Modi No Comments On Jagan : ప్రధానమంత్రి నరేంద్రమోదీ సభను వైఎస్ఆర్‌సీపీ, ఏపీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. పెద్ద ఎత్తున ఖర్చు పెట్టి బహిరంగసభ, ఇతర ఏర్పాట్లను చేశాయి. లక్షల మందిని జనాన్ని సమీకరించడానికి ప్రత్యేకంగా యాప్ కూడా రూపొందించి.. కోఆర్డినేట్ చేసుకున్నారు. ఇంత చేసినా ప్రధానమంత్రి నోట కనీసం చిన్న ప్రశంస కూడా రాలేదు. ఏపీ ప్రభుత్వాన్ని కూడా అభినందించలేదు. అసలు జగన్ లేదా ఏపీ సర్కార్ అనే ప్రస్తావన తీసుకు రాలేదు. దీంతో వైఎస్ఆర్‌సీపీ నేతల్లో నిరాశే కనిపిస్తోంది.
జగన్ విజ్ఞప్తులపై కనీసం స్పందించని ప్రధాని మోదీ !
ప్రధాని మోదీ కంటే ముందే బహిరంగసభలో మాట్లాడిన సీఎం జగన్.. ఆయనను పొగడ్తలతో ముంచెత్తారు. అభివద్ధి రథసారధి అన్నారు. అదే సమయంలో ఏపీ చాలా కష్టాల్లో ఉందని.. నిలదొక్కుకునే ప్రయత్నంలో ఉందని.. కేంద్రం ఇచ్చే ప్రతి రూపాయిని అభివృద్దికే వాడతామన్నారు. రైల్వేజోన్, పోలవరం, ప్రత్యేకహోదా ఇలా అన్ని అంశాలపై సానుకూలత చూపాలని వేడుకున్నారు. తర్వాత మాట్లాడిన ప్రధాని మోదీ అసలు జగన్ ప్రసంగంలో ప్రస్తావించిన ఒక్క అంశాన్నీ పట్టించుకోలేదు. నలభై నిమిషాల పాటు ప్రసంగంలో ఎక్కడా రాష్ట్ర ప్రభుత్వ సమస్యలు.. విజ్ఞప్తులపై మాట్లాడలేదు.
కనీసం మాటవరుసకైనా జగన్ లేదా ప్రభుత్వాన్ని ప్రశంసించని ప్రధాని !
మోదీ ఏపీ పర్యటన ఖరారైన తర్వాత.. ఇంతకు మించిన మంచి చాన్స్ రాదని ఏపీ ప్రభుత్వ పెద్దలు అనుకున్నారు. ఆయనపై తమ అభిమానం ఎలా ఉందో చూపించాడనికి భారీ ఎత్తున సమావేశం ఏర్పాటు చేసి మూడు లక్షల మందిని సమీకరించి మోదీనే ఆశ్చర్యపోయేలా చేయాలనుకున్నారు. విజయసాయిరెడ్డి .. ప్రత్యేకంగా జన సమీకరణ కోసం ఓ యాప్ తయారు చేయించి.. పార్టీ నేతలతో ఇన్ స్టాల్ చేయించి.. జన సమీకరణను ట్రాక్ చేశారు. అనుకున్నట్లుగా జన సమీకరణ చేశారు. ఇంతా చేస్తే.. మోదీ కనీసం.. ఏపీ ప్రభుత్వం గురించి కానీ.. ఏపీ సీఎం గురించి కానీ.. , ఏపీ ప్రభుత్వ పథకాల గురించి కానీ ఒక్క మాట ప్రశంసాపూర్వకంగా మాట్లాడలేదు. అసలు అలాంటి ప్రస్తావనే తీసుకు రాలేదు.
పూర్తిగా తమ పాలన..బీజేపీ నేతల గురించే మాట్లాడిన ప్రధాని !
మోదీ ప్రసంగం మొత్తం పూర్తిగా వన్ సైడ్ సాగిపోయింది. తమ పాలన.. తమ పనులు.. తమ అభివృద్ధి.. తమ నేతల కష్టం గురించి చెప్పుకున్నారు. విశాఖ విషయంలో తమ పార్టీ నేతల కృషిని కూడా గుర్తు చేసుకున్నారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, హరిబాబులకు ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు. వాళ్లు ఎప్పుడు కలిసినా ఏపీ ప్రజల సంక్షేమం, డెవలప్‌మెంట్ గురించి చర్చించేవాళ్లమని చెప్పారు. అంతే కానీ.. ఇంత పెద్ద సభ ఏర్పాటు చేసిన జగన్ కు కృతజ్ఞతలు అని చెప్పలేదు. ప్రజాధనంతో పాటు పార్టీ క్యాడర్‌తోనూ కోట్లు ఖర్చు పెట్టించిన విజయసాయిరెడ్డికి అసలు వేదికపై చోటు దక్కలేదు. మోదీనే కాదు.. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా రాష్ట్ర ప్రభుత్వం గురించి ప్రస్తావించలేదు. ఏపీలో అభివృద్ధి జరుగుతోందని చెప్పలేదు. మోదీ ప్రసంగంలో అసలు జగన్ మాట కానీ.. ఏపీ ప్రభుత్వం ప్రస్తావన కూడా రాలేదు.
కనీస ప్రశంస అయినా వస్తుందని ఊహించి భంగపడిన వైఎస్ఆర్‌సీపీ పెద్దలు!
ఇలాంటి బహిరంగసభ ఏర్పాటు చేస్తే.. ప్రసంగం ప్రారంభంలోనో.. మధ్యలోనే చివరిలోనే కనీసం మోదీ అభినందన పూర్వకంగా కృతజ్ఞతలు చెబుతారేమో అనుకున్నారు. చివరికి అలాంటిది కూడా లేదు. ఆయన ప్రశంస కూడా ఇవ్వలేదంటే.. మనసులో ఏముందోనని వైఎస్ఆర్‌సీపీనేతలు చర్చలు ప్రారంభించారు. మోదీ పర్యటనతో ఖర్చు మిగిలింది కానీ కనీస ప్రయోజనం దక్కలేదని వారు అంచనాకు వచ్చారు.