శ్రీశైల మల్లన్న హుండీ ఆదాయం రూ.3 కోట్ల 57 లక్షల 81 వేల 068 నగదు 
     
శ్రీశైల శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల ఉభయ, పరివార దేవాలయాల హుండీ లెక్కింపు నిర్వహించారు. ఆలయంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో హుండీ లెక్కింపు నిర్వహించగా ఈ లెక్కింపు ద్వారా శ్రీశైల మల్లన్న దేవస్థానానికి 3 కోట్ల 57 లక్షల 81 వేల 068 రూపాయల నగదు రాబడి లభించగా ఈ ఆదాయాన్ని గత 28 రోజులులో శ్రీ స్వామి అమ్మవార్లకు భక్తులు నగదు రూపంలో సమర్పించినట్టు ఆలయ అధికారులు తెలిపారు. ఈ హుండి లెక్కింపులో నగదుతో పాటు 103 గ్రాముల 200 మిల్లీ గ్రాముల బంగారు, 7 కేజీల 520 గ్రాముల వెండి లభించాయి. పైవాటితో పాటు యుఎస్ఏ డాలర్లు 243, యుఏఈ దిర్హమ్స్ 220, సింగపూర్ డాలర్లు 61, ఆస్ట్రేలియా డాలర్లు 175, కెనడా డాలర్లు 20, యూరోలు 150, ఇంగ్లాండ్ ఫౌండ్స్ 25 మొదలైన విదేశీ కరెన్సీ కూడా ఈ హుండీల లెక్కింపులో లభించాయి. పటిష్టమైన నిఘా నేత్రాల మధ్య దేవస్థానం ఈవో లవన్న పర్యవేక్షణలో హుండీ లెక్కింపు జరిగింది. ఈ లెక్కింపులో దేవస్థానం అన్ని విభాగాలకు అధికారులు, సిబ్బంది, శివసేవకులు పాల్గొన్నారు


శ్రీశైలంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు సదస్యం, నాగవల్లి, ధ్వజావరోహణం
శ్రీశైల మహాక్షేత్రంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీ స్వామి అమ్మవార్ల నిత్యకల్యాణ మండపంలో సదస్యం, నాగవల్లి, ఆస్థానం కార్యక్రమం నిర్వహించారు. సదస్యం కార్యక్రమంలో వేదపండితులచే వేదస్వస్తి, నిర్వహించి నాగవల్లి కార్యక్రమంలో సంక్రాంతి పర్వదినం రోజున కల్యాణోత్సవం జరిపించబడిన అమ్మవారికి ఆగమశాస్త్రం సంప్రదాయం ప్రకారం మెట్టెలు, నల్లపూసలను సమర్పించారు. అనంతరం బ్రహ్మోత్సవాలలో భాగంగా ధ్వజావరోహణ నిర్వహించారు.


ఈ ధ్వజావరోహణ కార్యక్రమంలో ఉత్సవాల మొదటిరోజున మకర సంక్రాంతి బ్రహ్మోత్సవ ప్రారంభ సూచకంగా బ్రహ్మోత్సవాలకు సకల దేవతలకు ఆహ్వానం పలుకుతూ ఆలయ ధ్వజస్తంభంపై ఆవిష్కరింపజేసిన ధ్వజపటం అవరోహణ చేసిన దేవస్థానం ఈవో ఎస్.లవన్న అర్చకులు, అధికారులు ధ్వజపటాన్ని కిందకు దించారు. మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు రేపు జరిగే అశ్వవాహనం పుష్పోత్సవం, శయణోత్సవం, శ్రీస్వామి అమ్మవారి ఏకాంతసేవతో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.


బ్రహ్మోత్సవ కల్యాణానికి చెంచు గిరిజనులు వస్త్రాలు సమర్పణ   
మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ( Srisailam Temple Pongal 2023 Celebrations ) భాగంగా పార్వతి మల్లికార్జునస్వామి దేవస్థానం తరుపున బ్రహ్మోత్సవ లీలాకళ్యాణం ఘనంగా నిర్వహించింది. ఈ కల్యాణానికి చెంచు గిరిజనులను ప్రత్యేకంగా ఆహ్వానించిన దేవస్థానం ఈవో లవన్న స్వామి అమ్మవారి కల్యాణానికి వస్త్రాలు సమర్పించిన చెంచు గిరిజనులు ఐటీడీఏ పిఓ.రవీంద్రారెడ్డి వెదురు బియ్యం, ఆకులతో అల్లిన బాసికలు, యజ్ఞోపవితం స్వామి అమ్మవారి బ్రహ్మోత్సవ కళ్యాణానికి గిరిజనులు సమర్పించారు. చెంచు గిరిజనులు పార్వతిదేవిని తమ ఆడపడుచుగా భావించి ఆనవాయితీగా గత సంవత్సరం నుండి బ్రహ్మోత్సవ కల్యాణానికి చెంచు గిరిజనులు వస్త్రాలు సమర్పిస్తున్నారు. ఈ కల్యాణానికి విచ్చేసిన చెంచు గిరిజనులకు దేవస్థానం తరుపున వస్త్రాలు అందజేయగా ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పి.ఓ రవీంద్రారెడ్డి,ఆలయ ఈవో లవన్న,అధికారులు,సిబ్బంది భక్తులు పాల్గొన్నారు.