నోటి శుభ్రం చాలా అవసరం. పళ్ళు శుభ్రంగా తోముకోకపోతే పుచ్చిపోవడం, పాచి పట్టి నోరు దుర్వాసన రావడం జరుగుతుంది. కొంతమంది పళ్ళు శుభ్రంగా తోముకుంటారు. కానీ నాలుక మాత్రం క్లీన్ చేయకుండా వదిలేస్తారు. అలా చేయడం వల్ల నోటి సంబంధిత జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది. నాలుక మీద తెల్లటి మచ్చలు, గడ్డలు ఏర్పడితే అవి సాధారణమే అని వదిలేస్తే తర్వాత తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మన నాలుకలో వచ్చే కొన్ని మార్పులు ప్రాణాంతక వ్యాధులని కూడా సూచిస్తాయి. అందుకే బ్రష్ చేసేటప్పుడు తప్పని సరిగా నాలుక కూడా క్లీన్ చేసుకోవాలి.


నాలుక మీద తెల్ల మచ్చలు


నాలుక శుభ్రం చేసుకోకపోతే తెల్లటి మచ్చలు ఏర్పడతాయి. దాన్ని నోటి లేదా ఓరల్ థ్రష్ అంటారు. ఇది సాధారణమైనది, సులభంగా చికిత్స కూడా చేసి పోగొట్టవచ్చు. ఈ సమస్య వచ్చినప్పుడు నోట్లో తరచుగా పుండ్లు పడటం, రుచి లేకపోవడం, తినడం, తాగడానికి ఇబ్బందిగా ఉంటుంది. చికిత్స తర్వాత తగ్గినట్లు అనిపించి పునరావృతమైతే మాత్రం రోగనిరోధక వ్యవస్థలో సమస్య ఉన్నట్లు భావించాలి. అది శరీరంలో వేరే అంతర్లీన సమస్యకు సంకేతం కావచ్చు. 


నోట్లో కూడా తెల్ల మచ్చలు


నాలుక మీదే కాకుండా నోరంతా కూడా ఇలా తెల్ల మచ్చలు లేదా పుండ్లు వస్తే దాన్ని ల్యూకోప్లాకియా అంటారు. ఇది దీర్ఘకాలం పాటు ధూమపానం చేయడం వల్ల వస్తుంది. ఇవి చాలావరకు నిరాపాయమైనవి. కానీ క్యాన్సర్‌కు ముందు కూడా ఇలా వస్తుంది. అందుకే నోట్లో తెల్ల మచ్చలు కనిపిస్తే వెంటనే దంత వైద్యులని తప్పనిసరిగా సంప్రదించాలి.


నోటిపూతలు


నోట్లో లేదా నాలుకపై పుండ్లు రావడం సర్వసాధరణం. అవి శరీరంలో వేడి ఎక్కువగా అనిపించినప్పుడు వస్తుంటాయని చాలా మంది అపోహ పడుతుంటారు. ఇవి బాధకారంగా ఉన్నప్పటికీ త్వరగానే తగ్గిపోతాయి. వాటి వల్ల తినడం, తాగడం చాలా ఇబ్బందిగా మారుతుంది. అయితే నోట్లోని పుండ్లు నయం కాకుండా నాలుకపై ముద్దగా అలాగే ఉంటే మాత్రం అది క్యాన్సర్ కి సంకేతం కావచ్చు. వెంటనే దంత వైద్యులని కలిసి పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం.


నాలుక మీద గీతలు ఎక్కువగా పడటం


ఇది సాధారణ పరిస్థితి, తీవ్రమైనది కాదు. సిట్రస్ పండ్లు లేదా స్పైసీ ఫుడ్స్ వంటి కొన్ని ఆహారాల పదార్థాలు అతిగా తీసుకుంటే ఇలా నాలుక మీద గీతలు మాదిరిగా పుండ్లు కనిపిస్తాయి. దీనికి సులభమైన మార్గం నాలుకకి చికాకు కలిగించే ఆహారాన్ని నివారించడమే.


నాలుక మీద వెంట్రుకలు 


నాలుకపై ఉండే అతి చిన్న చిన్న బుడిపెలపై ఏర్పడే బ్యాక్టీరియా, నోటిలోని వ్యర్థాల కారణంగా నాలుక నల్లగా మారుతుంది. అంతే కాదు నాలుకపై వెంట్రుకలు కూడా మొలుస్తాయి. సాధారణంగా ఇది చాలా అరుదుగా జరుగుతుంది. ఎక్కడో ఒకరిద్దరికి ఇలాంటి అనుభవం ఎదురవుతుంది. వైద్య పరిభాషలో దీన్నే హెయిరీ టంగ్ సిండ్రోమ్ అని కూడా అంటారు. వినడానికి విచిత్రంగా ఉన్నా ఇది మాత్రం నిజం. నోట్లో బ్యాక్టీరియా, ఈస్ట్ పెరుగుదలకి ఇది కారణం అవుతుంది. ఈ బ్యాక్టీరియా పాపిల్లే అనే చిన్న గుండ్రని ప్రొజెక్షన్‌ లపై పెరుగుతుంది. తీవ్రమైన సందర్భాల్లో నాలుక మీద వెంట్రుకలు సాధారణ పొడవు కంటే 15 రెట్లు ఎక్కువగా పెరుగుతాయి. పేలవమైన నోటి పరిశుభ్రత, ధూమపానం వల్ల ఇది సంభవిస్తుంది.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.


Also read: భోజనం తర్వాత స్నానం చేస్తున్నారా? సూర్యస్తమయం తర్వాత చేస్తే ఏమవుతుంది?