తమకి ఇష్టమైన వాళ్ళ పేర్లు, మనసుకు హత్తుకునే మెమరీస్ కి గుర్తుగా చాలా మంది తమ శరీరంపై టాటూ వేయించుకుంటారు. ఇక టాటూలంటే పిచ్చి ఉండి ఒళ్ళంతా వేయించుకునే వాళ్ళని చూస్తూనే ఉంటాం. ఈమెకి కూడా అదే రకం పిచ్చి. అందుకే టాటూ వేయించుకుంది. అయితే తన కోరికే తనని శాశ్వత అంధురాలిగా మార్చేసింది. ఒక్కోసారి ఆనందం కోసం తీసుకునే కొన్ని నిర్ణయాలు జీవితకాలం బాధని మిగులుస్తాయి. చేసిన తప్పు సరిదిద్దుకునే అవకాశం ఉండదు. ఇప్పుడు ఈమె పరిస్థితి కూడా అదే అయ్యింది. అసలేం జరిగిందంటే..


నార్త్ ఐర్లాండ్ కి చెందిన 32 ఏళ్ల అనయా పీటర్సన్ న్యాయ విద్యార్థిని. ఆస్ట్రేలియన్ మోడల్ అంబర్ లూక్ మాదిరిగా తను కూడా కంటి లోపల టాటూ వేయించుకోవాలని అనుకుంది. దాదాపు 98 శాతం శరీరం అంతా పచ్చబొట్టు పొడిపించుకుని ఫేమస్ అయ్యింది లూక్. చివరికి తన కంట్లో కూడా పచ్చబొట్టు వేయించుకుని సెన్సేషన్ క్రియేట్ చేసింది. అటువంటి లూక్ ని ఆదర్శంగా తీసుకుని అనయా కూడా తన కంట్లో తెల్లని గుడ్డు మీద పచ్చ బొట్టు వేయించుకుంది. జులై 2020లో ఆమె తన కుడి కన్ను లోపల టాటూ వేయించుకుంది. కొన్ని నెలలు బాగానే ఉంది ఎలాంటి సమస్యలు కూడా రాలేదు. కానీ తర్వాతే తను చేసింది ఎంత పెద్ద తప్పు అనేది తెలుసుకుంది. అప్పటికే పరిస్థితి చెయ్యి దాటి పోయింది. పచ్చబొట్టు కారణంగా తన కంటి చూపు పోగొట్టుకుంది.


టాటూ వేయించుకున్న కొన్ని నెలల తర్వాత తన కన్ను పొడిబారిపోయి తల నొప్పి రావడం మొదలైంది. అయినా తను మారలేదు అదే సంవత్సరం డిసెంబర్ లో ఎడమ కంటి లోపల కూడా పచ్చబొట్టు వేయించుకుంది. తర్వాత కొన్ని రోజులకి తన కన్ను బాగా ఉబ్బెత్తుగా వాసిపోయింది. వెంటనే డాక్టర్ దగ్గరకి వెళ్ళగా పరీక్షలు చేసిన వైద్యులు ఆమెకు కంటి శుక్లాలు వచ్చాయని చెప్పారు. ఇప్పుడు తను అంధురాలిగా మారిపోయింది. రెండు కళ్ళల్లో పచ్చబొట్టు వేయించుకోవడం వల్ల శాశ్వతంగా కంటి చూపు కోల్పోయింది.


టాటూ గురించి మయో క్లినిక్ ఏం చెబుతోంది?


పచ్చబొట్టులో ఉపయోగించే రసాయనాల వల్ల అలర్జీలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తుంది. అలాగే పచ్చబొట్టు కోసం ఉపయోగించే ఎరుపు, ఆకుపచ్చ, పసుపు, నీలం రంగులు అలర్జీలని తీసుకొస్తాయని వెల్లడించింది. పచ్చబొట్టు వేసిన ప్రదేశంలో దురద, దద్దుర్లు వస్తే వెంటనే చర్మ నిపుణులని కలిసి సరైన చికిత్స తీసుకోవాలని సూచిస్తున్నారు. టాటూ వేయించుకున్న కొన్ని సంవత్సరాల తర్వాత కూడా ఈ పరిస్థితి ఎదురుకావొచ్చు.


స్కిన్ ఇన్ఫెక్షన్లు: చర్మం దాని పొరల్లోకి రంగులని ఇంజెక్ట్ చేస్తారు. టాటూ వేసేటప్పుడు వచ్చే నొప్పిని చాలా మంది తట్టుకుంటారు. కానీ తర్వాత దాని వల్ల ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది. కొన్ని సార్లు పచ్చబొట్టు సిరా చుట్టూ వాపు కూడా రావొచ్చు.


 అంటువ్యాధులు రావొచ్చు: పచ్చబొట్టు వేయించేందుకు ఉపయోగించే పరికరాల వల్ల అంటు వ్యాధులు వచ్చే ప్రమాదం కూడా ఉంది. వ్యాధి సోకిన వ్యక్తికి ఉపయోగించిన పరికరాలు కలుషితమైన రక్తంలో కలిసి వాటినే ఇతరులకి కూడా టాటూ వేసేందుకు వాడితే వారికి రక్తసంబంధ, అంటు వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. హెపటైటిస్ బి, సి, ఒక్కోసారి హెచ్ ఐవి, ఎయిడ్స్ కూడా సోకే ప్రమాదం ఉంది.


టాటూ వేయించుకునే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు


☀ పచ్చబొట్టు వేసే వ్యక్తి పరికరాలు పరిశుభ్రంగా ఉంచే వ్యక్తినే సంప్రదించాలి.


☀ నాణ్యత కలిగిన సిరా, పరికరాలు ఉపయోగిస్తున్నారో లేదో తెలుసుకోవాలి.


☀ ప్రతి వ్యక్తికి టాటూ వేసే ముందు ఉపయోగించే సిరంజ్ కొత్తది ఉండేలా చూసుకోవాలి.


టాటూ వేయించుకున్నాక తీసుకోవాల్సిన జాగ్రత్తలు


☀ పచ్చబొట్టు పొడిచిన చర్మాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. ఘాడత తక్కువ ఉన్న సబ్బు, నీటితో శుభ్రం చేసుకుంటూ ఉండాలి. చర్మాన్ని చికాకు పెట్టించే కఠినమైన సబ్బు ఉపయోగించకూడదు.


☀ టాటూ వేసిన ప్రదేశంపై వేడి నీటిని పోయొద్దు. స్నానం చేసేటప్పుడు కూడా దాని మీద నేరుగా నీళ్ళు పొయ్యడం వంటివి చేయడం మంచిది కాదు.


☀ మాయిశ్చరైజర్ ఉపయోగించాలి. దాని మీద ఎప్పటికప్పుడు మాయిశ్చరైజర్ రాసుకుంటూ ఉండాలి. డాక్టర్ సూచించిన వాటిని ఉపయోగిస్తే మంచిది. కొన్ని రోజుల పాటు సూర్యరశ్మి తగలకుండా చూసుకోవాలి.


☀ స్విమ్మింగ్, హాట్ టబ్, నదులు, సరస్సు లో నీటిలోకి దిగడం స్నానం చేయడం వంటివి చెయ్యకూడదు.


☀ కనుబొమ్మలు, నాభి, చెవులు, నాలుక వంటి సున్నితమైన ప్రదేశాలలో పచ్చబొట్టు వేయించుకోకూడదు.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.


Also Read: నెయ్యి కలిపిన పాలు రోజుకో గ్లాస్ తాగారంటే ఈ సమస్యలన్నీ దూరం అవుతాయి