డయాబెటిస్ వచ్చిందంటే ఆహారంలోనూ, జీవన శైలిలోనూ ఎన్నో మార్పులు చేసుకోక తప్పదు.  దీనివల్ల శరీరంలోని ప్రధాన అవయవాలకు కూడా ముప్పే. కాబట్టి డయాబెటిస్‌ను అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవడం ద్వారా డయాబెటిస్‌ను నియంత్రణలో ఉంచుకోవచ్చు. తీపి అధికంగా ఉండే ఆహారాలను తినడం మానేస్తే రక్తంలోని చక్కెర పెరగదు. అయితే చాలామందికి చక్కెర తినడం ద్వారానే డయాబెటిస్ వస్తుందనే అపోహ ఉంది. ఇది ఎంతవరకు నిజమో వైద్యులు వివరిస్తున్నారు. 


ఎవరికైనా మధుమేహం రావడానికి రక్తంలోని చక్కెర స్థాయిలు పెరగడమే ప్రధాన కారణం. కానీ ఆరోగ్యకరమైన వ్యక్తి, డయాబెటిస్ లేని వ్యక్తి చక్కెర తినడం వల్ల ఆ వ్యాధిని తెచ్చుకుంటాడని అని మాత్రం కాదు.  మధుమేహం వచ్చాక చక్కెరను తినడం ఆపేయాలి. అయితే అధిక చక్కెర శరీరంలో చేరడం మాత్రం ఎప్పటికైనా ప్రమాదమే. స్వీట్లు వంటి తీపి వస్తువులు తినడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉంది. బరువు పెరిగితే మధుమేహం, అధిక రక్తపోటు వంటివి త్వరగా రావచ్చు. కాబట్టి చక్కెర పదార్థాలను తగ్గించడమే మంచిది. కానీ పూర్తిగా చక్కెర తినడం వల్లే డయాబెటిస్ వస్తుందని మాత్రం ఎక్కడా శాస్త్రీయ నిరూపణ లేదు.


మధుమేహం ఉన్నవారు పండ్లు కూడా మితంగా తినాలని అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే కూరగాయల కంటే పండ్లలో సహజ చక్కెర్లు ఎక్కువగా ఉంటాయి. కానీ కేకులు, బిస్కెట్లు, స్వీట్లు వంటి బేకరీ ఉత్పత్తులతో పోలిస్తే ఈ చక్కెర ఆరోగ్యకరమైనది. చాలా తక్కువ పరిమాణంలో ఉంటుంది కూడా. అలాగే పండ్లు ఇతర పోషకాలను ఇవి కలిగి ఉంటాయి. అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ చెబుతున్న ప్రకారం పండ్లలో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ వంటివి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి. టైప్2 డయాబెటిస్ ఉన్నవారు ఏమాత్రం ఆలోచించకుండా పండ్లు ఎన్నయినా తినవచ్చు. 


అలాగే డయాబెటిస్ బారిన పడినవారు పూర్తిగా అన్నాన్ని మానేయాలని అనుకుంటారు. అలా పూర్తిగా అన్నం మానుకోవాల్సిన అవసరం లేదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. బియ్యంలో కన్నా గోధుమపిండిలో కొంచెం చక్కెర స్థాయిలు తక్కువగా ఉంటుంది. అందుకే ఎక్కువ మంది గోధుమపిండితో చేసిన చపాతీలు తినడం ప్రారంభిస్తారు. అయితే పూర్తిగా అన్నాన్ని మానేయాల్సిన అవసరం లేదు. దంపుడు బియ్యాన్ని, తక్కువ పాలిష్ చేసిన బియ్యాన్ని తినవచ్చు. అయితే బంగాళదుంప చిప్స్ వంటివి మాత్రం పూర్తిగా మానేయాలి. బంగాళదుంప కూరను తినడం తగ్గించాలి.


అధిక బరువు ఉన్నవారు, ఊబకాయం బారిన పడినవారు మాత్రమే మధుమేహం వస్తుందని అనుకుంటారు.  వారికి మధుమేహం త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది. కానీ సన్నగా ఉన్నా కూడా ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించని వారిలో మధుమేహం వచ్చే అవకాశం ఉంది. 


Also read: శిశువు ఏ లోపాలు లేకుండా పుట్టాలంటే గర్భిణీలు కాకరకాయ వంటకాలు తినాల్సిందే






































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.