డయాబెటిస్ రావడానికి అధిక బరువు, వ్యాయామం చేయకపోవడం, అధిక రక్తపోటు కారణమని ఎక్కువమంది భావిస్తారు. అలాగే జన్యుపరంగా కూడా వస్తుందని అంటారు. ఇవన్నీ నిజమే. అలాగే మరికొన్ని ఇతర కారణాలు కూడా ఉన్నాయి. వీటి వల్ల కూడా డయాబెటిస్ వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు వైద్యులు. కానీ వీటి గురించి చాలా తక్కువ మందికి అవగాహన ఉంది. డయాబెటిస్ రావడానికి వాయు కాలుష్యం కూడా ఎంతో దోహదపడుతుంది. అలాగే క్రిమిసంహారకాలు జల్లిన ఆహార పదార్థాలు, నాన్ స్టిక్ పాత్రలు, నిద్రలేమి, పేగుల్లో ఉన్న బ్యాక్టీరియా వంటివి కూడా డయాబెటిస్ వచ్చే అవకాశాన్ని పెంచుతాయి. కాబట్టి ఇప్పుడు డయాబెటిస్ వస్తే దేనికి వచ్చిందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. అలాగే రాని వాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా డయాబెటిస్ పూర్తిగా రాకుండా అడ్డుకోవచ్చు.


ఒకప్పుడు వయసు ముదిరిన వారికే డయాబెటిస్ వచ్చేది. ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా డయాబెటిస్ దాడి చేస్తోంది. సన్నగా ఉన్న వారిలో కూడా డయాబెటిస్ కనిపిస్తుంది. కాలుష్య మహమ్మారి కూడా డయాబెటిస్ వచ్చే అవకాశాన్ని పెంచుతుంది. గాలి, నీరు, భూమి కలుషితమైనప్పుడు వాటి ద్వారా అందిన ఆహారం తినడం ద్వారా డయాబెటిస్ బారిన పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా గాలి కాలుష్యంలో కొన్ని రకాల లోహాలు శ్వాస ద్వారా డయాబెటిస్ బారిన పడేలా చేస్తాయి. కాబట్టి అధిక కాలుష్య ప్రాంతాల్లో నివసించకుండా ఉంటే మంచిది.


పంట పొలాల్లో వాడే క్రిమి సంహారక మందులు, ఎరువులు కూడా డయాబెటిస్ వచ్చే అవకాశాన్ని పెంచుతాయి. అందుకే వాటిని వాడే రైతులు,  వ్యవసాయ కూలీలు డయాబెటిస్ బారిన పడుతున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. అలాంటి క్రిమిసంహారక మందులకు ప్రత్యక్షంగా గురయ్యే వారు త్వరగా ప్రభావితం అవుతారు. అలాగే భూమి లోపలికి ఇంకిపోయి భూమిని, అలాగే భూమి నుంచి మొలిచే మొక్కని, ఆ మొక్కకు కాసే పంట కూడా ప్రమాదకరంగా మారుతున్నాయి. అందుకే కూరగాయలను బాగా కడిగాకే వండుకోవాలి. అది కూడా ఎక్కువ సేపు ఉడికించాలి.


ప్లాస్టిక్ పరిశ్రమల్లో పనిచేసే వారు కూడా మధుమేహం బారిన అధికంగా పడుతున్నారు. ప్లాస్టిక్ లో హానికారక బీపీఏ ఉంటుంది. ఇది శ్వాస ద్వారా సూక్ష్మ రూపంలో ఊపిరితిత్తుల్లోకి చేరుతుంది. దీనివల్ల ఊబకాయం, గుండె జబ్బులు, క్యాన్సర్లు, సంతానలేని వంటివి దాడి చేస్తున్నాయి. వీటితో పాటు మధుమేహం కూడా వస్తుంది. పేగుల్లో కూడా బ్యాక్టీరియా చేరి మధుమేహం బారిన త్వరగా పడేలా చేస్తుంది. కాబట్టి తినే ఆహారం, పీల్చే గాలి, తాగే నీరు స్వచ్చంగా ఉండేలా చూసుకోండి. అలాగే వ్యాయామం తప్పకుండా చేయండి.


Also read: హై బీపీ లేనివారు కూడా ఉప్పు తింటే ప్రమాదమే


Also read: దానిమ్మ తొక్కలు పడేస్తున్నారా? వాటితో అందాన్ని ఇలా పెంచేయొచ్చు













































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.