జుట్టు సంరక్షణకి మార్కెట్లో ఎన్నో రకాల ప్రొడక్ట్స్ అందుబాటులో ఉన్నాయి. అయినా కూడా కొంతమంది వంటింట్లో దొరికే వాటితోనే జుట్టును సంరక్షించుకునేందుకు చూస్తారు. మందార ఆకులు, కరివేపాకు, మెంతి పొడి, ఉసిరి పొడి ఇలా పలు రకాల పదార్థాలని కొబ్బరి నూనెలో వేసి బాగా మరిగించి ఆ నూనెని తలకి దట్టంగా పట్టిస్తారు. ఇలా చెయ్యడం వల్ల కుదుళ్లు బలపడటంతో పాటు జుట్టు రాలే సమస్య నుంచి కూడా బయటపడేందుకు సహకరిస్తుంది. అలా జుట్టుకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చేది మరొకటి ఉంది. అదే ఆలివ్ ఆయిల్. ప్రతి ఒక్క వంటింట్లో ఇది అందుబాటులో ఉంటుంది. ఇది ఆరోగ్యాన్ని ఇవ్వడంతో పాటు జుట్టుని కూడా సంరక్షిస్తుంది. రసాయనాలతో జుట్టును కాపాడుకునే బదులు సహజసిద్ధంగా జుట్టుని రక్షించుకోవడానికి అలివ్ ఆయిల్ మంచి ఎంపిక అనడంలో ఎటువంటి సందేహం లేదు.


ఆలివ్ ఆయిల్ చర్మ, జుట్టు సంబంధ సమస్యల్ని పరిష్కరించడంలో సహాయపడుతుంది. ఇందులో ఉండే విటమిన్స్, ఖనిజాలు జుట్టు హెల్తీగా ఉండేందుకు దోహదపడతాయి. ఆలివ్ ఆయిల్ జుట్టుకి కలిగే ప్రయోజనాలేంతో ఓ లుక్కేద్దామా..


చిట్లిన జుట్టుని రక్షిస్తుంది


అందరికీ ఉండే సమస్యే ఇది. జుట్టు చివర్ల చిట్లి పోయి ఛండాలంగా కనిపిస్తుందని. దాన్ని పోగొట్టేందుకు ఆలివ్ ఆయిల్ అద్భుతమైన ఎంపిక. తేమ, అధిక వేడి కారణంగా జుట్టు చివర్ల చిట్లిపోతుంది. దీంతో చాలా మంది చివర్ల జుట్టు కత్తిరించేస్తారు. దాన్ని తగ్గించుకునేందుకు ఆలివ్ ఆయిల్‌తో మర్దన చెయ్యడం వల్ల మంచి ఫలితం కనిపిస్తుంది. ఇది తరచూ జుట్టు స్ప్లిట్స్ దగ్గర రాస్తే అవి తగ్గిపోతాయి. అంతే కాదు జుట్టు రాలే సమస్యని నియంత్రిస్తుంది.


జుట్టు పెళుసుగా లేకుండా చేస్తుంది


జుట్టుకి హీట్ ట్రీట్మెంట్ కారణంగా అది పెళుసుగా మారి ఇబ్బంది పెడుతుంది. ఇదే కాకుండా కాలుష్యం వల్ల కూడా జుట్టు పెళుసుగా మారి దెబ్బతింటుంది. దీనికి చక్కటి పరిష్కారం ఆలివ్ ఆయిల్. ఇది మీ జుట్టుని మృదువుగా మార్చి హెయిర్ ఫాల్‌ని కంట్రోల్ చేస్తుంది.


రింగుల జుట్టుకీ మంచిదే


గిరిజాల జుట్టుకి ఆలివ్ ఆయిల్ చాలా మంచిది. ఈ జుట్టు ఉన్న వాళ్ళు స్ప్లిట్స్ సమస్యని ఎక్కువగా ఎదుర్కొంటారు. ఆలివ్ ఆయిల్‌తో జుట్టు మర్దన చెయ్యడం వల్ల జుట్టు మెత్తగా మారి.. జుట్టు చివర్ల చెడిపోకుండా చూస్తుంది. కర్లింగ్ హెయిర్ ఎక్కువగా చిక్కు పడుతుంది. ఆలివ్ ఆయిల్ రాసుకోవడం వల్ల జుట్టు మృదువుగా ఉంది తేలికగా చిక్కు పోతుంది.


జుట్టు రాలే సమస్యని తగ్గిస్తుంది


తల మాడుకి జుట్టు చివర్ల వరకు బాగా ఆలివ్ ఆయిల్ దట్టించి మసాజ్ చెయ్యడం వల్ల జుట్టు రాలే సమస్య నుంచి బయటపడొచ్చు. ఇలా చెయ్యడం వల్ల జుట్టు కుదుళ్లు మరింత బలంగా మారి జుట్టు పెరిగేందుకు దోహదపడుతుంది. అదనపు ప్రయోజనాలు పొందేందుకు ఆలివ్ ఆయిల్‌ను ఇతర ప్రొడక్ట్స్‌తో కలిపి ఉపయోగించుకోవచ్చు.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.


Also Read: బరువు తగ్గాలా? జంక్‌ ఫుడ్‌కు బదులు వీటిని ట్రైచేయండి - రుచిగా ఉంటాయ్, ఆరోగ్యకరం కూడా!


Also read: ఆరోగ్యకరమైన చిరుతిండి క్యాప్సికమ్ రింగ్స్, ఇలా చేస్తే కరకరలాడతాయి