పుర్రెకో బుద్ది జిహ్వకో రుచి అని పెద్దలు ఊరికే అనలేదు. ప్రపంచంలో చాలా మందికి వింత వింత కోరికలుంటాయి. వాటిని నెరవేర్చుకునేందుకు బోలెడంత డబ్బు ఖర్చు చేస్తుంటారు. వాళ్లు చేసే పని ఇతరులకు ఆశ్చర్యం కలించినా, వారికి మాత్రం చాలా సంతోషం కలిగిస్తాయి. తాజాగా జపాన్ కు చెందిన ఓ వ్యక్తి అచ్చం తోడేలుగా కనిపించేందుకు డ్రెస్ కుట్టించుకున్నాడు. ఇందుకోసం తను ఏకంగా రూ. 18 లక్షలు ఖర్చు చేశాడు.
తోడేలు డ్రెస్ కోసం రూ. 18.5 లక్షలు ఖర్చు
జపాన్ కు చెందిన జోకె జెప్పెట్ అనే సంస్థ జంతువుల్లా కనిపించే దుస్తులను తయారు చేయడంలో ప్రసిద్ధి పొందింది. లక్షల రూపాయలు ఖర్చు చేసి ఈ సంస్ధ నుంచి దుస్తులు కుట్టించుకుంటారు. పోయిన ఏడాది ఓ వ్యక్తి అచ్చం కుక్కలా కనిపించే దుస్తులు తీసుకున్నాడు. ఇందుకోసం తను రూ. 12 లక్షల రూపాయలు ఖర్చు చేశాడు. తాజాగా మరో వ్యక్తి తోడేలులా కనిపించే దుస్తులు తయారు చేయించుకున్నాడు. ఇందుకోసం తను ఏకంగా 3,000,000 యెన్లు (భారత కరెన్సీలో రూ. 18.5 లక్షలు) వెచ్చించాడు.
జంతువులపై ప్రేమతోనే తోడేలు డ్రెస్ తయారు చేయించుకున్నా!
“చిన్నప్పటి నుంచి నాకు జంతువులపై చాలా ప్రేమ ఉంది. టీవీలో కొన్ని అచ్చం జంతువుల్లా కనిపించే సూట్ లను చూశాను. అవి నాకు చాలా బాగా నచ్చాయి. నేను కూడా అలా ఉండాలి అనుకున్నాను. ఇందుకోసం చాలా తోడేళ్ల ఫోటోలను పరిశీలించాను. చివరకు ఓ ఫోటో ఓకే చేశాను. జెప్పెట్ వారికి ఆ ఫోటో పంపించాను. తోడేలు వెనక కాళ్లపై నడిచేలా ఉండాలని చెప్పాను. వాళ్లు 50 రోజుల్లో తోడేళు దుస్తులను తయారు చేశారు. ఆ సూట్ రెడీ అయ్యాక నేను వేసుకున్నాను. అద్దంలో నా రూపం నేను చూసుకుని ఆశ్చర్యపోయాను. నేను ఊహించినట్లుగానే సూట్ ఉంది. నా కోరిక తీరింది” అని సదురు వ్యక్తి తెలిపాడు.
కుక్క సూట్ కోసం రూ. 12 లక్షలు వెచ్చించిన కస్టమర్
గతంలో ఇదే సంస్థ నుంచి ఓ కస్టమర్ కుక్కలా కనిపించే సూట్ తయారు చేయించుకున్నాడు. ఈ దుస్తుల తయారీకి సుమారు రెండు నెలల సమయం పట్టింది. ఇందుకోసం సదరు వ్యక్తి రూ. 12 లక్షల రూపాయలు ఖర్చు చేశాడు. ప్రత్యేక సందర్భాల్లో తాను ఈ కుక్క సూట్ ను వేసుకుంటానని చెప్పాడు.
జంతువుల దుస్తులు తయారీలో జెప్పెట్ ప్రసిద్ధి
జపాన్ కు చెందిన జోకె జెప్పెట్ సంస్థ జంతువుల సూట్ లను తయారు చేయడంలో ప్రసిద్ధి చెందినది. ఇప్పటివరకు వందల సంఖ్యలు జంతువుల దుస్తులను తయారు చేసింది. ఆయా దుస్తుల తయారీని బట్టి డబ్బును చెల్లించాల్సి ఉంటుంది. అయితే, 10 లక్షల రూపాయలకు పైనే తయారీ ఖర్చు అయిన దుస్తులను పదుల సంఖ్యలో తయారు చేసినట్లు జెప్పెట్ వెల్లడించింది.
Read Also: సెగలు కక్కే లావాలోకి మనిషి పడిపోతే ఏం జరుగుతుందో తెలుసా? ఇదిగో ఈ వీడియో చూడండి