అందమైన ఆరోగ్యకమైన జుట్టు పొందేందుకు అమ్మాయిలు చేయని ప్రయత్నం అంటూ ఉండదు. జుట్టే వారికి మరింత అందాన్ని తెచ్చిపెడతాయి. అందుకే జుట్టు సంరక్షణ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. కానీ కాలుష్య వాతావరణంలో తిరగడం వల్ల జుట్టు పొడిబారిపోతుంది. జిడ్డుగా మారిపోతుంది. పొడిబారిన జుట్టు నిర్జీవంగా పేలవంగా, బలహీనంగా మారిపోతుంది. అంతేకాదు జుట్టు సులభంగా విరిగిపోవడంతో పాటు చివర్ల చీలిపోతుంది. అది జుట్టు రాలడానికి దారి తీస్తుంది. పొడి జుట్టుకు అత్యంత సాధారణ కారణాలు సహజ నూనెలు లేకపోవడం, పొడి వాతావరణ పరిస్థితులు, స్టైలింగ్ లోషన్స్ ఉపయోగించడం.


పొడి జుట్టుకి తేమ లేకపోవడం వల్ల నిర్జీవంగా అనిపిస్తుంది. అందుకే దానికి తగిన పోషణ అందిచాలి. పొడి జుట్టు సమస్యని సున్నితంగా డీల్ చెయ్యాలి. అందుకోసం మార్కెట్లో దొరికే ఉత్పత్తులు, బ్యూటీ పార్లర్ మీద ఆధారపడకుండా ఇంట్లోనే సులభంగా చికిత్స చేసుకోవచ్చు. వంటింట్లో దొరికే వాటితోనే చిన్న చిన్న చిట్కాలు పాటించి పొడిబారిన జుట్టు సమస్య నుంచి బయటపడొచ్చు.


డ్రై హెయిర్ వదిలించుకునే మార్గాలు


☀ అధికంగా బ్రష్ లు ఉపయోగిస్తూ ఉంటారు. ఆ పద్ధతిని నిరోధించాలి. మృదువైన విస్తృతంగా పళ్ళు ఉండే దువ్వెన ఉపయోగించాలి. చిక్కు దువ్వెనతో చాలా జాగ్రత్తగా జుట్టు చిక్కు తీసుకోవాలి. కఠినంగా లాగకుండా నెమ్మదిగా మధ్య మధ్యలో వేళ్ళతో పడిన చిక్కుని సున్నితంగా విడదీయాలి.


☀ పొడి జుట్టు వదిలించుకోవడం కోసం అద్భుతమైన రెమిడీ వేడి నూనె. ఆముదంలో ఒక భాగంలో రెండు భాగాల కొబ్బరి నూనె కలపాలి. దీన్ని బాగా వేడి చేయాలి. చేతి వేళ్లను మాత్రమే ఉపయోగిస్తూ ఈ నూనె మాడు నుంచి జుట్టు చివర్ల వరకి అప్లై చేసుకోవాలి. స్కాల్ఫ్ సున్నితంగా మసాజ్ చెయ్యాలి. రాత్రంతా నూనె అలాగే ఉంచి మరుసటి రోజు ఉదయం తలస్నానం చేస్తే చక్కని ఫలితం పొందుతారు.


☀ తలస్నానం చేసేందుకు బాగా మరిగిన నీటిని ఉపయోగించొద్దు. గోరువెచ్చని నీటితో ప్రారంభించి చన్నీటితో ముగించాలి. వెంట్రుకలు ఆరబెట్టడానికి టవల్ ని కొద్ది సేపు తలకి చుట్టి ఉంచుకోవాలి. ఇలా చేయడం వల్ల జుట్టు అదనపు తేమని గ్రహించగలుగుతుంది.


పొడి జుట్టు పోగొట్టుకునేందుకు ఇంటి చిట్కాలు


☀ షాంపూకి 15 నిమిషాల ముందు పెరుగు లేదా గుడ్డుని జుట్టుపై అప్లై చెయ్యాలి. ఇలా చేస్తే జుట్టు తేమగా ఉంటుంది.


☀ రెండు టీ స్పూన్ల స్వచ్చమైన గ్లిజరిన్, ఒక టేబుల్ స్పూన్ నువ్వుల నూనె, గుడ్డులోని పచ్చ సొన తీసుకుని ఆ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. వీటిని బాగా మిక్స్ చేసి తలకి, జుట్టుకి అప్లై చెయ్యాలి. జుట్టు చివర్ల వరకి దాన్ని రాయాలి. ఒక గంట పాటు తలకి ప్లాస్టిక్ కవర్ వేసి కప్పి ఉంచాలి.


☀ మందార పువ్వులు, ఆకులతో కషాయాలని తయారుచేయవచ్చు. మందార పువ్వులు లేదా ఆకులని 10-12 గంటల పాటు వేడి నీటిలో ఉంచాలి. షాంపూ చేసిన తర్వాత ఆ నీటితో జుట్టు కడుక్కోవాలి. ఇటువంటి కషాయాలతో జుట్టు కడగొచ్చు లేదా దుడుతో తలపై అప్లై చేసుకోవచ్చు.


☀ క్రీమ్ హెయిర్ కండిషన్ లో కొంచెం నీరు కలిపి దాని స్ప్రే బాటిల్లో ఉంచుకోవాలి. అప్పుడప్పుడు దాన్ని జుట్టు మీద స్ప్రే చేసుకోవచ్చు.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.


Also Read: బ్రేక్ ఫాస్ట్ గా అరటి పండు తీసుకుంటున్నారా? అలా చేస్తే ఆరోగ్యానికి హానికరం