చర్మం అందంగా మెరిసిపోవాలని ప్రతివారు కోరుకుంటారు. కానీ కాలుష్యం, తినే ఆహారం వల్ల చర్మం కళ తప్పుతోంది. చర్మానికి సహజ మెరుపును, కళను అందించేందుకు దానిమ్మతో కొన్ని రకాల ఫేస్ ప్యాక్ లు ప్రయత్నించండి. వీటిని వేసుకోవడం చాలా సులువు. దానిమ్మలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, పోషకాలు నిండుగా ఉంటాయి. దానిమ్మ ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల చర్మం ముడతలు పడడం, గీతలు పడడం తగ్గుతాయి. దానిమ్మలో యాంటీ ఏజింగ్ లక్షణాలు అధికం. కాంతి వంతమైన చర్మం కోసం ఇక్కడ ఇచ్చిన దానిమ్మ మాస్క్‌లను ప్రయత్నించండి.  పిల్లలకు కూడా ఈ మాస్క్ లు వేయచ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్టులు కలగవు. 


1. దానిమ్మ రసాన్ని తీసి పెరుగుతో కలపాలి. పేస్టులా చేశాక ముఖం, మెడకు పట్టించాలి. పావుగంట సేపు అలా ఉంచాక గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ మాస్క్ చర్మాన్ని తేమవంతంగా, ప్రకాశవంతంగా మారుస్తుంది. 


2. దానిమ్మ రసాన్ని చిన్న గిన్నెలో వేసి అందులో తేనె వేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 20 నిమిషాల పాటూ వదిలేయాలి. గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం తేమవంతంగా మారుతుంది. చర్మం కణాలు పునరుజ్జీవాన్ని పొందుతాయి. 


3. ఓట్స్‌ను నానబెట్టి మెత్తటి పేస్టులా రుబ్బుకోవాలి. అందులో దానిమ్మ రసాన్ని వేయాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి పావుగంట సేపు ఉంచాలి. ఈ మాస్క్ వేసుకోవడం వల్ల చర్మం ఎక్స్ ఫోలియేట్ అవుతుంది. చర్మం ప్రకాశవంతంగా మారుతుంది. సున్నితంగా మారుతుంది. 


4. దానిమ్మ రసాన్ని తీసి ఒక గిన్నెలో వేయాలి. అందులో కొన్ని చుక్కల నిమ్మరసం వేయాలి. ఈ మిశ్రమాన్ని పావుగంటసేపు ఉంచి చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.  ఇది డార్క్ స్పాట్లను తగ్గిస్తుంది. 


5. కలబంద జెల్ ను తీసి గిన్నెలో వేయాలి. అందులో దానిమ్మ రసాన్ని కలపాలి. దాన్ని ముఖానికి రాసి 30 నిమిషాల పాటూ ఉంచాలి. తరువాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇది చర్మాన్ని తేమవంతంగా మారుస్తుంది. చర్మంపై దురదను తగ్గిస్తుంది. 


6. దానిమ్మ రసంలో చిటికెడు పసుపును కలపాలి. దీన్ని ముఖానికి పట్టించాలి. కంటి ప్రాంతంలో మాత్రం రాయకండి. పావుగంట సేపు అలా వదిలేసి తరువాత శుభ్రం కడగాలి. ఇది చర్మాన్ని ప్రకాశవంతంగా మారుస్తుంది. మురికిని క్లీన్ చేస్తుంది.  ఇవన్నీ చాలా సింపుల్ మాస్క్‌లే. ప్రతి ఒక్కరూ ప్రయత్నించవచ్చు.


Also read: చికెన్ కీమా ఇలా శెనగపప్పుతో కలిపి వండారంటే రుచి మామూలుగా ఉండదు





Also read: ఈ పండ్లు ఎక్కడైనా కనిపిస్తే కచ్చితంగా తినండి, గుండె జబ్బులు రాకుండా ఉంటాయి



































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.