Curcumin Benefits for Gut Health : జీర్ణాశయం, గట్ సమస్యలతో ఇబ్బంది పడుతున్న రోగులకు చికిత్స చేయడంలో పసుపు ఎంత సామర్థ్యం కలిగి ఉంది.. దానితో ఏమైనా ఫలితాలు మెరుగవుతాయా? అనే విషయంపై తాజాగా ఎలుకలపై ఓ స్టడీ చేశారు. దీనిలో భాగంగా పసుపు.. గట్ సామర్థ్యాన్ని మెరుగుపరిచేలా ఎలుకల కడుపులో నానోమల్షన్​ను అభివృద్ధి చేసినట్లు పరిశోధకులు కనుగొన్నారు. పసుపులోని ఓ పదార్థం ఎలుకల గట్స్​లో ప్రయోజనకరమైన బ్యాక్టీరియాను పెంచినట్లు ఈ అధ్యయనం తెలిపింది. 


గట్ సమస్యలకు చెక్ పెట్టేందుకు..


క్రోనస్ వ్యాధి, వ్రణోత్పత్తి, పెద్దపేగు సమస్యలతో బాధపడుతున్న రోగులలో పసుపులోని కర్కుమిన్ అనే పదార్థం జీవ లభ్యతను మెరుగుపరచడమే లక్ష్యంగా పరిశోధన చేసింది. దీనిలో యూనివర్శిటీ ఆఫ్ వెస్ట్రన్ సో పాలో, సో పాలో స్టేట్ యూనివర్శిటీ పరిశోధకులు పాల్గొన్నారు. పసుపులో ప్రధాన పదార్థమైన కర్కుమిన్​ను ఎలుకల గట్​లోకి ప్రవేశపెట్టారు. ఈ అధ్యయనానికి పేగు సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఎలుకలను ఎంచుకున్నారు. కర్కుమిన్ నానోమల్షన్​ను 14 రోజులు పాటు నోటి ద్వారా అందించి వాటిపై పరిశోధనలు చేశారు. 


హెల్తీ బ్యాక్టీరియాను వృద్ధి చేసిన కర్కుమిన్


పసుపులోని కర్కుమిన్ నానోమల్షన్​ ఎలుకల కడుపులో ప్రయోజనకరమైన బ్యాక్టీరియాను పెంచినట్లు గుర్తించారు. పసుపులోని క్రీయాశీల సమ్మేళనం అయిన కర్కుమిన్.. గట్ సమస్యలను దూరం చేస్తూ.. హెల్తీ బ్యాక్టీరియాను అభివృద్ధి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉన్నట్లు గుర్తించారు. మెరుగైన గట్ మైక్రోబయోటా, జీవ లభ్యత పరంగా మంచి రిజల్ట్స్ రావడం గుర్తించారు. ఈ అధ్యయనం గురించి ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఫార్మాస్యూటిక్స్​లో ప్రచురించారు.


పసుపులో కూడా లాక్టోబాసిల్లస్?


నానోమల్షన్ రూపంలో కర్కుమిన్​ గట్​ హెల్త్​కు మంచి పరిష్కారం ఇస్తుందని దీనిలో తెలిపారు. దీనితో చికిత్స చేసిన ఎలుకలలో లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియా సమృద్ధిలో 25 శాతం పెరుగుదలతో సంబంధం కలిగి ఉన్నట్లు పరిశోధకులు గుర్తించినట్లు తెలుస్తోంది. అయితే ఈ లాక్టోబాసిల్లస్ అనే బ్యాక్టీరియా సాధారణంగా పెరుగు వంటి ప్రోబయోటిక్స్ వంటి ఫుడ్స్​లలో మాత్రమే కనిపిస్తుంది. ఇది గట్ ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్నిచూపిస్తుంది. అందుకే జీర్ణ సమస్యలున్నవారు ఎక్కువ ప్రోబయోటిక్స్ కలిగిన ఫుడ్స్ తీసుకుంటారు. 


మంచి ఫలితాలిచ్చిన పరిశోధన


ఈ పరిశోధనలో నానోమల్షన్ అనే ప్రయోజనకరమైన బ్యాక్టీరియా ఎలుకల గట్​లో తన ఉనికిని పెంచి తద్వారా ఎలుకల గట్ మైక్రోబయోటాను మార్చిందని UNOESTE ప్రొఫెసర్ లిజియాన్ క్రెట్లీ వింకెల్ స్ట్రేటర్ ఎల్లర్ తెలిపారు. పసుపులోని కర్కుమిన్ జీవ లభ్యతను సమర్థవంతంగా మెరుగుపరుస్తుందని ఆయన వెల్లడించారు. అంతేకాకుండా నానోమల్షన్ పేగు మంటలో గణనీయమైన మార్పులు తీసుకురానప్పటికీ.. కర్కుమిన్ నానోమల్షన్​తో చికిత్స చేసిన ఎలుకలలో లాక్టోబాసిల్లస్ బ్యాక్టిరీయా మంచి ఫలితాలు ఇచ్చిందని తెలిపారు. 


తాజా ఫలితాల ఆధారంగా.. గట్ సమస్యలు, ఇన్​ఫ్లమేటరీ పేగు వ్యాధులను నివారించడంలో, చికిత్స చేయడంలో పసుపు చేసే అద్భుతాలపై పెదవి విప్పారు. ఎన్నో ఖరీదైన, ముఖ్యమైన మందులతో సంబంధం ఉన్న చికిత్సల కంటే ఇది మంచి ప్రత్యామ్నాయంగా చెప్తున్నారు. గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో పసుపు ఇచ్చే బెనిఫిట్స్​ని ఈ అధ్యయనం మరోసారి వెలుగులోకి తీసుకువచ్చింది. జీర్ణశయా సంబంధిత వ్యాధులకు మెరుగైన చికిత్సల అభివృద్దికి ఈ స్టడీ హెల్ప్ కానుంది. 


Also Read : బరువును తగ్గించే హెల్తీ సూప్.. డిన్నర్​కి పర్​ఫెక్ట్​ రెసిపీ





గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.