ఈ ఎర్రటి పండ్లను మార్కెట్లో చూసే ఉంటారు. కానీ వీటి పేరు మాత్రం చాలా తక్కువ మందికే తెలుసు. వీటిని ఫాల్సా అంటారు. అలాగే ఇండియన్ షర్బత్ బెర్రీ అని కూడా పిలుస్తారు. మన దేశంలో వేసవికాలంలోనే ఇవి లభిస్తాయి. పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి దేశాల్లో కూడా ఈ పండ్ల వినియోగం అధికమే. ఇది కమ్మని రుచిని కలిగి ఉంటాయి. ఇవి చాలా జ్యూసీగా ఉంటాయి. అందుకే వీటితో ఎక్కువ మంది స్మూతీలు, షర్బత్‌లు చేస్తూ ఉంటారు. వేసవిలో కచ్చితంగా తినాల్సిన సీజనల్ పండ్లలో ఇది ఒకటి. వీటిని తినడం వల్ల వేసవి తాపాన్ని తట్టుకునే శక్తి శరీరానికి వస్తుంది.


శరీరాన్ని కూల్ చేసేలా
ఫాల్సా... ఈ చిన్న ఊదా రంగు పండు వేసవిలో తినడం వల్ల శరీరానికి కూలింగ్ లక్షణాలను అందిస్తుంది. ఇది శరీరంలోని వేడిని తగ్గించడంతోపాటు శీతలీకరణ సామర్థ్యాన్ని పెంచుతుంది. వడదెబ్బ నుంచి కాపాడుతుంది. 


జీర్ణ వ్యవస్థకు
ఈ పండ్లలో టానిన్లు, ఫ్లేవనాయిడ్లు ఉన్నాయి. ఇవి సహజ యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటాయి. కాబట్టి వీటిని తినడం వల్ల మలబద్ధకం, పొట్ట ఉబ్బరం, జీర్ణ సమస్యలు తగ్గుతాయి. ఈ పండ్లులోని ఫైబర్ పేగు కదలికలను చురుగ్గా మారుస్తుంది. అలాగే పొట్టలోని మంచి బాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. కాబట్టి వీటిని వేసవిలో కచ్చితంగా తినాలి. 


కీళ్ల నొప్పులకు
ఉష్ణోగ్రతలు పెరిగే కొద్దీ కీళ్ల నొప్పులు వేధిస్తాయి. ఆర్థరైటిస్ వంటి సమస్యలు ఉన్నవారు ఫాల్సా పండ్లను తింటే ఎంతో మంచిది. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ సమ్మేళనాలు పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి కీళ్ల నొప్పులను తగ్గిస్తాయి. వీటిలో విటమిన్ సి కూడా అధికంగా ఉంటుంది. కాబట్టి కీళ్ల ఆరోగ్యాన్ని కాపాడతాయి.


జిడ్డు చర్మం ఉంటే
కొందరికి చర్మం చాలా జిడ్డుగా, ఆయిలీగా ఉంటుంది. అలాంటివారు వేసవిలో మరింత ఇబ్బందిని ఎదుర్కోవాల్సి వస్తుంది. వాతావరణంలో పెరిగిన వేడి చర్మంలో సెబమ్ ఉత్పత్తిని అధికం చేస్తుంది. దీనివల్ల ముఖం మరింత జిడ్డుగా మారుతుంది. రంధ్రాలు మూసుకుపోతాయి. దీనివల్ల మొటిమలు వంటి సమస్యలు వస్తాయి. ఫాల్సా పండ్లను తినడం వల్ల సెబమ్ ఉత్పత్తి తగ్గుతుంది. దీనివల్ల చర్మం జిడ్డుగా మారదు. 


జ్వరం వస్తే
వేసవిలో అధిక ఉష్ణోగ్రత వల్ల ఎక్కువ మంది జ్వరం బారిన పడుతూ ఉంటారు. శరీరం వేడెక్కి డీహైడరేషన్‌కు గురవడం వల్ల ఈ జ్వరం వస్తుంది. ఫాల్సా తినడం వల్ల జ్వరం వెంటనే తగ్గే అవకాశం ఉంది. దీనిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. అలాగే వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. శరీరంపై శీతలీకరణ ప్రభావాన్ని చూపించే ఈ పండ్లు జ్వరం, ఇన్ఫ్లమేషన్ వంటి లక్షణాలను తగ్గిస్తాయి. శరీరానికి అధిక నీటి శాతాన్ని అందిస్తాయి.


వడదెబ్బకు
మండే ఎండల్లో వడదెబ్బ తగలడం సహజం. వడదెబ్బ తగలకుండా శరీరాన్ని కాపాడే అద్భుతమైన ఔషధం ఫాల్సా పండ్లు. వీటిలో విటమిన్ ఏ, విటమిన్ సి వంటి పోషకాలు ఉన్నాయి. ఇవి శరీరాన్ని చల్లగా ఉంచడమే కాదు హైడ్రేటెడ్ గా ఉంచుతాయి.  ఎండలో బయటికి వెళ్లే ముందు ఈ పండ్లతో షర్బత్ చేసుకుని తాగితే వడదెబ్బ తగిలే అవకాశం ఉండదు. 



Also read: ఆమె వల్ల మా ఇద్దరి మధ్య గొడవలు పెరిగిపోతున్నాయి, ఇలాంటి పరిస్థితుల్లో నేనేం చేయాలి?





























గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.