Simple Home Exercises to Stay Fit and Youthful : నేటి ఆధునిక యుగంలో ప్రతి ఒక్కరూ.. తమ వయస్సు కంటే చిన్నగా కనిపించాలని కోరుకుంటున్నారు. నిజం చెప్పాలంటే రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదిస్తూ.. వ్యాయామం చేయకుండా.. అందంగా కనిపించాలనుకుంటారు. ఈ కోరికను క్యాష్ చేసుకుంటూ.. ప్రపంచవ్యాప్తంగా యాంటీ-ఏజింగ్ క్రీములు, లోషన్లు మార్కెట్ చేస్తున్నారు. అయితే క్రీములు చేసే మాయకంటే.. వ్యాయామం మంచి ఫలితాలు ఇస్తుందని.. రక్తనాళాల శస్త్రచికిత్స నిపుణులు (Vascular Surgeon) డాక్టర్ సుమిత్ కపాడియా చెప్తున్నారు.
శరీరంలో శక్తి తగ్గడం, అలసట, కీళ్లలో లేదా కండరాలలో నొప్పి లేదా బిగుతు (stiffness) వంటి సమస్యలు ఎక్కువగా వస్తుంటాని తెలిపారు డాక్టర్ కపాడియా. ఈ సమస్యలన్నింటికీ సమాధానం కేవలం 20 నిమిషాలలో ఇంట్లోనే చేయగలిగే ఆరు యాంటీ-ఏజింగ్ వ్యాయామాలు అని తెలిపారు. ఈ వ్యాయామాలు మీ గుండె, శ్వాసకోశ ఆరోగ్యాన్ని (cardiorespiratory health) మెరుగుపరచడమే కాకుండా.. రక్త ప్రసరణను పెంచి.. కీళ్ల ఒత్తిడిని, బిగుతును తగ్గిస్తాయని చెప్తున్నారు.
వృద్ధాప్య ఛాయలను దూరం చేసి.. స్కిన్ మెరిసేలా చేస్తాయంటున్నారు. దానికోసం చేయాల్సిన 6 వ్యాయామాలు సూచిస్తున్నారు. వ్యాయమం చేసే ముందు కచ్చితంగా వార్మ్-అప్ చేయాలి. అలాగే అద్భుతాలు చేసే 6 యాంటీ-ఏజింగ్ వ్యాయామాలు ఏంటో.. వాటివల్ల కలిగే బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం.
స్క్వాట్స్ (Squats)
సాధారణంగా స్క్వాట్స్ మోకాళ్ళకు హానికరం అని అనుకుంటారు. కానీ వాస్తవానికి ఇది రివర్స్. స్క్వాట్స్ మీ తుంటి కండరాలు, కాలు కండరాలు, ముఖ్యంగా మీ కోర్ (core) ప్రాంతంలో బలం, శక్తి, సమతుల్యత (balance), సమన్వయాన్ని (coordination) పెంచుతుంది.
లంజెస్ (Lunges)
లంజెస్ అనేది దిగువ శరీరానికి (lower body) మరో అద్భుతమైన కాంప్లెక్స్ కదలిక. ఇది కాలు కండరాలలో బలం, కండరాల సమన్వయం, సమతుల్యతను పెంపొందిస్తుంది. ప్రతి కాలుతో 10 రెప్స్ చొప్పున రెండు సెట్లు చేయాలి.
స్టెప్-అప్స్ (Step-ups)
స్టెప్-అప్స్ కోసం మెట్లు (staircase) లేదా ఒక బాక్స్ ఉపయోగించవచ్చు.ఇది స్థిరత్వం, సమన్వయం, సమతుల్యతను మెరుగుపరచడానికి అద్భుతమైన మార్గం. ఈ వ్యాయామం చేస్తున్నప్పుడు వీపు ముందుకు లేదా వెనుకకు వంగకుండా చూసుకోవాలి.
పుష్-అప్స్ (Push-ups)
పుష్-అప్స్ అనేది ఎగువ శరీరానికి (upper body) సంబంధించిన వ్యాయామం. ఇది భుజాలు (shoulder), ఛాతీ (chest), ట్రైసెప్స్ (triceps) కండరాలకు బలాన్ని ఇస్తుంది. ఇది కోర్ బలాన్ని కూడా పెంచుతుంది.
ప్లాంక్ (Plank)
ప్లాంక్ చాలా సులభమైనది. కానీ కోర్ (core) బలానికి అత్యంత ప్రభావవంతమైన వ్యాయామం. మొదట్లో 20 సెకన్ల పాటు ప్లాంక్‌ను చేయడానికి ప్రయత్నించాలి. ఆ తర్వాత నెమ్మదిగా సమయాన్ని పెంచుకోవాలి.
గ్లూట్ బ్రిడ్జెస్ (Glute Bridges)
వయస్సు పెరిగే కొద్దీ బలహీనపడే కండరాలలో గ్లూటియల్ కండరాలు (తుంటి కండరాలు) ముఖ్యమైనవి. ఈ కండరాలు బలహీనపడటం తరచుగా వెన్ను సమస్యలకు దారితీస్తుంది. గ్లూట్ బ్రిడ్జెస్ ఈ కండరాలను అలాగే హామ్‌స్ట్రింగ్, దిగువ వీపు (lower back) కండరాలను బలోపేతం చేయడానికి సహాయపడతాయి.
ఈ వ్యాయామాలను పూర్తి చేసిన తర్వాత.. కండరాలు, శరీర ఉష్ణోగ్రత, రక్తపోటు, హృదయ స్పందన రేటును సాధారణ స్థితికి తీసుకురావడానికి కూల్-డౌన్ (Cool-down) తప్పనిసరిగా చేయాలి. క్వాడ్రిసెప్స్ స్ట్రెచ్, హామ్‌స్ట్రింగ్/గ్లూట్ స్ట్రెచ్ వంటివి చేస్తే బెస్ట్ అని తెలిపారు డాక్టర్ సుమిత్ కపాడియా. ఈ 20 నిమిషాల దినచర్యను అలవాటు చేసుకోవడం ద్వారా.. మీరు కేవలం బయటి నుంచే కాకుండా.. లోపలి నుంచి యవ్వనంగా ఉంటారు.
గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.