ఒరియో బిస్కెట్లు పిల్లల ఫేవరేట్ బిస్కెట్లు. వాటితో ఐస్‌క్రీమ్ చేస్తే అదిరిపోతుంది. వేసవి వచ్చిందంటే పిల్లలు ఐస్ క్రీములు తెగ తింటారు. రకరకాల ఫ్లేవర్లలో దొరికే ఐస్ క్రీములు వేసవి వస్త చాలు ధరలు పెరిగిపోతాయి. ఇంట్లోనే చాలా సులువుగా తయారుచేసుకోవచ్చు. దీనికి అయ్యే ఖర్చు కూడా చాలా తక్కువ. ఒకేసారి ముగ్గురు నుంచి నలుగురికి సరిపడా ఐస్ క్రీము తయారుచేసుకోవచ్చు.  ఒక్కసారి చేసుకుంటే మూడు రోజుల పాటూ పిల్లలకు తినిపించవచ్చు.


కావాల్సిన పదార్థాలు
ఒరియో బిస్కెట్లు - 25
చక్కెర పొడి - రెండు స్పూన్లు
క్రీమ్ - 250ఎమ్ఎల్
చాక్లెట్ సాస్ - సరిపడినంత
పాలు - పావు లీటరు
వెనిల్లా ఎసెన్స్ - ఒక స్పూను


తయారీ ఇలా 
1. ఒరియో బిస్కెట్లను ముక్కలుగా చేసి, పొడిలా చేసుకోవాలి. 
2.ఒక గిన్నెలో పాలు, క్రీమ్, చక్కెర, వెనిల్లా ఎసెన్స్ వేసి చిక్కగా అయ్యే వరకు బ్లెండర్‌తో మిక్స్ చేయాలి. 
3. ఆ మిశ్రమంలో బిస్కెట్ల పొడిని వేసి బాగా మిక్స్ చేయాలి. 
4. ఆ మిశ్రమాన్ని ఒక టిన్ లో వేసి, పైన ప్లాస్టిక్ పేపర్ తో ర్యాప్ చేయాలి. గాలి తగలకుండా మూత పెట్టాలి.  
5. దాదాపు అయిదు గంటలు ఫ్రిజ్‌లో ఉంచాలి. 
6. ఐస్ క్రీములా గడ్డ కట్టాక పైన చాక్లెట్ సాస్ చల్లాలి. స్పూనుతో తింటుంటే రుచి అదిరిపోతుంది. 


మామిడి పండ్లు కూడా వేసవిలో అధికంగా దొరుకుతాయి. వీటితో కూడా టేస్టీ ఐస్ క్రీము తయారుచేయచ్చు. 


కావాల్సిన పదార్థాలు
మామిడి పండ్లు - రెండు
పాలు - అర లీటరు
క్రీమ్ - 200 గ్రాములు
చక్కెర -  వంద గ్రాములు
బేకింగ్ పౌడర్ - అర స్పూను


1. ఈ ఐస్ క్రీము తయారీ కోసం బాగా పండిన మామిడి పండ్లను  ఎంచుకోవాలి. వాటిని తొక్కతీసి ముక్కలుగా కోసి పెట్టుకోవాలి. 
2. చక్కెర, మామిడి ముక్కలు కలిపి మిక్సీలో పేస్టులా చేసి పక్కన పెట్టుకోవాలి. 
3. పాలను గిన్నెలో వేసి వేడి చేయాలి. మరిగిన పాల నుంచి పావు కప్పు పాలను పక్కన తీసి పెట్టుకోవాలి. 
4. గిన్నెలోని పాలను బాగా చల్లార్చుకోవాలి. అందులో క్రీమ్ వేసి బాగా బీట్ చేయాలి. 
5. ఆ పాలలో ముందుగా చేసి పెట్టుకున్న మామిడి ముక్కల గుజ్జును వేసి కలపాలి. 
6. బేకింగ్ పౌడర్ కూడా వేసి బాగా బ్లెండ్ చేయాలి. 
7. ఇప్పుడు కంటైనర్లో ఈ మొత్తం మిశ్రమాన్ని వేసి మూత పెట్టి ఫ్రిజ్ లో పెట్టాలి. అయిదు గంటలు అలా వదిలేస్తే చిక్కటి మ్యాంగో ఐస్ క్రీమ్ రెడీ అయినట్టే. 


Also read: చక్కెర అధికంగా తింటే మధుమేహం వస్తుందా? ఇది ఎంతవరకు నిజం



Also read: శిశువు ఏ లోపాలు లేకుండా పుట్టాలంటే గర్భిణీలు కాకరకాయ వంటకాలు తినాల్సిందే






































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.