Japanese Interval Walking vs Normal Walking : ఈ రోజుల్లో సోషల్ మీడియాలో అత్యంత వైరల్ అవుతున్న ఫిట్‌నెస్ ట్రెండ్ ఏదైనా ఉందంటే అది జపనీస్ ఇంటర్వెల్ వాకింగే. PureGym డేటా ప్రకారం.. గత సంవత్సరంలో ఈ వాకింగ్ పద్ధతిపై ఆసక్తి దాదాపు 3,000% పెరిగింది. ఇది 2026లో ప్రపంచవ్యాప్తంగా అందరూ చేయాలనుకుంటున్న వ్యాయామాల్లో ఒకటిగా మారిందని తెలిపింది. అసలు ఈ జపనీస్ వాకింగ్ అంటే ఏంటి? దానివల్ల కలిగే లాభాలు ఏంటో చూసేద్దాం.

Continues below advertisement

జపనీస్ వాకింగ్ 

జపనీస్ వాకింగ్ అంటే 3 నిమిషాలు వేగంగా నడవడం.. తర్వాత 3 నిమిషాలు నెమ్మదిగా నడవడం. ఇలా 30 నిమిషాల పాటు వాకింగ్ చేయడం. దీన్ని జపాన్‌లోని షిన్షు యూనివర్సిటీ పరిశోధకులు ప్రొఫెసర్ హిరోషి నోస్, అసోసియేట్ ప్రొఫెసర్ షిజ్యూ మసుకీ అభివృద్ధి చేశారు. ఇది సాధారణ వ్యాయామం కాదు. వేగం మారుస్తూ నడవడమే దీని రహస్యం.

ఎలా చేయాలంటే..

ముందు వార్మప్‌తో మొదలుపెట్టండి. 5 నిమిషాలు సాధారణ వేగంలో నడవండి. తర్వాత వేగంగా 3 నిమిషాలు నడవండి. మీ హృదయ స్పందన రేటులో సుమారు 70% వేగంలో నడవాలి. దీంతో శ్వాస తీసుకోవడం కష్టంగా అనిపించాలి. కానీ చిన్నగా మాట్లాడగలగాలి. తర్వాత మెల్లగా 3 నిమిషాలు నడవండి. ఇది రికవరీ దశ. దాదాపు 40% వేగంలోనడవాలి. చివరగా 5 నిమిషాలు కూల్‌డౌన్ చేసి తేలికపాటి స్ట్రెచింగ్ చేయండి. ఈ మొత్తం సెషన్ 30 నిమిషాలు. వారానికి 3 నుంచి 4 రోజులు చేస్తే చాలు. 

Continues below advertisement

శాస్త్రీయ ప్రయోజనాలు

2007లో Mayo Clinic Proceedingsలో ప్రచురించిన ఒక ముఖ్యమైన అధ్యయనం ప్రకారం.. 5 నెలలు ఈ పద్ధతిలో నడిచిన వ్యక్తులలో VO2 max 10 శాతం పెరిగింది. మోకాలి బలం 13–17 శాతం మెరుగైంది. సిస్టోలిక్ రక్తపోటు 9 mmHg తగ్గింది. 4 నెలలు క్రమంగా చేస్తే రక్తంలో చక్కెర, రక్తపోటు, కొలెస్ట్రాల్, BMI తగ్గుతాయని పరిశోధనలు నిరూపించాయి. మానసిక ఆరోగ్యంలోనూ మెరుగుదల కనిపిస్తుందని.. మూడ్, నిద్ర నాణ్యత, జీవన నాణ్యత మెరుగవుతాయని తెలిపారు.

నార్మల్ వాకింగ్ కంటే బెటర్?

జపనీస్ వాకింగ్ చేసినవారికి కార్డియోవాస్కులర్ హెల్త్ 14 శాతం మెరుగైంది. సాధారణ నడకలో ఇది కేవలం 3 శాతం మాత్రమే పెరిగింది. కాళ్ల బలం 13 శాతం పెరిగింది. సాంప్రదాయ జాగింగ్‌తో పోలిస్తే జపనీస్ వాకింగ్ జాయింట్స్‌పై ఒత్తిడి చాలా తక్కువ. ఇది వయసు మళ్లిన వారికి, కండరాల క్షీణతను నిరోధించడానికి హెల్ప్ చేస్తుంది. 

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.