చిరుధాన్యాలు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో పోషకాలు అందుతాయి. రాగులు, జొన్నలు, సజ్జలు, గోధుమలు, కొర్రలతో చేసిన ఆహార పదార్థాలు తీసుకునే చాలా మంచిది. పూర్వంలో వరి అన్నానికి బదులుగా వీటితో చేసిన సంకటి లేదా రొట్టెలు చేసుకుని తినేవాళ్ళు. ఇప్పటికీ వీటితో చేసిన రొట్టెలు తినడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తారు. చిరుధాన్యాలు ఉపయోగించి చిరుతిండ్లు కూడా చేసుకుంటారు. అలా గుజరాత్ లోని సూరత్ లో జొన్నలతో చేసే పాంక్ చాలా ఫేమస్. మహారాష్ట్రతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో బాగా ప్రాచుర్యం పొందింది.
పాంక్ తయారీ విధానం
కొద్దిగా స్పైసిగా ఉండే ఈ పాంక్ తయారీ చాలా సులభం. జొన్నలు కాస్త నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. అందులో ఉప్పు, మిరియాలు, ఎండుమిర్చి, నిమ్మరసం, ఉల్లిపాయలు, టమోటాలు, పచ్చి మిర్చి, చాట్ మసాలా వేసి మిక్సింగ్ గిన్నెలో వేసి కలుపుకోవాలి. కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసుకుని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. జొన్నలతో తయారు చేసే ఇది గ్లూటెన్ రహితం. ఇది తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుంది.
పాంక్ తినడం వల్ల వచ్చే ఆరోగ్య ప్రయోజనాలు
ఇది ప్రోటీన్, ఫైబర్ రిచ్ సీజనల్ ట్రీట్. కండరాలు గట్టి పడేలా చేస్తుంది. శరీరంలోని కణాలను పునరుత్పత్తి చేయడంలో సహాయపడుతుంది. ఇది కాల్షియం, రాగి, జింక్, ఐరన్, విటమిన్లు బి1, బి2, బి5, బి6 తో పాటు ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా లభిస్తాయి.
ఫైబర్ పుష్కలంగా ఉంటుంది
ఇందులో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. జీర్ణాశయాన్ని బలోపేతం చేస్తుంది. జీర్ణక్రియ సజావుగా అయ్యేందుకు సహకరిస్తుంది. ఊబకాయాన్ని నియంత్రిస్తుంది.
మధుమేహులకి మంచిదే
కార్బోహైడ్రేట్ల గొప్ప మూలం ఇది. రక్తంలో చక్కెర స్థాయిలని అదుపులో ఉంచుతుంది. మధుమేహులు ఎటువంటి భయాందోళనలు పెట్టుకోకుండా తినొచ్చు. నోటికి రుచిగా ఉండటంతో పాటు పోషకాలు ఇస్తుంది.
కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది
చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించడంలో ప్రభావవంతంగా పని చేస్తుంది. గుండె జబ్బులు, అధిక రక్తపోటు ఉన్న వారికి కూడా ఆరోగ్యకరమైన చిరుతిండి.
యాంటీ ఆక్సిడెంట్లు మెండు
ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా లభిస్తాయి. ఇది ఆక్సీకరణ ఒత్తిడిని నియంత్రించడంలో సహాయపడుతుంది. మధుమేహం, హృదయ సంబంధ వ్యాధులు, క్యాన్సర్ నుంచి శరీరాన్ని కాపాడుతుంది.
బరువు తగ్గిస్తుంది
బరువు తగ్గాలని అనుకునే వాళ్ళకి సూపర్ ఫుడ్ ఇది. డైటరీ ఫైబర్ గుణం ఉండటం వల్ల ఇది తిన్న తర్వాత పొట్ట ఎక్కువ సేపు నిండుగా ఉంటుంది. అతిగా తినడాన్ని నివారిస్తుంది. ఫలితంగా బరువు తగ్గుతారు.
ఈ వ్యాధిగ్రస్తులకి మంచిది
జొన్నలు గ్లూటెన్ రహిత ధాన్యం. ఉదరకుహ వ్యాధితో బాధపడే వాళ్ళు దీన్ని తీసుకోవచ్చు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.
Also read: అబ్బాయిలూ, కాలుష్యం నుంచి మీ చర్మాన్ని ఇలా సంరక్షించుకోండి