RS Praveen Kumar- కరీంనగర్: ప్రజాపాలన పేరుతో  రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతీకార పాలన సాగిస్తున్నారని భారత రాష్ట్ర సమితి (BRS) నాగర్ కర్నూలు పార్లమెంట్ అభ్యర్ధి డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో భాగంగా ఆదివారం కరీంనగర్ లో బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన సభకు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. అసెంబ్లీ ఎన్నికల్లో తుక్కుగూడ వేదికగా 6 గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ అబద్ధపు హామీలు ఇచ్చి, ప్రజలను మోసం చేసిందన్నారు. హామీలు అమలు చేయకుండా కాంగ్రెస్ నేతలు గారడీ పాలన సాగిస్తున్నారని ఆర్ఎస్పీ విమర్శించారు.
రేవంత్ ఆదేశాలతో బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు
రేవంత్ రెడ్డి ఆదేశాలతో బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు పెట్టి, భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. బీఆర్ఎస్ శ్రేణులు అక్రమ కేసులకు భయపడకుండా దైర్యంగా ఎదుర్కొని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓడించాలన్నారు. రాబోయే పార్లమెంటు ఎన్నికలు పదేళ్ల నిజమైన పాలన అందించిన బీఆర్ఎస్, వంద రోజుల అబద్దాల కాంగ్రెస్ ప్రభుత్వం మధ్య జరుగుతున్నాయని చెప్పారు. పంటలు ఎండిపోయి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేత పత్రాల  పేరుతో గత ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నారు తప్పా, ప్రజా సమస్యలు పరిష్కరించడంలేదంటూ మండిపడ్డారు. 


కేంద్రంలో ఎన్డీఏ మరోసారి అధికారంలోకి వస్తే, రాజ్యాంగాన్ని రద్దు చేసి, మనుస్మృతి ఆధారంగా అలహాబాద్ లో కొంతమంది హిందుత్వవాదులు రాసిన హిందుత్వ రాజ్యాంగాన్ని అమలు చేస్తారు. రాజ్యాంగం రద్దయితే హక్కులు కోల్పోతాం. నా జెండా మారినా అజెండా పేద ప్రజల పక్షమే. మసీదులు తవ్వే నాయకులు కావాలో, ప్రజా సమస్యలపై పార్లమెంటులో గళమెత్తే నాయకులను గెలిపించాలో ఓటర్లు తేల్చుకోవాలి. కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్ధి బోయినపల్లి వినోద్ కుమార్ ను భారీ మెజారిటీతో గెలిపించాలి  - ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 


కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్ధి బోయినపల్లి వినోద్ కుమార్
తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్టీ బీఆర్ఎస్. తెలంగాణను 10 ఏళ్లు పాలించి అభివృద్ధిలో దేశంలో అగ్రగామిగా నిలిపారు కేసీఆర్. ఆయన నాయకత్వాన్ని ప్రజలు మళ్లీ కోరుకంటున్నారు.  గత పదేళ్లు 24 గంటల విద్యుత్ ను అందించిన ఘనత కేసీఆర్ దే. ఉమ్మడి ఏపీ పాలనలో కరువుతో అల్లాడిన తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులు కట్టి కోటి ఎకరాలకు సాగునీరు అందించాం. దేశంలో దళితుల ఆర్ధిక అభివృద్ధి కోసం దళిత బంధుతో రు.10 లక్షలు ఆర్ధిక సాయం చేసిన ఘనత కేసీఆర్ దే. తెలంగాణ అభివృద్ధి బీఆర్ఎస్‌తోనే సాధ్యం. కాంగ్రెస్ పార్టీకి అభివృద్ధి సాధ్యం కాదు. ఈ ఎన్నికల సన్నాహక సమావేశంలో కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్, పలువురు జడ్పిటిసిలు, ఎంపిటిసిలు, మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు.