డెంగ్యూ జ్వరం మనిషిని చాలా బలహీనపరుస్తుంది. సరైన సమయంలో గుర్తించి చికిత్స తీసుకోకపోతే ప్రాణాంతకం కూడా కావొచ్చు. డెంగ్యూ వస్తే ప్లేట్ లెట్ల సంఖ్య పడిపోతుంది. అందుకే అటువంటి సమయంలో తగినంతగా పోషకాలు నిండిన ఆహారం తీసుకోవాలి. దీని నుంచి కోలుకోవడానికి ఆహారం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. రోగనిరోధక శక్తిని బలోపేతం చేసేందుకు విటమిన్లు, పోషకాలతో నిండిన ఆహారం తీసుకోవాలి. అంతే కాదు శరీరం డీహైడ్రేట్ అవకుండా పుష్కలంగా ద్రవాలు తాగాలి. రోజుకి కనీసం నాలుగు లీటర్ల నీటిని తాగడం మంచిది. డెంగ్యూ నుంచి కోలుకోవడానికి సహాయపడే పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. ఇవి మిమ్మల్ని త్వరగా కోలుకోవడానికి సహాయపడతామే కాకుండా ఆరోగ్యంగా ఉంచేందుకు దోహదపడుతుంది.


దానిమ్మ


ఐరన్ కంటెంట్ అధికంగా ఉంటుంది. డెంగ్యూ నుంచి కోలుకోవడానికి అవసరమైన ప్లేట్ లేట్ కౌంట్ ని పెంచడంతో సహాయపడుతుంది. ఇది తినడం వల్ల శరీరం మీద సానుకూల ప్రభావం చూపిస్తుంది. అలసటతో పోరాడుతుంది. డెంగ్యూ నుంచి కోలుకున్న తర్వాత దాని తాలూకూ నీరసం చాలా వారాల పాటు ఉంటుంది. అందుకే దాని నుంచి బయటపడేందుకు పోషకాలు నిండిన ఆహారం తీసుకోవాలి.


కివి


కొన్ని అధ్యయనాల ప్రకారం కివీ డెంగ్యూ జ్వరం నుంచి బయటపడేందుకు ప్రభావవంతంగా పని చేస్తుందని తేలింది. ఇందులో రాగి ఉంటుంది. ఎర్ర రక్తకణాల ఉత్పత్తికి సహాయపడుతుంది. ఇన్ఫెక్షన్ తో పోరాడేందుకు అవసరమైన శక్తిని ఇస్తుంది. పొటాషియం, విటమిన్ ఏ, ఇ పుష్కలంగా ఉంటాయి. శరీరంలో ఎలక్ట్రోలైట్ సమతుల్యతని కాపాడుతుంది. కివిలో అధిక స్థాయిలో విటమిన్ శి, డైటరీ ఫైబర్ ఉంటుంది. డెంగ్యూ బారిన పడిన వాళ్ళు త్వరగా కోలుకోవడానికి సహాయపడుతుంది.


సిట్రస్ పండ్లు


డెంగ్యూ రోగులకి సిట్రస్ పండ్లు ప్రయోజనకరంగా ఉంటాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ శి అధికంగా ఉన్నాయి. డెంగ్యూ బారిన పడిన రొగులు డీహైడ్రేషన్ బారిన పడతారు. అలసటతో పోరాడటంతో పాటు శరీరాన్ని సిట్రస్ ఫ్రూట్స్ హైడ్రేట్ గా ఉంచుతాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి.


బొప్పాయి


బొప్పాయిలో పాపైన్, చైమోపాపైన్ అనే జీర్ణ ఎంజైమ్ లు ఉంటాయి. జీర్ణక్రియ, పొట్ట ఉబ్బరం తగ్గించడంలో బాగా ఉపయోగపడుతుంది. బొప్పాయి ఆకులు డెంగ్యూతో పోరాడటానికి అవసరమైన ఔషధాల్లో విస్తృతంగా ఉపయోగిస్తారు. 30ఏంఎల్ తాజా బొప్పాయి ఆకు రసం తాగడం వల్ల ప్లేట్ లేట్ కౌంట్ ని పెంచుతుంది.


కొబ్బరి నీళ్ళు


శరీరానికి అవసరమైన ఖనిజాలు, ఎలక్ట్రోలైట్ లని అందించే సహజ నీటి వనరు. డెంగ్యూ వల్ల డీహైడ్రేషన్ వస్తుంది. అటువంటి సమయంలో కొబ్బరి నీళ్ళు చక్కని ఉపశమనం. ఇందులో తగిన మొత్తంలో ఖనిజాలు, లవణాలు ఉంటాయి. ఇవి శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతాయి. నీరసం, అలసట కూడా తగ్గిస్తుంది.


డ్రాగన్ ఫ్రూట్


శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు, అధిక ఫైబర్, ఐరన్ తో నిండి ఉంటుంది. విటమిన్ సి గొప్ప మూలం. రోగనిరోధక శక్తిని బలోపీతాం చేయడంలో సహాయపడుతుంది. డెంగ్యూ స్వరం తరచుగా ఎముకలలో తీవ్రమైన నొప్పిని కలిగిస్తుంది. డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఎముకలు దృడంగా మారతాయి. శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ లక్షణాల వల్ల హిమోగ్లోబిన్ పెంచుతుంది.


అరటిపండు 


అరటిపండ్లు సులభంగా జీర్ణం అయ్యే పండు. డెంగ్యూ నుంచి కోలుకున్న తర్వాత రొగులు సులభంగా జీర్ణమయ్యే, తగినంత పోషకాలు కలిగి ఉండే ఆహారాన్ని తినాలి. అందుకు అరటి పండు చక్కని ఎంపిక. జీర్ణక్రియకి సహాయపడే ఉత్తమ ఆహారాల్లో ఇది ఒకటి. పొటాషియం, విటమిన్ బి6, సి పుష్కలంగా ఉంటాయి. వ్యాధి నుంచి కోలుకోవడానికి బూస్టర్ లాగా పని చేస్తుంది.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.


Also Read: గుండె జబ్బులు రాకూడదంటే ఈ టీ తాగండి