Visual Triggers for Overeating : ఇన్​స్టాగ్రామ్​లో రీల్స్​ ఎక్కువ మంది చూస్తారు. వాటిలో ఫుడ్ రీల్స్​కి ఉండే క్రేజ్ వేరు. వాటి మేకింగ్ వీడియోలు, రెసిపీ వీడియోలు చాలా ఇంట్రెస్టింగ్​గా కనిపిస్తాయి. చాలామంది మిడ్​నైట్​ కూడా ఫుడ్ రీల్స్ ఎక్కువగా చూస్తారు. మీరు కూడా అలాంటివారిలో ఒకరా? అయితే జాగ్రత్త. ఫుడ్ రీల్స్​ ఎఫెక్ట్ ఆరోగ్యంపై నెగిటివ్ ప్రభావం చూపిస్తాయంటున్నారు నిపుణులు. ఈ ఫుడ్ రీల్స్ ఆరోగ్యానికి హానికరమంటున్నారు. 


ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం


ఇన్​స్టాగ్రామ్​లో ఫుడ్ రీల్స్​ చూడడం, కుకింగ్ వీడియో చూసే అలవాటు ఉంటే అది బరువు పెరగడానికి ఓ కారణమవుతుందని చెప్తున్నారు. రీల్స్ చూడడం ఎలాగో మంచిది కాదు. కానీ ఫుడ్ రీల్స్, మేకింగ్ వీడియోలు షుగర్ క్రేవింగ్స్​ను ఎక్కువ చేస్తాయట. అంతేకాకుండా అవి మీరు ఇతర పనులు చేయకుండా.. స్క్రీన్​కి అతుక్కునిపోయేలా చేస్తాయట. ఫుడ్స్​ని చూసి వాటిని ఆర్డర్ పెట్టుకునేవారు కూడా ఉన్నారు. ఇది అన్​హెల్తీ ఫుడ్​ అలవాట్లను ప్రేరేపిస్తుంది. ఇది క్రమంగా ఆరోగ్యంపై దుష్ప్రభావాలను చూపిస్తుంది. 


స్క్రీన్ టైమ్ పెరుగుతుంది..


మీరు ఎప్పుడైనా గమనించారా? ఇన్​స్టాగ్రామ్​లో ఫుడ్ రీల్స్​కు ఎక్కువ వ్యూస్​ ఉంటాయి. ఆ డిమాండ్​ని చూసుకునే ఈ తరహా వీడియోలు చేసేవారి సంఖ్య కూడా పెరిగిపోయింది. పైగా ఇన్​స్టాగ్రామ్​ అల్​గారిథం కూడా ఏ టైప్​ వీడియోలు ఎక్కువగా చూస్తే వాటినే ఎక్కువగా యూజర్​కి పుష్​ చేస్తుంది. దీనివల్ల కంటిన్యూ ఫుడ్ వీడియోలు వస్తాయి. ఇవి ఎక్కువ స్క్రీన్​ టైమ్​ని తీసుకుంటాయి. ఫుడ్ క్రేవింగ్స్​ని పెంచుతాయి. 


ఆకలిని పెంచుతుంది


2019లో చేసిన ఓ అధ్యయనం ప్రకారం సోషల్ మీడియాలో ఫుడ్ వీడియోలు ఆకలిని పెంచుతున్నాయని గుర్తించింది. దీని గురించి బ్రెయిన్ అండ్ కాగ్నిషన్ జర్నల్​లో ప్రచురించారు. ఇవి గ్రెలిన్ స్థాయిలను పెంచే సామర్థ్యం కలిగి ఉంటాయని చెప్తున్నారు. ఇది మెదడుకు ఆకలిగా ఉందని చెప్పే హార్మోన్. రుచికరమైన వంటలను, ఫోటోలను చూసినప్పుడు మెదడులో ఫుడ్ క్రేవింగ్స్ పెరుగుతాయని దానిలో రాసుకొచ్చారు. బేసికల్​గా మీకు ఆకలి లేకపోయినా.. ఫుడ్ తినాలనే కోరికను పెంచుతాయని పరిశోధకులు తెలిపారు. 


అతి బరువుకు దారితీస్తుంది..


ఈ అతిగా తినే అలవాటు బరువుపై ప్రభావం చూపిస్తుందని చెప్తున్నారు. అవును ఫుడ్ రీల్స్ చూడడం వల్ల బరువు పెరుగుతారని తెలిపారు. స్క్రీన్ సమయం పెరగడం వల్ల శారీరక శ్రమ తగ్గుతుంది. ఇది కంటి చూపుపై కూడా ప్రభావం చూపిస్తుంది. అంతేకాకుండా జీవనశైలిలో అనేక మార్పులు కలిగిస్తుంది. ఆకలి టైమింగ్స్​కు అంతరాయం కలిగించి.. ఎక్కువ తినడానికి దారి తీస్తుందని తెలిపారు. ఫుడ్ వీడియోలు చూసే మహిళలు అధిక బరువును కలిగి ఉన్నట్లు ఓ అధ్యయనం తెలిపింది. జర్నల్​ అపెటైట్​లో దీని గురించి రాసుకొచ్చారు. 



ఈ అధ్యయనంలో భాగంగా 20 నుంచి 30 ఏళ్ల మధ్య ఉన్న 500 మహిళలపై అధ్యయనం చేశారు. వారి BMIలను లెక్కించేందుకు వారి బరువు, ఎత్తును తెలుసుకున్నారు పరిశోధకులు. దీనిలో భాగంగా కుకింగ్ వీడియోలు చూసేవారి బరువు ఎక్కువ ఉన్నట్లు గుర్తించారు. అందుకే ఈ తరహా వీడియోలకు వీలైనంత దూరంగా ఉండాలని సూచిస్తున్నారు నిపుణులు. లేదంటే అధిక బరువు వల్ల కలిగే అనర్థాలు ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయని హెచ్చరిస్తున్నారు. 


Also Read : ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మరణాలకు కారణమవుతున్న క్యాన్సర్ ఇదే.. రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నివారణ చర్యలు ఇవే