ఈ రోజుల్లో పెళ్లిల్లు తుమ్మితే ఊడిపోయే ముక్కులా ఉంటున్నాయి. ఎప్పుడు ఏం జరిగి.. పెళ్లి ఆగిపోతుందో తెలియని పరిస్థితి. మరీ చిన్న చిన్న కారణాలకు కూడా కొందరు అకస్మాత్తుగా పెళ్లి రద్దు చేసుకుంటున్నారు. అయితే, కొందరు మాత్రం మంచి కారణంతోనే పెళ్లిల్లు రద్దు చేసుకుంటున్నారు. వారికి కుటుంబ సభ్యులు కూడా మద్దతు ఇస్తున్నారు. అయితే, ఉత్తర ప్రదేశ్‌లోని ఈ పెళ్లి తంతు మాత్రం వరమాల వల్ల ఆగిపోయింది.
సాధారణంగా వరమాల వధువరులను ఒక్కటి చేస్తాయి. దండలు మార్చుకోవడమంటే.. ఒకరి మనసు మరొకరు ఇచ్చిపుచ్చుకోవడమే. కానీ, ఈ వధువరులను మాత్రం ఆ దండలే విడదీశాయి. ఒరయా జిల్లాలోని నవీన్ బస్తీలో ఓ జంటకు పెళ్లి జరుగుతోంది. ఈ సందర్భంగా వధువరులు ఒకరి మెడలో ఒకరు వరమాలలు మార్చుకోవాలి. ముందుగా వధువు అతడి మెడలో మాల వేసింది. ఆ తర్వాత వరుడి వంతు వచ్చింది. అయితే, వరుడు.. మాలను మెడలో వేయడానికి బదులుగా నిలబడిన చోటు నుంచే రజినీ స్టైల్‌లో విసిరాడు. అయితే, ఇది ఆ వధువుకు అస్సలు నచ్చలేదు. వరుడి ప్రవర్తన తనకు నచ్చలేదని, పెళ్లి రద్దు చేయాలని తల్లిదండ్రులను కోరింది. దీంతో ఆమెకు తల్లిదండ్రులు, పెద్దలు ఎంతో చెప్పి చూశారు. కానీ, ఆమె దీనికి అంగీకరించలేదు. చివరికి వరుడి కుటుంబికుల ఫిర్యాదుతో పోలీసులు రంగప్రవేశం చేసిన ఫలితం లేకపోయింది. పోలీసులు సమక్షంలోనే అప్పటివరకు ఇచ్చుకున్న నగలు, నగదు తదితర బహుమతులను తిరిగి తీసేసుకున్నారు.
కొద్ది రోజుల కిందట తమిళనాడులో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. కుడ్డలోర్ జిల్లా పన్రితీ ప్రాంతానికి చెందిన యువతికి, పెరియకట్టుపలాయం గ్రామానికి చెందిన వరుడికి పెళ్లి కుదిరింది. గతేడాది 6న ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. ఈ ఏడాది జనవరి 20న కదంపులియుర్ గ్రామంలో పెళ్లికి మూహూర్తం పెట్టారు. ఈ సందర్భంగా జనవరి 19న రిసెప్షన్ ఏర్పాటు చేశారు. (కొందరు పెళ్లికి ముందే రిసెప్షన్ ఏర్పాటు చేస్తారు). డీజేలో వధువు, వరుడు హ్యాపీగా డ్యాన్స్ చేశారు. వారి బంధువులు కూడా వారితో కలిసి స్టెప్పులు వేశారు. అదే సమయంలో వధువు కజిన్ కూడా వారితో కలిసి స్టెప్పులు వేశాడు. ఈ సందర్భంగా అతడు ఇద్దరి భుజాల మీద చేతులు వేశాడు. దీంతో వరుడికి కోపం వచ్చింది. వధువును, కజిన్‌ను పక్కకు తోసేశాడు. అలా డ్యాన్స్ చేసినందుకు వధువు చెంప వాయించాడు.
అందరి ముందు అలా కొట్టడంతో వధువుకు కోపం వచ్చింది. వెంటనే పెళ్లి రద్దు చేయాలని తల్లిదండ్రులను కోరింది. వారు కూడా అందుకు అంగీకరించారు. అప్పటికే పెళ్లి ఏర్పాట్లు చేసుకోవడంతో వారి బంధువుల్లోనే ఒకరినిచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు ఆమె కజిన్ ముందుకు రావడంతో అతడితోనే అదే ముహూర్తానికి పెళ్లి చేశారు. ఈ ఘటనపై వరుడు పోలీసులను ఆశ్రయించాడు. వధువు కుటుంబికులు తనను బెదిరించారని కేసు పెట్టాడు. ఈ పెళ్లి కోసం రూ.7 లక్షల వరకు ఖర్చుపెట్టామని, తమకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశాడు.