చిరుత.. ఈ పేరు వింటేనే ఒంట్లో వణుకు పుడుతుంది. పదునైన చూపు చూసి.. బలమైన పంజాతో దెబ్బకొట్టిందంటే మనిషి ప్రాణాలు క్షణాల్లో గాల్లో కలవడం ఖాయం. కానీ.. కొందరు ఆకతాయిలు చేసిన పనికి ఓ చిరుత నిస్సహాయ స్థితిలో కన్నుమూసింది.
ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ (IFS) అధికారి పర్వీన్ కస్వాన్ తాజాగా 20-సెకన్ల వీడియో క్లిప్‌ను తన ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేశారు. ఇక్కడ ఉన్న జంతువును గుర్తించండి! అని క్యాప్షన్ పెట్టారు. ఈ వీడియోలో చిరుత పట్ల కొందరు వ్యక్తులు అమానవీయంగా ప్రవర్తించడం కనిపిస్తుంది. దాని తోక, వెనుక కాళ్లను పట్టుకుని హింసిస్తున్నారు. చిరుత వారి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నా.. వదలకుండా అలాగే పట్టుకుని రోడ్డు పక్కన నిల్చున్నాడు ఓ వ్యక్తి.
ఈ ఘటనను కొందరు వ్యక్తులు పక్కనే నిల్చుని వీడియో తీయడం కనిపిస్తుంది. ఆ యువకుడు చేసిన పనికి చిరుత చివరకు ప్రాణాలు కోల్పోయిందని పర్వీన్ వెల్లడించారు. వాస్తవానికి చిరుత అంత చేతగాని తనాన్ని ప్రదర్శించదు. అయితే.. ఆ చిరుత అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. అందుకే ఒక్క వ్యక్తి దాన్ని పట్టుకున్నా ఎటూ వెళ్లలేకపోయింది. ఎంత హింసించినా.. ముందుకు కదలలేదు. ఏమీ చేయలేని స్థితిలో అక్కడే చనిపోయినట్లు తెలుస్తోంది.
వన్య ప్రాణుల పట్ల ఇలా ప్రవర్తించకూడదు
పర్వీన్ కస్వాన్ షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. చిరుత పల్ల సదరు యువకుడు ప్రవర్తించిన తీరును నెటిజన్లు తీవ్ర స్థాయిలో తప్పు పడుతున్నారు. వందల కొద్ది కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోను షేర్ చేసిన పర్వీన్ కూడా ఈఘటనను తీవ్రంగా తప్పుబట్టారు. జంతువుల పట్ల ఇలా వ్యవహరించడం సరికాదని చెప్పారు. వన్య ప్రాణులను ఇలా ట్రీట్ చేయకూడదన్నారు. అవి కూడా జీవులేనని.. వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలని ట్వీట్ చేశారు.
తీవ్రంగా మండిపడుతున్న నెటిజన్లు
చిరుతతో ఆ వ్యక్తులు వ్యవహరించిన తీరుపై సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతుంది. పలువురు నెటిజన్లు వారిపై మండిపడుతున్నారు. చిరుత పట్ల వారి ప్రవర్తన చూసి చాలా విచారపడుతున్నాను అని ఓ వ్యక్తి కామెంట్ చేయగా.. వారు జైలుకు వెళ్తారని ఆశిస్తున్నట్లు మరో నెటిజన్ వ్యాఖ్యానించాడు. ఇలాంటి చర్యలకు పాల్పడే వారి పట్ల చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని మరొకరు కోరారు. ఇలాంటి పని చేసే వారికి శిక్ష లేదా? అని ఇంకొకరు ప్రశ్నించారు. మొత్తంగా ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. వేల సంఖ్యలో వ్యూస్ సాధించింది. చిరుత మరణానికి కారణం అయిన వ్యక్తులను వెంటనే పట్టుకోవాలని జనాలు డిమాండ్ చేస్తున్నారు. అటు ఈ ఘటన దేశంలోనే జరిగినా.. ఎక్కడ అనేది సరిగా తెలియదు. వీడియో షేర్ చేసిన పర్వీన్ కూడా ఆ వివరాలను వెల్లడించలేదు. అయినా సదరు వ్యక్తులకు తప్పకుండా శిక్ష పడుతుందని పలువురు అభిప్రాయ పడుతున్నారు.
Also read: ఈ బిర్యానీ చాలా స్పెషల్, రైస్ అవసరం లేదు, జీవితంలో ఒక్కసారైన రుచి చూడాల్సిందే