Akshaya Tritiya 2025 Gold Purchase : అక్షయ తృతీయ రోజున బంగారం కొనడం ఎప్పటినుంచో ఆనవాయితీగా వస్తుంది. 2025లో అక్షయ తృతీయ ఏప్రిల్ 30వ తేదీన వచ్చింది. ఈ ఏడాదిలో బంగారం ధర లక్ష మార్క్‌ను తాకింది. బంగారం ధర పెరిగినా కూడా.. అక్షయ తృతీయ సందర్భంగా దానిని కాస్తో.. కూస్తో కొనేవారు ఉంటారు. మీరు కూడా వారిలో ఒకరా? అయితే బంగారం కొనేముందు కొన్ని విషయాలు కచ్చితంగా గుర్తించుకోవాలి. దీనివల్ల మీరు ఎలాంటి నష్టం లేకుండా గోల్డ్ కొనగలుగుతారు.
అక్షయ తృతీయ రోజు బంగారం కొనడం శుభప్రదంగా భావిస్తారు. కాబట్టి గోల్డ్ కొనేప్పుడు కాస్త తెలివిని ఉపయోగిస్తే ఖర్చు వృథా కాకుండా ఉంటుంది. అందుకే బంగారం కొంటున్నప్పుడు కొన్ని విషయాలు గుర్తించాలి. కొన్ని తప్పులు అస్సలు చేయకూడదు. అసలు ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఏంటో.. గుర్తించుకోవాల్సిన అంశాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం.
బంగారం కొనేప్పుడు గుర్తించుకోవాల్సిన విషయాలు..
మీరు గోల్డ్ కొనేప్పుడు దానిపై BIS హాల్‌మార్క్ ఉందో లేదో కచ్చితంగా చెక్ చేసుకోవాలి. ఇది బంగారం శుద్ధతకు ప్రభుత్వం ఇచ్చే ధ్రువీకరణ. కాబట్టి BIS హాల్‌మార్క్ చూసుకోవాలి. ఈ హాల్‌మార్క్‌లో మీరు తీసుకునే ఆభరణంపై 6 అక్షరాల కోడ్, ప్యూరిటీ, BIS లోగో ఉంటాయి.
ఎలాంటి గోల్డ్ కొంటున్నారో చూసుకోవాలి..
మీరు ఏ క్యారెట్ బంగారం కొంటున్నారో అవగాహన ఉండాలి. దానిని బట్టి మార్కెట్లో ఆ రోజు ప్రైజ్‌ని లెక్కవేసుకోవాలి. చాలామంది ఈ విషయం తెలీక.. క్యారెట్ తగ్గినా.. మార్కెట్ ప్రైజ్ ఇది అంటూ చెప్తే కొనేసుకుంటారు. కాబట్టి క్యారెట్, ప్యూరిటీపై అవగాహన ఉండాలి.
మీరు 24 క్యారెట్ల బంగారం తీసుకుంటున్నారంటే అది 100 శాతం పూర్తి బంగారమని అర్థం. ఇది కాయిన్స్, బార్ల రూపంలో అందుబాటులో ఉంటుంది. అలాగే ఆభరణాలకు 22 క్యారెట్ల బంగారం అనుకూలమైనది కాబట్టి దానినే ఉపయోగిస్తారు. 18 లేదా 14 క్యారెట్ల బంగారాన్ని డిజైనర్ జ్యూవెలరీ కోసం, రత్నాల ఆభరణాల కోసం ఉపయోగిస్తారు.
మేకింగ్ ఛార్జీలు చూసుకోవాలి..
మేకింగ్ ఛార్జీలు ఒక్కో షాప్‌లో ఒక్కోలా ఉంటాయి. 8 శాతం నుంచి 25 శాతం వరకు షాప్‌ని బట్టి, ఆభరణం బట్టి ఇవి మారుతూ ఉంటాయి. అయితే మీరు ఫిక్స్డ్ మేకింగ్ ఛార్జ్ ఉండే వాటిని ఎంచుకుంటే మంచిది.
బిల్లో అవి ఉండాల్సిందే..
గోల్డ్ కొనుకున్న తర్వాత డిటైల్డ్ బిల్ అడిగి తీసుకోండి. దానిలో బంగారం బరువు, ప్యూరిటీ, మేకింగ్ ఛార్జ్, జీఎస్టీ అంశాలు కచ్చితంగా ఉండేలా చూసుకోండి. హాల్ మార్క్ వివరాలు కూడా ఉండాలి. మీరు బంగారం అమ్మాలనుకున్నప్పుడు, ఎక్స్ఛేంజ్ చేయాలనుకున్నప్పుడు హెల్ప్ అవుతుంది.
చేయకూడని తప్పులివే..
స్టోన్ జ్యూవెలరీ తీసుకుంటే.. స్టోన్ బరువు తీసేసి గోల్డ్ బరువు, స్టోన్స్‌కి సపరేట్గా బిల్ వేయించుకోవాలని గుర్తించుకోండి. సర్టిఫికేషన్ లేని బంగారం కొనవద్దు. తక్కవ ధరకు వచ్చినా మోసపోయే ప్రమాదం ఉంది. రిటర్న్ పాలసీలు కచ్చితంగా చదవండి. ఆన్లైన్లో అస్సలు గోల్డ్ కొనవద్దు. బరువు ఎక్కువగా ఉంటే విలువ ఎక్కువ అనుకోకూడదు. డిజైన్, ప్యూరిటీ, స్టోన్స్‌ను కూడా కన్సిడర్ చేయాలి. ఇవన్నీ మీకు మంచి గోల్డ్‌ని కొనేందుకు హెల్ప్ అవుతాయి.