రీరంలోని వ్యర్థాలు, విష పదార్థాలని బయటకి పంపించే బాధ్యత కిడ్నీలదే. అవి నిరంతరం పని చేస్తేనే ఆరోగ్యంగా ఉంటారు. మధుమేహం, వృద్ధాప్యం, రక్తపోటు కారణంగా కిడ్నీ సమస్యలు తలెత్తుతున్నాయి. కిడ్నీ వ్యాధి గుండె, రక్తనాళాల వ్యాధుల అవకాశాలని పెంచుతుందని పలు అధ్యయనాలు చెప్తున్నాయి. అంతే కాకుండా పాలిసిస్టిక్ మూత్రపిండ వ్యాధి వారసత్వంగా వస్తుంది. ఈ వ్యాధి చుట్టుపక్కల కణజాలాలకి వ్యాపించి.. కోలుకోలేని నష్టాన్ని కలిగిస్తుంది. మనం తీసుకునే ఆహారం, నీళ్ళు, అలవాట్ల కారణంగా మూత్రపిండాలు ప్రమాదంలో పడుతున్నాయి. తగినంత నీరు తాగకపోవడం వల్ల కిడ్నీల్లో రాళ్ళు ఏర్పడుతున్నాయి.


మూత్రపిండాలని దెబ్బతీసే మరొక వ్యాధి లూపిస్. ఇది కిడ్నీలోని వ్యర్థాలని ఫిల్టర్ చేసేందుకు సహకరించే రక్తనాళాలు వాపు లేదా మచ్చలు వచ్చేలా చేస్తుంది. దీని వల్ల కూడా మూత్రపిండాలు విఫలం అవుతాయి. చివరికి డయాలసిస్ లేదా కిడ్నీ మార్పిడి చేయాల్సిన పరిస్థితి తలెత్తే అవకాశం ఉంది. ఎంతో మంది కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నారు. అందుకు కారణం దీనికి సంబంధించి ఎటువంటి అవగాహన లేకపోవడం. అందుకే కిడ్నీ వ్యాధులని 'సైలెంట్ కిల్లర్స్' అని కూడా పిలుస్తారు. చాలా మందికి వ్యాధి ముదిరే వరకు ఎటువంటి లక్షణాలు బయట పడవు. వ్యాధిని గుర్తించడంలో విఫలం అవడం మరొక కారణం. మూత్రపిండాల పనితీరు సక్రమంగా ఉందా లేదా అని తెలుసుకునేందుకు ఉన్న ఏకైక మార్గం వ్యాధి నిర్ధారణ పరీక్షలు.


ఈ సంకేతాలు కనిపిస్తే.. కిడ్నీలు చెడిపోతున్నట్లే.. 


అలసట: ఎటువంటి పనులు, శ్రమ లేకపోయినా కూడా అలసటగా అనిపిస్తుంది. ఈ సంకేతం ఆందోళన కలిగిస్తుంది. ఇలాగే ఉంటే మాత్రం తప్పనిసరిగా వైద్య నిపుణులని కలిసి పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం. అలసట శరీరంలో అంతర్లీనంగా ఏదో ఆరోగ్య సమస్య ఉందని సూచిస్తుంది.


ఆకలి లేకపోవడం: ఏమి తినలేకపోవడం, ఆకలి మందగించడం తీవ్రమైన సమస్యని సూచిస్తుంది. సాధారణంగా మూత్రపిండాల వ్యాధి ఉన్న వాళ్ళు ఈ లక్షణాన్ని కలిగి ఉంటారు.


పాదాలు, కళ్ళు ఉబ్బడం: పాదాలు, చీల మండ ఉబ్బిపోతాయి. ఇది కూడా మూత్రపిండాల వ్యాధికి సంబంధించిన కొన్ని సాధారణ లక్షణాలు. కిడ్నీలు పేలవంగా పని చేస్తున్నప్పుడు శరీరంలో ద్రవం పేరుకుపోతుంది. దాని వల్ల కాళ్ళు, చీలమండలు, పాదాల్లో వాపు కనిపిస్తుంది. కళ్ళు ఉబ్బినట్లుగా అనిపించినా కిడ్నీ వ్యాధి ఉందని అర్థం. తరచూ ఇలాగే జరిగితే తప్పనిసరిగా వైద్యులని సంప్రదించాలి.


పొడి, దురద చర్మం: శరీరంలో అవయవాల పనితీరు సక్రమంగా లేకపోతే వెంటనే చర్మం చెప్పేస్తుంది. మూత్రపిండాల పనితీరు సరిగా లేదంటే శరీరంలో టాక్సిన్స్ పేరుకుపోతాయి. దాని వల్ల దురద, పొడి చర్మం, దుర్వాసన వస్తుంది.


మూత్రంలో మార్పులు: మూత్ర విసర్జనలో కూడా మార్పులు వస్తాయి. మూత్ర విసర్జన తగ్గడం లేదా తరచుగా వెళ్ళడం కూడా ఇబ్బందే. ముఖ్యంగా రాత్రి వేళ మూత్ర విసర్జన ఎక్కువగా ఉంటే పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం.


అధిక రక్తపోటు: మూత్రపిండాల వ్యాధికి ప్రధాన సంకేతం అధిక రక్తపోటు. హైపర్ టెన్షన్ తో బాధపడుతున్న ఎవరైనా మూత్రపిండాల పనితీరు గురించి తప్పనిసరిగా తెలుసుకోవాలి.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.


Also Read: జొన్నలతో చేసే పాంక్, మధుమేహులకి అద్భుతమైన చిరుతిండి