Ugadi Food Recipes (ఉగాది వంటలు): వేదాలలో కూడా పాయాసం ప్రస్తావన ఉందని చెప్తారు. ఆయుర్వేదంలో కూడా పాయసానికి ప్రత్యేక స్థానం ఉంది. అందుకే దీనిని పండుగల సమయంలో కచ్చితంగా చేస్తారు. ఆలయాల్లో కూడా ప్రసాదంగా ఇస్తారు. ఈ ఉగాది(Ugadi 2024) పండుగకి కూడా టేస్టీ, టెంపుల్ స్టైల్ పాయసం చేయాలనుకుంటే మీరు దానిని ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. కేవలం పండుగల సమయంలోనే కాదు.. ప్రతి ప్రత్యేక, శుభకార్యాల్లో కూడా దీనిని చేసుకోవచ్చు. మరి ఈ టేస్టీ పాయసాన్ని ఏ విధంగా తయారు చేస్తారో.. కావాల్సిన పదార్థాలు ఏమిటో.. పాటించాల్సిన టిప్స్​ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. 


కావాల్సిన పదార్థాలు


బియ్యం - అరకప్పు


పెసరపప్పు - 2 టేబుల్ స్పూన్లు


పాలు - అరకప్పు


నీరు - ఒకటిన్నర కప్పు


బెల్లం - ఒకటిన్నర కప్పు


యాలకుల పొడి - 1 టీస్పూన్


యాలకులు - 3


నెయ్యి - మూడు టేబుల్ స్పూన్లు


జీడిపప్ప - 10


ఎండు ద్రాక్ష - 2 టేబుల్ స్పూన్లు


తయారీ విధానం


ముందుగా బియ్యాన్ని కడిగి అరగంట నానబెట్టుకోవాలి. పొట్టులేని పెసరపప్పును కూడా బాగా కడిగి.. అరగంట నాననివ్వాలి. టైమ్​ లేదు అనుకున్నప్పుడు.. త్వరగా పాయాసాన్ని చేయాలి అనుకున్నప్పుడు దీనిని కుక్కర్​లో ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. అయితే పాయాసం చేసుకునేప్పుడు చాలామంది ఇచ్చే కంప్లైంట్ ఏది అంటే పాలు విరిగిపోవడం. పాలు విరిగిపోకుండా.. దీనిని టేస్టీగా, సింపుల్​గా చేసేందుకు కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. 


ట్రెడీషనల్ పాయాసం చేసుకునేప్పుడు ఆవు పాలు ఉపయోగించాలి. అవి అందుబాటులో లేనప్పుడు చిక్కటి గేదేపాలతో కూడా దీనిని తయారు చేసుకోవచ్చు. పాలు చిక్కగా ఉంటే రుచి అద్భుతంగా వస్తుంది. ఇప్పుడు కుక్కర్ తీసుకుని దానిలో బియ్యం, పాలు, నీరు అర కప్పు కొలతలతో తీసుకోవాలి. దానిలోనే మూడు యాలకులు వేయాలి. నీరు, పాలు కలిపితే బియ్యం త్వరగా ఉడుకుతుంది. చిక్కటి పాలల్లో ఉడికించడానికి ఎక్కువ సమయం పడుతుంది. స్టౌవ్​ను సిమ్​లో ఉంచి మాత్రమే పాయాసాన్ని చేసుకోవాలి. ఇలా మంట తగ్గించి మూడు విజిల్స్ వచ్చిన తర్వాత స్టౌవ్ ఆపేయాలి. 


ఇప్పుడు స్టౌవ్ వెలిగించి పాన్​ లేదా కడాయి పెట్టి దానిలో తురిమిన బెల్లం వేయాలి. దానిలో పావు కప్పు నీరు కూడా వేయాలి. బెల్లం నీటిలో కరిగి.. ఓ పొంగు వచ్చిన తర్వాత దానిని వడకట్టాలి. అప్పుడు బెల్లంలోని మలినాలు పోతాయి. బెల్లం తయారయ్యేలోపు రైస్​లో స్టీమ్ పోయి ఉంటుంది. ఇప్పుడు దానిలో వడకట్టిన బెల్లం సిరప్ వేయాలి. దీనిలోనే మరో అరకప్పు నీటిని వేసి.. కలిపి స్టౌవ్​ వెలిగించి దానిమీద ఉంచాలి. అన్నం ఎలాగో ఉడికిపోయింది కాబట్టి పాయసం విరగడమనేది జరగదు. బెల్లం సిరప్ వల్ల పాయసం రంగు మంచిగా వస్తుంది. దానిలో చిటికెడు పచ్చ కర్పూరం వేసి కలపాలి.


పాయసం కోసం మరోసారి స్టౌవ్ వెలిగించి చిన్న కడాయి పెట్టాలి. దానిలో నెయ్యి వేసి.. అది కరిగాక జీడిపప్పు వేయాలి. జీడిపప్పు వేగాక.. ఎండుద్రాక్ష వేయాలి. అవి వేగిన వెంటనే పాయసంలో వేసేయాలి. దానిలోనే యాలకుల పొడి కూడా వేయాలి. ఇప్పుడు పాయసంలో కలిసేలా వాటిని బాగా కలిపితే పాయసం రెడీ. దీనిని నైవేద్యంగా పెట్టిన తర్వాత ఇంటిల్లిపాది లాగించవచ్చు. ఈ పాయసం ఇంకా క్రీమీగా రావాలనుకుంటే మీరు చిక్కటిపాలు మరిన్ని వేసుకోవచ్చు. ఈ పాయసం మీకు మంచి రుచిని అందిస్తుంది. 


Also Read : ప్రసాదంగా చింతపండు పులిహోర, దద్దోజనం.. ఉగాదికి ఇలా చేసేయండి