కొందరికి నిద్ర సరిగా పట్టదు. పడకపై చేరి గంటలు గడుస్తున్నా నిద్రదేవతా అనుగ్రహించదు. దీనికి చాలా కారణాలు ఉండొచ్చు. అలాగే పోషకాహార లోపం కూడా కారణం కావచ్చని చెబుతున్నారు ఆరోగ్యనిపుణులు. ఆహారం కూడా నిద్రను నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. తీసుకునే పోషకాలే రోగనిరోధక శక్తిని, జీవక్రియను, శరీరం ఎదుగుదలను, మానసిక ఆరోగ్యాన్ని నిర్ణయిస్తాయి. ముఖ్యంగా విటమిన్ బి12 తగ్గినవారికి నిద్రలేమి సమస్య వేధిస్తుంది.
బి12 ఎందుకు ముఖ్యం?
మన శరీరంలో ఎర్రరక్తకణాలు, డీఎన్ఏ ల అభివృద్ధికి ఈ విటమిన్ చాలా అవసరం. జీర్ణశయ సంబంధ సమస్యలతో బాధపడేవారికి కూడా బి12 చాలా ముఖ్యం. అలాగే మానసిక సమస్యలైన నిద్రలేమి, నిరాశ, డిప్రెషన్ వంటి వాటితో బి12కు సంబంధం ఉంది. శరీరంలో మెలటోనిన్ స్థాయిలను నియంత్రించే పని చేసేది విటమిన్ బి12. ఆ మెలటోనిన్ నిద్ర విధానాలను నియంత్రించే హార్మోన్. అందుకే విటమిన్ బి12 లోపిస్తే నిద్రలేమి సమస్య మొదలయ్యే అవకాశాలు ఎక్కువ.
ఏం తినాలి?
విటమిన్ బి12 లోపం రాకుండా చూసుకోవాలంటే మీ ఆహార మెనూలో కొన్ని ఆహారపదార్థాలను తప్పకుండా చేర్చుకోవాలి. గుడ్లు, టూనా, సాల్మన్ వంటి చేపలు, చికెన్, లివర్, చీజ్, కొవ్వు తీసేసిన పాలు, పెరుగు వంటివి రోజూ తినాలి. పండ్ల ద్వారా విటమిన్ బి12 పెద్దగా చేరదు.
ఇతర కారణాలు
విపరీతమైన ఒత్తిడి, డిప్రెషన్ వంటివి కూడా నిద్రపట్టకపోవడానికి కారణాలుగా మారతాయి. వీటికి గురైన వ్యక్తి స్థిమితంగా ఆలోచించలేరు కూడా. కరోనా మహమ్మరికి గురైన వ్యక్తులు కూడా చాలా మంది మానసికంగా దెబ్బతిని నిద్రకు దూరమవుతున్నారు. కొందరు తమ ప్రియమైన వ్యక్తులను కోల్పోవడం కలిగే నిరాశ వల్ల నిద్రలేమి సమస్య బారిన పడుతున్నారు.
ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.
Also read: కరోనా కారణంగా భారతీయుల ఆయుర్ధాయం తగ్గిపోయిందా? కొత్త అధ్యయనంలో కలవరపెట్టే నిజాలు
Also read: రోజూ స్నానం చేయడం అత్యవసరమా? హార్వర్డ్ వైద్యులు ఏం చెబుతున్నారు?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి