ఆ ముగ్గురు అక్కాచెల్లెళ్లు ట్రిప్లెట్స్. నిమిషల తేడాతో ఒకేసారి జన్మించారు. అందుకే పేర్లు కూడా నటాషా, నటాలీ, నడెగే అని పెట్టారు పేర్లు. చిన్నప్పట్నించి ఒకేలాంటి బొమ్మలు, డ్రెస్సులు, పుస్తకాలు వాడేవారు. చివరికి హెయిర్ స్టైల్ కూడా ఒకేలా ఉండేలా జాగ్రత్త పడేవారు. అలాంటివారు పెద్దయ్యాక ఒకే వ్యక్తి ప్రేమలో పడ్డారు. సినిమాటిక్ స్థాయిలో వీరి ప్రేమకథలో ఎన్నో మలుపులు కూడా ఉన్నాయి. ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్లు నివసించేది కాంగోలో. వీరిలో పెద్దక్క నటాషాకు లువిజో అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. తాను ప్రేమించిన వ్యక్తిని ఇద్దరు చెల్లెళ్లకు పరిచయం చేసింది నటాషా. 


లువిజోతో తరచూ మాట్లాడేవారు నటాలీ, నడెగే కూడా. ఆ క్రమంలో వారిద్దరికీ అతడిపై ప్రేమ పుట్టింది. అదే విషయాన్ని అక్కకి చెప్పారు. మొదట్లో బాధపడినా ఇద్దరు చెల్లెళ్ల మీదున్న ప్రేమతో అంగీకరించింది నటాషా. ముగ్గురూ కలిసి లువిజోకు ప్రేమిస్తున్నట్టు ప్రపోజ్ చేశారు. అంతే కాదు తమ ముగ్గురిని పెళ్లి చేసుకోమని కోరారు. అది వినగానే లువిజో గందరగోళానికి గురయ్యాడు. ముగ్గురు అక్కాచెల్లెళ్లు తాము ఎంతగా అతడిని ప్రేమిస్తున్నారో వివరించారు. దీంతో అతడు ముగ్గురిని పెళ్లి చేసుకునేందుకు అంగీకారించాడు. అతడి తల్లిదండ్రులు మాత్రం ఆ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అలా చేయడం వల్ల అతను భవిష్యత్తులో సమస్యలు ఎదుర్కొంటాడని చెప్పారు. అయినా లువిజో తన మనసు మార్చుకోలేదు. 


పంచుకోవడం మాకు అలవాటే
తల్లిదండ్రులు హాజరవ్వకపోయినా వారి పెళ్లి జరిగి పోయింది. అక్కాచెల్లెళ్లు మాట్లాడుతూ ‘చిన్నప్పట్నించి మాకు ప్రతి వస్తువు పంచుకోవడం అలవాటైపోయింది. భర్తను కూడా మేము సమానం షేర్ చేసుకుంటాం. ఆ విషయంలో గొడవలు పడం. సర్దుకుపోవడం మాకు చిన్నప్పట్నించి అలవాటైంది’ అని చెప్పుకొచ్చారు ఆ అక్కాచెల్లెళ్లు. చుట్టుపక్కల వారు, బంధువులు మాత్రం ఒక భర్తతో, ముగ్గురు భార్యలు సర్దుకుపోవడం చాలా కష్టం, గొడవలు తప్పవని అంటున్నారు. భవిష్యత్తులో వీరి కాపురం ఎలా ఉండబోతోందో చూడాలి. 




Also read: పిల్లల ఎత్తు పెరగడం ఏ వయసులో ఆగిపోతుందో తెలుసా? వారి ఎత్తు పెంచేందుకు కొన్ని చిట్కాలు ఇవిగో...


Also read: ఊబకాయం ఓ మహమ్మారి, ఏటా ఎంత మందిని చంపేస్తోందో తెలుసా?