ఊబకాయం ప్రపంచ జనాభాను ఇబ్బంది పెడుతున్న ప్రధాన సమస్య. 2016లో చేసిన అధ్యయనంలో 18 ఏళ్లకు నిండిన వారు, అంతకన్నా ఎక్కువ వయసు ఉన్నవారు ప్రపంచంలో 190 కోట్ల మంది అధిక బరువుతో బాధపడుతున్నట్టు అంచనా. వీరిలో 65 కోట్లకు పైగా ఊబకాయంతో ఉన్నవారే. ఊబకాయం వల్ల ఆరోగ్య సమస్యలు అధికమవుతాయి. ఊబకాయం అనేది నిజానికి ఒక అనారోగ్యమే కానీ ఈ విషయాన్ని ఎక్కువమంది గుర్తించరు.


ఒక వ్యక్తి బాడీ మాస్ ఇండెక్స్ 30 లేదా అంతకంటే ఎక్కువ ఉన్నప్పుడు అతను ఊబకాయం బారిన పడినట్టు చెబుతారు. బాడీ మాస్ ఇండెక్స్ 25 కంటే ఎక్కువ ఉంటే వారిని అధిక బరువుతో బాధపడే వారిగా గుర్తిస్తారు. ఊబకాయం అనేది నాన్ కమ్యూనికేబుల్ వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతున్న ప్రకారం 2025 నాటికల్లా ప్రపంచంలో ఊబకాయుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఎక్కువ. ఊబకాయం శరీరంలోని ఎన్నో అవయవాలపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా గుండె పైనే ఇది అధికంగా చెడు ప్రభావాన్ని చూపిస్తుంది. 


ఊబకాయం బారిన పడిన వారు త్వరగా గుండె జబ్బులు, పక్షవాతం వంటి వాటి బారిన పడే అవకాశం ఉంది. జీవక్రియ రుగ్మతలు, నడుము చుట్టూ అధికంగా కొవ్వు పేరుకుపోవడం, శరీరంలో ఇన్సులిన్ నిరోధకత పెరగడం ఇవన్నీ కూడా ఊపకాయంలో జరుగుతాయి. అందుకే బరువు పెరిగినవారు త్వరగా డయాబెటిస్ బారిన పడతారు. శరీరంలో కొవ్వులు, కార్బోహైడ్రేట్లను జీర్ణం చేసే విధానం మారిపోతుంది. దీని ఫలితంగా రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోతాయి. అప్పుడు ఆ వ్యక్తి డయాబెటిస్ బారిన పడతాడు.


అధిక బరువుతో బాధపడే వారిలో ఎముకలు, కీళ్లపై అదనపు భారం పడుతుంది. దీనివల్ల ఆస్టియో ఆర్థరైటిస్ వంటి సమస్యలు వస్తాయి. ఎముకలు బలహీనపడతాయి. మోకాలు, తుంటి వంటి కీళ్ల ప్రాంతాలు అరిగిపోతాయి. అంతేకాదు బరువు అధికంగా ఉండడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా పెరుగుతుంది. ముఖ్యంగా అన్నవాహిక, ప్యాంక్రియాస్, పెద్దపేగు, పురీషనాళం, రొమ్ము, పిత్తాశయం , ఎండోమెట్రియన్, మూత్రపిండాల క్యాన్సర్ వంటివి వచ్చే అవకాశం ఎక్కువ అని ఇప్పటికే ఎన్నో అధ్యయనాలు చెబుతున్నాయి.


ఊబకాయానికి మానసిక స్థితికి కూడా జీవసంబంధం ఉంది. అధిక బరువు ఉన్నవారు త్వరగా డిప్రెషన్ బారిన పడతారు. ఒక వ్యక్తిలోని జీవ సంబంధమైన ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది అధిక బరువు. దాని వల్ల మానసిక ఆరోగ్యం కూడా చెడిపోతుంది. అధిక బరువు ఉన్నవారు గర్భం ధరిస్తే ఆ సమయంలో గర్భస్రావం, మధుమేహం, ప్రీక్లాంప్సియా వంటి సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ. రెండు ప్రధాన శ్వాస కోశ సమస్యలు కూడా అధిక బరువు వల్ల వస్తాయి, ఆస్తమా, అబ్స్ట్రాక్టివ్ స్లీప్ ఆప్నియా వంటివి ఊబకాయంతో సంబంధాన్ని కలిగి ఉన్నాయి. శరీరం బరువు పెరగడం వల్ల శ్వాసకోశ వ్యవస్థ పనితీరు దెబ్బతింటుంది. శరీరంలో కొవ్వు పేరుకుపోవడం పోయి ఊపిరితిత్తుల వాయు మార్గాలు సంకోచిస్తాయి. కాబట్టి అధిక బరువు, ఊబకాయం వల్ల అన్ని నష్టాలే. ముందస్తు మరణాలు కూడా పెరిగే అవకాశం. ఎక్కువ కాబట్టి ఆరోగ్యకరమైన రీతిలో బరువును తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది.


బరువు తగ్గడానికి ముఖ్యంగా తాజా ఆహారాన్ని తీసుకోవాలి. రోజు గంట పాటు వాకింగ్ చేయాలి. వ్యాయామాలు చేయడం అలవాటు చేసుకోవాలి. కొవ్వులు, చక్కెర అధికంగా ఉండే ఆహారాన్ని తినడం మానేయాలి. పప్పు ధాన్యాలు, తృణధాన్యాలు తగ్గించాలి. ప్రాసెస్ చేసిన ఆహారాలు ప్యాకెడ్ ఫుడ్ ను పూర్తిగా మానేయాలి. ఉప్పు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోకూడదు. ఎక్కువగా పండ్లను తినేందుకు ఇష్టపడాలి. ఆకుకూరలతో వండిన వంటకాలను తినాలి. మటన్ వంటి కొవ్వు అధికంగా ఉండే ఆహారాలను తగ్గించాలి. చేపలు తినడం వల్ల ఎలాంటి కొవ్వు పట్టదు. కాబట్టి నాన్ వెజ్ ప్రియులు చేపలు, రొయ్యలు వంటి వాటిని తినడం అలవాటు చేసుకోవాలి.



Also read: పురుష ఉద్యోగులతో పోలిస్తే మహిళా ఉద్యోగుల మానసిక స్థితి దిగజారుతోంది
































































































































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.