ప్రతి ఒక్కరికి సొంతిల్లు కొనుక్కోవాలని ఆశ ఉంటుంది. పెరుగుతున్న ఇంటి ధరల వల్ల ఎంతో మంది కోరిక నెరవేరడం లేదు. అయితే 100 రూపాయలలోపే ఓ ఇల్లు అమ్మకానికి ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యంత చవకైన ఇల్లు. ఎక్కడ ఉందంటే... అమెరికాలోని మిచిగాన్‌లో. అమెరికన్ రియల్ ఎస్టేట్ కంపెనీ అయినా జిల్లో ఈ ఇంటిని అమ్మకానికి పెట్టింది. వారు ఈ ఇంటి గురించి చెబుతూ... ప్రపంచంలోనే అత్యంత చవకైన ఇల్లుగా దీన్ని వివరించారు. మిచిగాన్‌లోని పోటియాక్ ప్రాంతంలో  ఉంది ఈ ఇల్లు. దీనిలో రెండు బెడ్ రూమ్‌లు, ఒక బాత్రూమ్, ఒక కిచెన్ ఉన్నాయి. దీన్ని చూస్తే అద్భుతమైన కళాఖండంలా అనిపిస్తుంది. ధర మాత్రం కేవలం ఒక డాలరు. అంటే మన రూపాయిల్లో 83 రూపాయిలు అన్నమాట. ఇది చాలా పాత ఇల్లు. 1956లో నిర్మించారు. 724 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ఇల్లు ఉంటుంది.


అమెరికన్ రియల్ ఎస్టేట్ కంపెనీ జిల్లో ఈ ఇంటి గురించి చెబుతూ...  మీరు ఈ ఇంట్లోకి అడుగుపెడితే... చాలా సృజనాత్మకంగా అనిపిస్తుంది. భావోద్వేగానికి గురవుతారు. ఇది ఎంతో పురాతనమైనది. చరిత్రలో మిగిలిపోయేది. పైకప్పు ఎలాంటి లీకేజీ సమస్యలను ఎదుర్కోవడం లేదు. చుట్టూ పచ్చని పరిసరాలతో, ప్రశాంత వాతావరణంలో ఉంది ఈ ఇల్లు అని చెబుతోంది ఈ సంస్థ. దీన్ని గతంలో కూడా అమ్మారు. అప్పుడు 4000 డాలర్లకి విక్రయించారు. కానీ ఇప్పుడు కేవలం ఒక డాలర్‌కి మాత్రమే అమ్మకానికి పెట్టారు. ఈ ఇంటిని ఎందుకంత చవకగా అమ్మకానికి పెట్టారో మాత్రం ఆ రియల్ ఎస్టేట్ సంస్థ వివరించలేదు. ఇప్పటికే ఈ ఇంటిని కొనడం కోసం లక్ష మందికి పైగా ఆసక్తి  చూపించారు. ఇండియా, ఆసియా, యూకే వంటి దేశాల నుంచే ఎంతో మంది దీన్ని కొనేందుకు ముందుకు వస్తున్నారు. ఓ వ్యక్తి 30,000 డాలర్లు ఇచ్చి ఇంటిని కొంటానని చెప్పాడు. ప్రస్తుతం ఈ ఇంటిని ఎవరికీ అమ్మలేదు. 


ఇలాంటి ప్రత్యేకమైన ఇల్లు కొన్ని సార్లు అమ్మకానికి వస్తూ ఉంటాయి. ఓ చిన్నదీవిలో ఉన్న ఒంటరి ఇల్లును గతంలో అమ్మారు. చిన్న దీవిలో ఉన్న ఏకైక ఇల్లు ఇది. అప్పుడప్పుడు కుటుంబంతో జాలీగా గడిపి రావడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇదొక సింగిల్ బెడ్ రూమ్. అమెరికాలోని వోహో బే అనే ప్రాంతంలో ఉంది. నీళ్లు మధ్యలో చెక్కలతో కట్టిన ఇల్లు ఇది. ఆ దీవి కేవలం ఎకరంన్నర ప్రాంతంలో ఉంది. 2009లో ఈ ఇంటిని నిర్మించారు. 540 చదరపు గజాల విస్తీర్ణంలో ఈ ఇల్లు ఉంది. దీని ధర మాత్రం చాలా ఎక్కువ. రెండున్నర కోట్ల రూపాయలకు ఇది అమ్ముడుపోయింది. దీన్ని ఒక బిలియనీర్ ఇష్టంగా కట్టుకున్నాడు. అతనికి జాంబీ ఫోబియా ఉంది. అంటే ఎప్పుడైనా జాంబీలు వస్తే పారిపోయి దాక్కోడానికి ఒక ఇల్లు ఉండాలని ఇలా కట్టుకున్నాడట. కాకపోతే ఇది ఎప్పటికైనా నీటిలో మునిగిపోతుందని అంటారు.


Also read: పుట్టగొడుగుల పండుగ, ఈ వేడుకలో నోరూరించే మష్రూమ్ వంటకాలను రుచి చూడొచ్చు