స్ ను కొనుగోలు చేస్తున్నారు. యాంత్రిక ప్రేమను పొందుతున్నారు.


షాంఘై, బీజింగ్ వంటి చైనీస్ నగరాల వీధుల్లో ఇప్పుడు ఎక్కువగా రోబోటిక్ డాగ్స్ దర్శనం ఇస్తున్నాయి. వీటిలో ఎక్కువ భాగం దేశీయంగా ఉత్పత్తి చేయబడినవి. ఈ డాగ్స్ ఫాలోయింగ్, రోలింగ్, సిట్టింగ్, రన్నింగ్, బరువులు మోయడం లాంటి అనేక అంతర్నిర్మిత లక్షణాలను కలిగి ఉన్నాయి. ఒక్కో రోబోటిక్ డాగ్ 5 కిలోల వరకు బరువును మోసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. తలపై ఉన్న కెమెరా ద్వారానే రోబోటిక్ డాగ్ యాక్టివ్ గా ఉంటుంది. ఈ కెమెరా తనకు ఎదురయ్యే  అడ్డంకులను గుర్తించడానికి, వాటిని దాటవేయడానికి, యజమానిని గుర్తించడానికి ఉపయోగపడుతుంది.


చైనీస్ రోబోట్ డాగ్‌ల ధరలు బిల్డ్ క్వాలిటీ, బిల్ట్-ఇన్ ఫీచర్‌లు, బ్యాటరీ లైఫ్ ఆధారంగా 15,000 యువాన్ నుంచి 100,000 యువాన్ వరకు ఉంటుంది. భారత కరెన్సీలో సుమారు రూ. లక్షన్నర నుంచి రూ.11 లక్షల వరకు ఉంటుంది. ఈ డాగ్స్ ఒక్క ఛార్జ్ తో 45 నిమిషాల పాటు పని చేస్తాయి. ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్న రోబోటిక్ డాగ్స్ వ్యాపారం మున్ముందు మరింత విస్తరించే అవకాశం ఉంది. రానున్న  రోజుల్లో రోబోటిక్ డాగ్స్ బిజినెస్ బిలియన్ డాలర్లకు చేరుకున్నా ఆశ్చర్యపోవక్కర్లేదు.


Also Read: మీ స్మార్ట్‌ఫోన్‌లో 5G నెట్‌వర్క్‌ను ఇలా యాక్టివేట్ చేసుకోండి!


Also Read: వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్ - అందుబాటులోకి ‘స్క్రీన్‌ షాట్ బ్లాకింగ్' ఫీచర్‌!