Tata Altroz Facelift Version Features: మన దేశంలో టాటా కార్లకు ప్రత్యేకమైన ఫ్యాన్‌ బేస్‌ ఉంది. టాటా మోటార్స్, తన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కారు ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను మరో నెల రోజుల్లో లాంచ్‌ చేయబోతోంది. మొదటిసారి, 2020లో లాంచ్ అయిన ఆల్ట్రోజ్‌కి ఇదే మొదటి ప్రధాన అప్‌డేట్. ఆటో సైట్‌లు అందిస్తున్న సమాచారం ప్రకారం, టాటా ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ 22 మే 2025న మార్కెట్లోకి రావచ్చు. ఈ కొత్త మోడల్‌ హ్యుందాయ్ i20, మారుతి బాలెనో & టయోటా గ్లాంజా వంటి స్పెసిఫిక్‌ సెగ్మెంట్‌ కార్లకు పోటీ ఇస్తుంది.

డిజైన్‌లో మార్పు 

టాటా ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ టెస్టింగ్‌ సమయంలో బయటకు వచ్చిన సీక్రెట్‌ ఫొటోలను బట్టి చూస్తే, ఈ కారు ప్రస్తుత వెర్షన్‌ కంటే షార్ప్‌ & అడ్వాన్స్‌డ్‌ లుక్‌తో లైన్‌లోకి వస్తుందని అర్ధం చేసుకోవచ్చు. న్యూ ఆల్ట్రోజ్‌లో కొత్త షార్ప్ ఫ్రంట్ బంపర్, డ్యూయల్-పాడ్ స్లీక్ LED హెడ్‌ ల్యాంప్‌లు & రీపొజిషన్డ్‌ LED ఫాగ్ ల్యాంప్‌లు కనువిందు చేయవచ్చు. కారు వెనుక భాగంలో అప్‌డేటెడ్‌ LED టెయిల్ లైట్లు, న్యూ రియర్‌ బంపర్ & స్టైలిష్ అల్లాయ్ వీల్స్ ఉండవచ్చని మార్కెట్‌ ఎక్స్‌పర్ట్స్‌ భావిస్తున్నారు. ఈ మార్పులన్నింటి కారణంగా కొత్త ఆల్ట్రోజ్ ఎక్స్‌టీరియర్‌ ఇప్పటి వెర్షన్‌ కంటే మరింత స్టైల్‌, ప్రీమియం & స్పోర్టీ లుక్‌తో లాంచ్‌ కావచ్చు.          

ఫుల్‌ ఖుషీ చేసేలా ఫీచర్ల అప్‌గ్రేడేషన్‌

కొత్త ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్‌లో బెస్ట్‌ అనిపించే లేటెస్ట్‌ ఫీచర్లు అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. ఈ కారులో 10.25-అంగుళాల టచ్‌ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 360 డిగ్రీల కెమెరా సపోర్ట్ & స్టాండర్డ్ 6 ఎయిర్‌ బ్యాగ్‌లను ఏర్పాటు చేయవచ్చు. అంతేకాదు.. లేన్ డిపార్చర్ వార్నింగ్ & ISOFIX చైల్డ్-సీట్ యాంకర్ వంటి ఫీచర్లను కూడా అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) కింద జోడించవచ్చు. కొత్త అప్‌హోల్‌స్టెరీ & రిఫ్రెష్ చేసిన డ్యాష్‌బోర్డ్ డిజైన్ కార్‌ క్యాబిన్‌ను మరింత ప్రీమియం లుక్‌లోకి మార్చాయి. ఈ ఫీచర్లన్నీ కలిసి ఫేస్‌లిఫ్ట్‌ వెర్షన్‌ను ప్రస్తుత మోడల్‌ కంటే సేఫ్టీగా & లగ్జరీగా తయారు చేయవచ్చు.          

ఇంజిన్‌ & ట్రాన్స్‌మిషన్‌లో ఎటువంటి మార్పులు ఉండవు

ఇది ఫేస్‌లిఫ్ట్‌ వెర్షన్‌ కాబట్టి, డిజైన్ & ఫీచర్లలో ప్రధాన అప్‌డేట్స్‌ ఉన్నప్పటికీ ఇంజిన్ సామర్థ్యంలో ఎటువంటి మార్పులు ఉండవు. ప్రస్తుత వెర్షన్‌లో ఉన్నట్లుగానే, ఫేస్‌లిఫ్ట్‌ వెర్షన్‌లో 1.2 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్, 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్, 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ & 1.2 లీటర్ CNG ఇంజిన్‌ ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. ట్రాన్స్‌మిషన్‌ ఆప్షన్లలో కూడా ఎటువంటి మార్పు ఉండదు & ప్రస్తుత వెర్షన్‌లో ఉన్న 5-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ మాన్యువల్ & 6-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ ఎంపికలనే కొత్త వెర్షన్‌లోనూ చూడవచ్చు.