భార్యాభర్తల మధ్య గొడవలు రావడానికి ఎక్కువగా మూడో వ్యక్తి కారణం అనుకుంటారు చాలామంది. కొన్నిసార్లు మూడో వ్యక్తి లేకుండానే వీరి బంధం బలహీనంగా మారిపోతుంది. అది విడాకులు దాకా వెళ్తుంది. ఇద్దరి దారులు వేరవుతాయి. మీ వివాహాన్ని నాశనం చేసే కొన్ని కారణాలు ఇవే. వీటిని అధిగమించేందుకు ముందే సిద్ధమైతే మీ వివాహ బంధం వందేళ్లు నిండుగా సాగుతుంది.
కమ్యూనికేషన్ లేకపోవడం
ఏ విషయంలోనైనా భార్యాభర్తల మధ్య కమ్యూనికేషన్ కీలకం. అది చిన్న విషయం అయినా పెద్ద విషయమైనా ప్రతిదీ ఒకరికి ఒకరు చెప్పుకోవడం ముఖ్యం. ఒక్కొక్కసారి చిన్న చిన్న విషయాలే పెద్ద తప్పులుగా వారి మధ్య మారొచ్చు. భార్యాభర్తల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. లేకుంటే ఒకేసారి గొడవలు భగ్గుమంటాయి. అవి వాదనకు దారి తీసి వారు విడిపోయేదాకా తీసుకెళతాయి.
మోసం
స్నేహితులను మోసం చేస్తేనే ఆ స్నేహం మధ్యలోనే ఆగిపోతుంది. అలాంటిది మీతో జీవితాంతం నడిచే వ్యక్తిని ఏ చిన్న విషయంలో మోసం చేసినా, అది చాలా పెద్ద ఫలితాన్ని అందిస్తుంది. మీరు మీ జీవిత భాగస్వామి దగ్గర నిజాయితీగా ఉండడం చాలా అవసరం.
డబ్బు కష్టాలు
చేతిలో సరిపడినన్ని డబ్బు లేకపోయినా, చిన్నచిన్న గొడవలే విడాకుల దాకా దారితీస్తాయి. వివాహ జీవితంలో డబ్బు చాలా ఒత్తిడిని కలిగిస్తుంది. ప్రత్యేకంగా ఒకరు అధికంగా ఖర్చు పెట్టడం, మరొకరు పొదుపు చేసే గుణం కలిగిన వారైతే... వారిద్దరి మధ్య డబ్బు చాలా సమస్యలకు కారణంగా మారుతుంది. డబ్బు గురించి వాదనలు ఇంట్లో సాగుతూనే ఉంటాయి. ఆ సంసారం ఎక్కువ కాలం నిలవడం కష్టం. కాబట్టి పెళ్లికి ముందే కూర్చుని బడ్జెట్ నిర్ణయించుకొని, ఇద్దరు కలిసి సాగడం ముఖ్యం.
శారీరక సాన్నిహిత్యం
భార్యాభర్తల మధ్య లైంగిక సంబంధానికి చాలా విలువ ఉంది. శారీరక సాన్నిహిత్యం అనేది వివాహానికి కీలకమైనది. అది లేకపోవడం వల్ల వారిద్దరి మధ్య శారీరకంగానే కాదు, మానసికంగా కూడా చాలా దూరం ఏర్పడుతుంది. ఆ సమయంలో ఎదుటివారు ఏం చేసినా కూడా తప్పుగానే అనిపిస్తుంది. కాబట్టి శారీరక సాన్నిహిత్యాన్ని కొనసాగించాలి. అది ఎన్నో సమస్యలను దూరం చేస్తుంది కూడా.
విమర్శలు
ఒకరినొకరు విమర్శించుకోవడం, నిందలు వేయడం అనేది భార్యాభర్తల విషయంలో చాలా ప్రమాదం. జీవిత భాగస్వామిని నిరంతరం విమర్శించే వ్యక్తిని ఎవరూ భరించలేరు. ఇది వైవాహిక జీవితంలో విడాకులకు దారి తీస్తుంది. ఇలాంటి ప్రవర్తన మీకు ఉంటే వెంటనే మార్చుకోండి.
నిర్లక్ష్యం
జీవిత భాగస్వామి విషయంలో చిన్న నిర్లక్ష్యం కూడా అది పెద్ద సమస్యకు కారణం అవుతుంది. వివాహానికి విషం లాంటిది నిర్లక్ష్యం. జీవిత భాగస్వామిని విస్మరించడం, వారి సొంత అభిప్రాయాలకు విలువ ఇవ్వకపోవడం, నిర్లక్ష్యంగా మాట్లాడడం వంటివి వివాహ జీవితానికి ముప్పు తెస్తాయి. కాబట్టి మీ భార్య లేదా భర్త చెప్పే విషయాలను జాగ్రత్తగా వినడం, వారికి విలువ ఇవ్వడం ముఖ్యం.
అపనమ్మకం
కేవలం పెళ్లిలోనే కాదు, ఏ బంధంలో అయినా నమ్మకం చాలా ముఖ్యమైనది. అది లేకపోతే ఏ అనుబంధమైన కుప్పకూలిపోతుంది. మీరు కూడా మీ జీవిత భాగస్వామిని చాలా నమ్మాలి. వారి నమ్మకాన్ని కూడా మీరు పొందాలి. నిరంతరం ఎక్కడికి వెళ్లావు? ఏం చేస్తున్నావ్?ఎవరిని కలిసావు? ఇలాంటి ప్రశ్నలతో వేధించకూడదు. అవి మీ అనుమాన గుణాన్ని బయటపెడతాయి. నమ్మకం లేని జీవిత భాగస్వామితో ఎవరు కలిసి ఉండరు.
పైన చెప్పిన ఏడు లక్షణాలు మీ పెళ్లిలో కనిపిస్తే చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ ఏడింటిలో ఏదైనా ఏ కారణమైనా కూడా మీ పెళ్లి పెటాకులు కావడానికి పెద్ద కారణంగా మారుతుంది.
Also read: తేనెటీగలు అంతరించిపోతే, మానవజాతి కూడా ముగిసిపోతుంది - అందుకే వాటిని కాపాడుకుందాం