రోజు వారీ జీవితంలో ప్రత్యక్షంగా తేనెటీగల పాత్ర ఏమి కనిపించదు. అందుకే వాటివల్లే మనం బతుకుతున్నాం అన్న సంగతి ఎవరూ గుర్తించలేని పరిస్థితి. నిజానికి మనం ఈ భూమిపై జీవించగలుగుతున్నామంటే దానికి కారణం తేనెటీగలే. ఇవి మొత్తం అంతరించిపోతే కేవలం 30 రోజుల్లో మానవజాతి కూడా అంతరించిపోతుంది. ఈ చిన్న కీటకాలు లేకపోతే మనిషి కొన్ని రోజులు కన్నా ఎక్కువ కాలం జీవించలేడు. అందుకే తేనెటీగలను కాపాడుకోమని ఐక్యరాజ్యసమితి ఎప్పటినుంచో చెబుతోంది. లేకుంటే మానవజాతి మనుగడకు ప్రమాదమని హెచ్చరిస్తోంది. ఈ భూమిపై ఉన్న తేనెటీగల్లో కొన్ని వందల రకాలు ఉన్నాయి. వాటిలో 180 రకాల తేనెటీగలు జాతులు అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నాయని ఐక్యరాజ్యసమితి చెబుతుంది. వాటిని రక్షించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పింది.


ఏమి ఉపయోగం
తేనెటీగలతో మనకేంటి ఉపయోగం? తేనెటీగలు ఇచ్చే తేనె లేకపోతే మనము బతకలేమా? ఇలానే ఎక్కువమంది ఆలోచిస్తారు. మనం తేనెటీగలను కాపాడుకోవాల్సింది తేనె కోసం కాదు మన పంటల కోసం. ఒక అంచనా ప్రకారం భూమిపై చెట్లు పెరుగుతున్నాయన్నా, 90 శాతానికి పైగా పంటలు పండుతున్నాయన్నా వాటికి కారణం తేనెటీగలే. ఇవే లేకపోతే కొత్త చెట్టు మొలవడం కష్టం. పంటలు పండడం అసాధ్యం. మనకు సృష్టిలో ప్రతి జీవి మరొక జీవిపై ఆధారపడి బతికేటట్టే ముడివేసి ఉంది. అలా మనం తేనెటీగలతో ముడిపడిపోయాం. అవి ప్రమాదంలో పడితే మనం కూడా ప్రమాదం అంచుకు చేరుకుంటాం. తేనెటీగలు పూలమకరందాన్ని తాగి బతుకుతాయి అన్న సంగతి మీకు తెలిసిందే. అయితే పురుగుల మందులు అధికంగా వాడడం, పెరిగిపోతున్న కాలుష్యం కారణంగా తేనెటీగలు జీవించలేకపోతున్నాయి. వాటి సంఖ్య తగ్గిపోతూ వస్తుంది. అవే లేకపోతే మొక్క నుండి మొక్కకి మకరందం పుప్పొడిని మోస్తూ ఫలదీకరణాన్ని ఎవరు చేస్తారు? కొత్త మొక్కల్ని ఎవరు పుట్టిస్తారు? అందుకే తేనెటీగల సంఖ్య తగ్గకుండా చూసుకోవాల్సిన బాధ్యత భూమిపై జీవిస్తున్న ప్రతి మనిషికి ఉంది. 


తేనెటీగల సంఖ్య తగ్గిపోవడం అనేది కేవలం ఒక దేశానికో, ఒక ప్రాంతానికో సంబంధించింది కాదు. ప్రపంచమంతా ఆ ప్రభావం పడుతుంది. యూకేలో జీవించే 13 జాతుల తేనెటీగలు పూర్తిగా అంతరించిపోయాయి. గత పదేళ్లలోనే ఇది జరిగింది. మరొక 35 జాతుల తేనెటీగలు అంతరించిపోయే దశకు చేరుకుంటున్నాయి. కాబట్టి అక్కడి అగ్రికల్చరల్ విభాగం చాలా ఆందోళన పడుతుంది. తేనెటీగల సంతతిని పెంచకపోతే వందేళ్ళలో ప్రపంచం తీవ్ర ఆహార కొరతను ఎదుర్కోవాల్సి రావచ్చు.


తేనెటీగలు చేసే పరాగ సంపర్కమే ప్రపంచం ఆహార ఉత్పత్తిలో ప్రధాన భాగం. 80 మిలియన్ సంవత్సరాలుగా తేనెటీగలు ఇదే పనిలో ఉన్నాయి. వీటితో పాటు సీతాకోకచిలుకలు, పక్షులు, చిన్న కీటకాలు, తుమ్మెదలు వంటివి కూడా పరాగ సంపర్కానికి దోహదం చేస్తున్నాయి. అందుకే తేనెటీగల సంఖ్య తగ్గిపోకుండా కాపాడుకోవాలని హెచ్చరిస్తోంది ఐక్యరాజ్యసమితి. 



Also read: టాటూ వేయించుకోవాలనుకుంటున్నారా? ఈ భాగాల్లో మాత్రం వద్దు








గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.