India's Most Beautiful Snowfall Destinations : చలికాలం వచ్చేసింది. తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత విపరీతంగా ఉంది. ఈ సమయంలో ట్రిప్​కి వెళ్లాలని.. మొదటి స్నో చూడాలనే కోరిక చాలామందికి ఉంటుంది. ఈ సమయంలో ఉత్తర శిఖరాలు వాటి తొలి మంచు కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. మీరు కూడా ఫస్ట్ స్నో చూడాలనుకుంటున్నారా? అయితే మీరు కొరియా, స్విట్జర్లాండ్ వంటి ప్రాంతాలకు వెళ్లనవసరం లేదు. ఇండియాలోనే స్నో కురిసే ప్రదేశాలు ఉన్నాయి. అక్కడికి వెళ్తే మీరు స్నో ఎక్స్​పీరయన్స్ చేయడంతో పాటు.. మంచుతో కప్పబడిన అందమైన పట్టణాలు, కొండలు, సీనిక్ ప్రదేశాలు చూడవచ్చు. అవేంటో చూసేద్దాం.

Continues below advertisement

గుల్మార్గ్, జమ్మూ & కాశ్మీర్

(చిత్రం సోర్స్: కాన్వా)

భారతదేశంలో మంచు కురిసే ప్రదేశాలలో గుల్మార్గ్ ఒకటి. ఇక్కడ నవంబర్ చివరి నాటికి మంచు కురిసి.. స్నో ఇష్టపడేవారికి స్వర్గంగా కనిపిస్తుంది. సీజన్ పెరిగే కొద్ది.. ఇక్కడి మైదానాలు, పైన్ ఫారెస్ట్, పర్వతాలు.. పోస్ట్ కార్డ్-పర్ఫెక్ట్ ఫ్రేమ్‌గా మారతాయి. ప్రపంచ స్థాయి స్కీ వాలులు, ఐకానిక్ గుల్మార్గ్ గోండోలా ఉంటాయి. అంతేకాకుండా ఆసియాలోనే ఎత్తైన కేబుల్ కారుకు నిలయంగా ఈ పట్టణం ఉంది.

మనాలి, రోహ్‌తంగ్ పాస్, హిమాచల్ ప్రదేశ్

(చిత్రం సోర్స్: కాన్వా)

డిసెంబర్ రాగానే మంచుతో కప్పబడే శిఖరాల్లో మనాలి ఒకటి. శీతాకాలపు స్పర్శను, అనుభూతిని ఇది ఇస్తుంది. ఈ ప్రదేశానికి కొద్ది దూరంలో ఉన్న రోహ్‌తంగ్ పాస్‌కు చాలా ముందుగానే, తరచుగా భారీగా మంచు కురుస్తుంది. ఈ ప్రాంతం మొత్తం విశాలమైన మంచుతో నిండిపోయి ఉంటుంది. భారీ మంచు కారణంగా పాస్ తాత్కాలికంగా మూసివేసినప్పటికీ.. సోలాంగ్ వ్యాలీ సాహస క్రీడలు, అద్భుతమైన శీతాకాలపు ప్రకృతి దృశ్యాలు ఇక్కడ పర్యాటకులను ఆకట్టుకుంటాయి.

Continues below advertisement

డల్హౌసీ, ఖజ్జియార్.. హిమాచల్ ప్రదేశ్

(చిత్రం సోర్స్: x/ రాజేందర్_షిమ్లా)

డల్హౌసీలో మొదటి మంచు కురిసిన వెంటనే మీరు మంత్రముగ్ధులవుతారు. అక్కడి చర్చ్​లు, వాలులు, దేవదారు అడవులు శీతాకాలపు లేత కాంతిలో మెరుస్తాయి. సమీపంలోనే ఉన్న ఖజ్జియార్​ను 'మినీ స్విట్జర్లాండ్' అని పిలుస్తారు. ఇది తెల్లగా కప్పబడి చూసేందుకు చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. మంచుతో నిండిపోయిన ఈ ప్రదేశం చూసేందుకు ప్రశాంతంగా, సుందరంగా, ఓదార్పునిచ్చే విధంగా పర్యాటకులకు ప్రశాంతమైన శీతాకాలపు విడిదిని అందిస్తుంది.

ఔలి, ఉత్తరాఖండ్

(చిత్రం సోర్స్: కాన్వా)

ఔలి అనేది అద్భుతమైన స్కీ వాలులు, అద్భుతమైన హిమాలయ దృశ్యాలకు ప్రసిద్ధి చెందిన శీతాకాలపు డ్రీమ్ ప్లేస్​గా చెప్పవచ్చు. మంచు రాగానే గర్హ్వాల్ పర్వతాలు తాజా, మృదువైన తెల్లటి పొరల కింద మెరుస్తాయి. పొడవైన రోప్‌వే ప్రయాణం మరింత అద్భుతంగా ఉంటుంది. మంచుతో కప్పిన శిఖరాలు, అడవులను చూసేందుకు రెండు కళ్లు చాలవు. స్కీయర్లు, ట్రెక్కింగ్ చేసేవారు, ప్రకృతి ప్రేమికులకు అనువైన ప్రదేశం ఔలి. ఇక్కడ శీతాకాలం స్వచ్ఛంగా, రిఫ్రెష్‌గా ఉంటుంది.

షిమ్లా, కుఫ్రీ.. హిమాచల్ ప్రదేశ్

(చిత్రం సోర్స్: కాన్వా)

భారతదేశంలోని ప్రసిద్ధ కొండ పట్టణాలలో ఒకటైన షిమ్లా.. శీతాకాలంలో అందంగా మారుతుంది. దానిలో లేన్‌లు, పైన్ ట్రీలు మంచులో మెరుస్తూ కనిపిస్తాయి. కొద్ది దూరంలో ఉన్న కుఫ్రీలో కొంచెం ముందుగానే మొదటి మంచు కురుస్తుంది. ఇది జంటలకు, కుటుంబాలకు అనువైన ప్రదేశంగా చెప్తారు. 

మీకు కూడా డీప్ వింటర్​లో ట్రిప్​కి వెళ్లాలని లేదా మొదటి స్నోని ఎక్స్​పీరియన్స్ చేయాలనుకుంటే ఈ ప్రదేశాలకు ఫ్యామిలీ లేదా ఫ్రెండ్స్​తో కలిసి వెళ్లిపోవచ్చు. మంచి ఎక్స్​పీరియన్స్​ మీ సొంతమవుతుంది.