వేసవికాలం కావచ్చు, శీతాకాలం కావచ్చు... ఏ కాలమైనా రోజు తెల్లారేది కప్పు టీ తోనే. ఎంతోమంది టీకి బానిసలు అయిపోయారు. భారత దేశంలో ప్రధాన పానీయం తేనీరే. ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి తాగకుంటే ఏ పనీ చేయలేని వారు ఎంతోమంది. ఇంట్లో టీ తయారు చేసేటప్పుడు ప్రక్రియ కాస్త పెద్దగానే ఉంటుంది. నీళ్లను మరగబెట్టి అందులో టీ పొడి, పాలు వేసి దాన్ని బాగా మరగ కాచి, చక్కెర వేసి వడకట్టుకొని తాగాలి. ఇదంతా చేయడానికి ఐదు నుంచి పది నిమిషాలు పడుతుంది. అదే టీ బ్యాగ్ ఉంటే వేడి నీళ్లలో ఆ టీ బ్యాగ్ వేసుకొని చక్కెర కలుపుకుంటే సరి. రెండు నిమిషాల్లో టీ రెడీ అయిపోతుంది. అందుకే టీ బ్యాగులు అంత ప్రాచుర్యాన్ని పొందాయి. అయితే ఎప్పుడైనా ఆలోచించారా? ఈ టీ బ్యాగులను ఎవరు? ఎప్పుడు? తయారు చేశారు అని.


టీ బ్యాగులు వాడకం మొదలైంది 1900 సంవత్సరం ప్రారంభంలో. వాటిని అదే సంవత్సరం న్యూయార్క్ నగరంలో కనుగొన్నారు. థామస్ సుల్లివన్ అనే వ్యక్తి ఒక టీ వ్యాపారి కొడుకు. అతను తన తండ్రి వారసత్వంగా వచ్చిన వ్యాపారాన్ని విస్తరించాలని అనుకున్నాడు. తన టీ ఎంత రుచికరంగా ఉంటుందో, ఆ నమూనాలను అందరికీ పంపించాలని అనుకున్నాడు. అప్పట్లో టీ చాలా విలాసవంతమైన వస్తువు. ఎక్కువ డబ్బులకే అమ్మేవారు. కాబట్టి నమూనాలు పంపించేటప్పుడు, అది కూడా ఉచితంగా పంపించేటప్పుడు తక్కువ పరిమాణంలోని పంపించాలి. లేకుంటే వీరికి నష్టం వస్తుంది. 


ఖర్చును తగ్గించేందుకే..
కాబట్టి థామస్ ఖర్చును తగ్గించడానికి ఒక ప్లాన్ వేశాడు. ఒకరికి మాత్రమే సరిపోయేటట్టు కొంచెం టీ పొడిని చిన్న పట్టు పౌచుల్లో వేసి, ప్యాక్ చేసి వినియోగదారులకు పంపించాడు. ఆ పౌచులను అందుకున్న వినియోగదారులు వాటిని ఎలా వాడాలో తెలియక అయోమయంలో పడ్డారు. కప్పు వేడి నీటిలో ఆ పౌచ్ ని వేశారు. ఆశ్చర్యకరంగా చక్కగా టీ తయారైపోయింది. దీంతో ఆయనకు మరిన్ని అలాంటి టీ పౌచులు కావాలంటూ ఆర్డర్లు వచ్చాయి. దీంతో థామస్ తొలిసారిగా టీ బ్యాగులను విక్రయించడం ప్రారంభించాడు. అది అతి పెద్ద వ్యాపారంగా మారిపోయింది. కనిపెట్టిన వ్యక్ థామస్ అయినప్పటికీ  ఆ ఉత్పత్తికి పేటెంట్ మాత్రం పొందలేకపోయాడు. కాలక్రమంగా టీ బ్యాగులు చాలా ముఖ్యమైన వాటిగా మారిపోయాయి. అంతేకాదు వాటికి వాడే ఫ్యాబ్రికులు కూడా మారుతూ వచ్చాయి. ప్రస్తుతం పలుచని కాగితాన్ని టీ బ్యాగులకు ఉపయోగిస్తున్నారు.  టీ బ్యాగులపై పేటెంట్ ఇద్దరు మహిళలు పొందారు. కష్టపడిన థామస్ మాత్రం చరిత్రలో మిగిలి పోయాడు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో టీ సంస్థలు పుట్టుకొచ్చాయి. టీ బ్యాగులను విస్తారంగా అమ్ముతున్నాయి. ముఖ్యంగా ఆఫీసుల్లో టీ బ్యాగుల వాడకం సులువుగా ఉండడంతో వీటికి మార్కెట్ పెరిగింది. గ్రీన్ టీ, అల్లం టీ, మసాలా టీ, అస్సాం టీ ఇలా రకరకాల టీ బ్యాగులు దొరుకుతున్నాయి.


Also read: టమోటో కెచప్ ఇంట్లోనే తాజాగా తయారు చేసుకోండి, ఎలాంటి ప్రిజర్వేటివ్స్ అవసరం లేదు